– నల్లగొండ వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని నల్లగొండ వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేయకుండా, నేరాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. రౌడీ షీటర్ల కదలికలు ఎప్పటికప్పుడు తమకు చేరతాయని ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం వచ్చిన కొత్త న్యాయ చట్టాలు కఠినంగా ఉన్నాయని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి కేసుల పాలైతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని గ్రహించాలన్నారు. గత నేర చరిత్రను వదిలేసి కుటుంబంతో సంతోషంగా గడిపి కష్టపడి పని చేసుకుని జీవించాలని సూచించారు.