– గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానమును రద్దు చేయాలి…
– పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలి..
– సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు…
నవతెలంగాణ – మునుగోడు
మురికి కంపును ఊడ్చి ఊరినంత శుభ్రం చేసే గ్రామపంచాయతీ కార్మికులకు నెలకు కనీస వేతనం 26 వేలు అందించాలని సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి నిరసనగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు పండుగ రోజులో కూడా సెలవు ఇవ్వకుండా ఎట్టి సాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు. పండగ రోజు గ్రామపంచాయతీలకు సెలవు దినం కల్పించాలని కోరారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని అన్నారు. ఏళ్ల తరబడి నుండి గ్రామపంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులలో అర్హులైన వారిని పర్మినెంట్ చేయాలని అన్నారు. గ్రామాలలో నెలల తరబడి నుండి పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామపంచాయతీ కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొల్ల కురుమల సంఘం జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్, గ్రామపంచాయతీ కార్మికులు రెడ్డి మల్ల యాదగిరి, ఎర్ర అరుణ, పెద్దమ్మ, నీలా అండాలు, లక్ష్మమ్మ, మంగమ్మ, శంకర్, యాదమ్మ, పద్మ, ఏంకులు, ఎల్లమ్మ తదితరులు ఉన్నారు.