పెయిడ్‌ ఆర్టిస్టులతో ధర్నాలు చేయిస్తారా?

– ఉద్యోగం కోసం వారు దరఖాస్తు కూడా చేయలేదు: బీఆర్‌ఎస్‌ నేతలపై ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ప్రీతం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ నేతలు పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ప్రీతం ఫైరయ్యారు. ధర్నాలు చేస్తున్న వారిలో కొంత మంది ఉద్యోగం కోసం కూడా దరఖాస్తు చేయలేదని ఆరోపించారు. ఇలాగే చేస్తే బట్టలూడదీసి ఉరికేయాల్సి వస్తుందని హెచ్చరించారు. తన పదవి, రాజకీయం వదిలి మీ ముందుకు వస్తానని సవాల్‌ విసిరారు. ‘బరిగే పడతాం, మీ ముందుకు వస్తాం. దొర దగ్గరే ఉండాలా? ఉద్యోగాలు రావద్దా? ఉద్యోగాలు వస్తున్నాయి అంటే మీకు కడుపులో మంట’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నేతలు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని చెప్పారు. ఆపార్టీ నేతలు గాదరి కిశోర్‌, బాల్క సుమన్‌ పరుష పదజాలంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. పదేండ్లలో కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో జాబ్‌ క్యాలెండర్‌ను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. తాము బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమపై కేసులు పెట్టారని విమర్శించారు. గత పదేండ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎందుకు వేయలేదని నిలదీశారు. ఇప్పుడు తాము నోటిఫికేషన్‌ వేస్తే బీఆర్‌ఎస్‌ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఫైరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డిపై పరుషంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్‌ సిగ్గు లేకుండా దళితులను ముందు పెట్టి మాట్లాడిస్తున్నారని తెలిపారు. ఆయన ఎంగిలి మెతుకుల కోసం కొందరు మాట్లాడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులపై మాట్లాడటానికి బీఆర్‌ఎస్‌కు నైతిక అర్హత లేదని చెప్పారు.