రాష్ట్రానికి సుస్తీ

Susthi for the state‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. కానీ ప్రజలకు ఆ భాగ్యం దూరమవుతోంది. వర్షాకాలం మొదలైంది చాలు ఆసుపత్రుల్లో క్యూ పెరిగింది. రాష్ట్రంలో విజృంభిస్తున్న విషజ్వరాలే దీనికి నిదర్శనం. దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతున్న రోగులతో దావాఖానాలు నిండిపోతు న్నాయి. ఒకపక్క డెంగ్యూ పంజా విసురుతోంది. మరో పక్క చికున్‌ గున్యా వణికిస్తోంది. ఇక జికా వైరస్‌తో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పులు, దోమలు, కలుషిత నీరు కారణంగానే విషజ్వరాలు చుట్టుముడుతున్నాయి. దీంతో అనేక మంది అనారోగ్యపాలై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఇప్పటికే చాలామంది ఆరోగ్యంతో పాటు జేబులు కూడా గుల్ల చేసుకుంటున్నారు. ల్యాబ్‌ల వద్ద రక్త పరీక్షల కోసం రోగులు పడిగాపులు కాస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పదకొండేండ్ల బాలుడు, హైదరాబాద్‌లో ఓ వైద్యుడు సైతం డెంగ్యూ బారినపడి మృతిచెందారు. ఈ ఘటనలు పరిస్థితి తీవ్రతను తెలుపుతున్నాయి.
రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 964 డెంగీ కేసులు నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ వెక్టర్‌-బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీవీబీడీసీ)తాజాగా వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో 706కేసులు నమోద య్యాయి. మూడు నాలుగు జిల్లాల్లో డెంగ్యూ తీవ్రత ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో 327, ఖమ్మం జిల్లాలో 161, మేడ్చల్‌లో 103 కేసులు నమోదయ్యాయని తెలిపింది. గతేడాది తొలి ఆరుమాసాల్లో ఈ మూడు జిల్లాల్లో కేవలం 282 కేసులే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి ఈ ఏడాది డెంగీ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డెంగీతో పాటు మలేరియా, చికున్‌గున్యా కేసులు కూడా పెరుగుతున్నాయి. జూన్‌ చివరి నాటికి రాష్ట్రంలో 71 మలేరియా, 33 చికెన్‌గున్యా కేసులు నమోదైనట్టు తాజా లెక్కలు చెబుతున్నాయి.ఇవి గుర్తించినవి మాత్రమే.
ఇప్పటికే మహారాష్ట్రలో పలుచోట్ల జికా వైరస్‌ కేసులు కలకలం రేపుతున్నాయి.ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి. డెంగ్యూ, చికున్‌ గున్యా మాదిరిగానే జికా వైరస్‌ కూడా దోమల ద్వారానే వస్తుంది. ముఖ్యంగా గర్భిణులకు ఈ వైరస్‌ సోకితే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే సాధారణ జ్వరమైనా సరే డెంగ్యూ, జికావైరస్‌ భయంతో వెంటనే ఆసుపత్రి వద్దకు పరు గులు తీస్తున్నారు. జేబులు ఖాళీ చేసుకుం టున్నారు.
కొన్నేండ్ల నుండి పరిశీలిస్తే రెండేండ్లకోసారి రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 2022లో 8,500 డెంగీ కేసులు నమోదుకాక గతేడాది రెండు వేల కంటే తక్కువ కేసులు రికార్డ్‌ అయ్యాయి. అందుకే ఈ ఏడాది డెంగ్యూ తీవ్రత పెరగొచ్చని వైద్యులు ముందే అంచనా వేశారు. తగు జాగ్రత్తలు తీసుకోవల్సిం దిగా హెచ్చరించారు. అంతేకాదు ఈ సీజన్‌లో తెలంగాణ కు డెంగ్యూ ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా హెచ్చరిం చింది. దేశంలో డెంగ్యూ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉందని పేర్కొంది. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ తీవ్రత గురించి విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో చెప్పినట్టే దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మన రాష్ట్రం ఏడో స్థానంలో వుంది. వాస్తవానికి సీజన్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా వేసవిలోనే తగు ప్రణాళిక రూపొందించుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సరైన దృష్టి పెట్టలేదని నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతోంది. అలాగే సీజనల్‌ వ్యాధుల కట్టడిలో రాష్ట్ర ప్రజారోగ్య విభాగానిదే కీలక పాత్ర. కానీ దాని వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ప్రజా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి తమ పాలనను సుస్థిరం చేసుకునే బిజీలో రాష్ట్ర పాలకులున్నారు. గులాబీ రేకుల్ని తెంపో, తుంపో చేతిలో చెయ్యేయించుకోవడమే కాదు, ఢిల్లీ నుండి తెగబడే ద్రవ్యాకర్షణకు లొంగిపోయే వారిని కట్టడి చేసుకోవడమే కాదు, ప్రజల్ని శత్రుసైనికుల నుండే కాదు, దోమలు, రోగాల నుండి కాపాడడం తక్షణ కర్తవ్యం కావాలి రేవంత్‌ సర్కార్‌కు. ప్రజారోగ్యంతో ఆటలాడటం ప్రభుత్వ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి. ప్రజారోగ్య విభాగాన్ని పటిష్టపరచాలి. కేసులు పెరిగిపోవడంతో ఇప్పుడు ఇంటింటి సర్వేలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ హడావుడిగా ఆదేశాలు జారిచేసింది. ఇదొక్కటే సరిపోదు. ప్రత్యేకంగా ఫీవర్‌ ఓపీ కౌంటర్లు నిర్వహించాలి. పేషంట్ల వెయింటింగ్‌ పీరియడ్‌ను తగ్గించి, రోగాలు వ్యాపించకుండా జాగ్రత్తపడాలి. విష జ్వరాల బెడద ఉన్న జిల్లాలను ముందుగానే గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించాలి. నీటి గుంతలు, కాలువల్లో దోమలు పేరుకుపోకుండా మందు చల్లించాలి. మురికి పేరుకుపోకుండా చూడాలి. డీఎంహెచ్‌వోలతో సమీక్షలు నిర్వహించి అప్రమత్తం చేయాలి.