
నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ కోర్టులో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. మంగళవారం పట్టణంలోని భీమేశ్వర గార్డెన్ లో ఏర్పాటుచేసిన ఓటర్ కృతజ్ఞత సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయనకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం న్యాయవాదులతో కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ వేములవాడ రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ లో భాగమైన కోనరావుపేట మండలం ప్రస్తుతం సిరిసిల్ల కోర్టు పరిధిలో ఉన్నందున దానిని వేములవాడ కోర్టు పరిధిలోకి తీసుకురావాలని, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఎక్కువగా కేసులు ఉన్నందున అదనపు కోర్టు ఏర్పాటుకు, అలాగే ప్రస్తుతమున్న కోర్టు భవనంపైన మొదటి అంతస్తు నిర్మాణములకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించాలని,అసోసియేషన్ హాల్ ను సబ్-కోర్టుకు ఇచ్చినందున, కోర్టులో న్యాయవాదుల సంఖ్య పెరిగినందున, కోర్టులోని తూర్పువైపున ఉన్న ఖాళీ స్థలములో గదులను నిర్మించడానికి ప్రభుత్వ పరంగా సహాయం అందించాలని వినతి పత్రంలో కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవదూత రజనీకాంత్, న్యాయవాదులు తిరుమల్ గౌడ్, పొత్తూరి అనిల్ కుమార్, వేముల సుధాకర్ రెడ్డి, కటకం జనార్ధన్, రేగుల రాజ్ కుమార్, తోట శేఖర్, గుజ్జే మనోహర్, కనపర్తి రాజశేఖర్, గుడిసె క్రాంతి ఉన్నారు.