
– భవనాల నిర్మాణం పూర్తి అయ్యేది ఎప్పుడు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
అంగన్వాడి కేంద్రాలు ప్రజలకు ప్రస్తుత కాలంలో అనేక సదుపాయాలను కల్పిస్తున్న నిలయాలు కానీ వాటికి పక్క భవనాలు లేక అద్దె భవనాలలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు.సూర్యాపేట జిల్లాలో 1209 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి.వీటి ద్వారా చిన్నారులకు,బాలింతలకు,గర్భిణీ లకు పౌష్టికమైన ఆహారం,వ్యాధి నిరోధక టీకాలు,ఆరోగ్య పరీక్షలు, రిఫరల్ సేవలు,ఆరోగ్య విద్య,పూర్వ ప్రాథమిక విద్య సేవలను అందిస్తున్నారు.ప్రస్తుతం 49,364 మంది చిన్నారులు ఇందులో 0-6 నెలల లోపు పిల్లలు 4,980 మంది ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు 28,471 మంది మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వరకు 15,913 మంది పిల్లలు ఉన్నారు.5,838 మంది గర్భిణీలు,4,876 మంది బాలింతలు కేంద్రాల నుండి పౌష్టిక ఆహా రాన్ని, ఇతర సేవలను పొందుతున్నారు.కానీ అంగన్వాడిల ద్వారా వచ్చే ప్రభుత్వ సేవలను ప్రజలకు అద్దె భవనాలలో ఉండటం మూలంగా కొంత ఇబ్బందుల మూ లంగా అందిస్తున్నారు.పక్కా భవనాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
306 సొంత భవనాలు:
జిల్లాలో 1209 అంగన్వాడి కేంద్రాలు ఉండగా వాటిలో 306 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 454 అద్దెకు ఉన్న భవనాలు ఉన్నాయి.ఇందులో 449 కేంద్రాలు వివిధ ప్రభుత్వ పాఠశాలలలో కొన్ని గదులలో నడుస్తున్నాయి.మిగతావన్నీ అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి.ప్రస్తుతం జిల్లా 1008 భవనాలల్లో పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు విద్యా పోషకాహారాలు అందిస్తున్నారు. అలాగే 201 అంగన్ వాడి భవనాల నిర్మాణం వివిధ దశలలో కొనసాగుతున్నాయి.సొంత భవనాలు లేకపోవడం కారణంగా,అద్దె భవనాల వల్ల ఇంటి యజమానులతో అంగన్వాడి ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ప్రతి నెల సరిగ్గా అద్దె చెల్లించకపోవడం,చిన్నపిల్లల అల్లరితో ఇంటి యజమానుల నుంచి ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.పట్టణ ప్రాంతాలలో అద్దె భవనంలో నడుస్తున్న కేంద్రాలకు రూ 4వేలు,గ్రామాలలో వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నట్లు సమాచారం.ఇవి కూడా ప్రతి నెల రాకపోవడం కారణంగా ఇంటి యజమానులతో అంగన్వాడి ఉద్యోగులు మాటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులు,బాలింతలకు,గర్భిణీల కు అద్దె భవనాలు సరిపోవడం లేదు.పట్టణ ప్రాంతాల్లో ఇచ్చే అద్దె కూడా సరిపోవడం లేదు.ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ప్రతి గ్రామంలో పక్కా భవనాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అన్ని ఒక్క గదిలోనే:
సొంత భవనాలు లేకుండా కిరాయి ఇండ్లలో నడిచే అంగన్వాడి కేంద్రాలలో చాలా వరకు ఒకే ఒక గది ఉన్నాయి.ఆ ఉన్న ఒక గదిలోనే విద్యార్థులకు వంట భోజనాలు,విద్యా బోధన,కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సమస్యల పరిష్కారానికి సొంత భవనాల నిర్మాణమే శాశ్వత పరిష్కారం.
సొంత భవనాలు వెంటనే నిర్మించాలి: చెరుకు ఏకలక్ష్మి..
జిల్లాలో సొంత భవనాలు లేక పిల్లలు బాలింతలు గర్భిణీలు ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే సొంత భవనాలు నిర్మించి వారికి సదుపాయం కల్పించాలని అన్నారు. అలాగే పౌష్టిక కరమైన ఆహారాన్ని అందించి వారి భవిష్యత్తుకు బాటలు కల్పించాలని అన్నారు.