– బాల్క సుమన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అన్ని వర్గాలను దగా చేసే పాలనగా మారిందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు.బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసుల దాడి చూస్తుంటే తెలంగాణలో ఉన్నామా? సమైక్య రాష్ట్రంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతుందని తెలిపారు. కడప వెళ్లి షర్మిల కోసం ఊరూరా తిరుగుతా అంటూ సీఎం రేవంత్ సమైక్యవాదుల కోసం తాపత్రాయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో కలుషిత ఆహారం సమస్యలు, యూనివర్సిటీల్లో నియామకాల్లేక సిబ్బంది కొరత, దళిత ఎస్సై ఆత్మహత్య, ఎస్సీ, బీసీ మంత్రులకు అడుగడుగునా అవమానాలతో కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం కొరవడిందని దుయ్యబట్టారు. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లోనే సామాజిక న్యాయమంటున్నారే తప్ప చేతల్లో లేదని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులకు పోలీసుల చేతిలో అవమానాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంగా తనకొచ్చిన అవకాశాన్ని మంచి చేయడానికి ఉపయోగించుకోవాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.