విద్యా విధానంలో సాంకేతిక పద్ధతుల ద్వారా గుణాత్మకమైన విద్యను అందించాలి..

Quality education should be imparted through technological methods in education system.– ఎమ్మెల్సీ అలుగుబెల్లి నరసింహారెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
విద్యా విధానంలో సాంకేతిక పద్ధతుల ద్వారా గుణాత్మకమైన విద్యను అందించడానికి అందరం కృషి చేయాలని శాసనస మండలి సభ్యులు అలుగుబెల్లి  నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం నాడు బీబీనగర్ మండలం గూడూరు  జిల్లా పరిషత్ హై స్కూల్లో జి సి ఎన్ ఆర్  ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వర్చువల్ రియాల్టీ ల్యాబ్ ను ఆయన జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్చువల్ రియాలిటీ ల్యాబ్ ను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగిన విషయమని,  క్లాస్ రూమ్ టెక్నాలజీలో ఇది విప్లవత్మకమైన మార్పుకు నాంది పలికిందని అన్నారు. టెక్నాలజీ బోధన ద్వారా విద్యార్థులు ఆనందంతో బాగా అర్థం చేసుకుంటారని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఇవి ఉపయోగపడతాయని,  విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడంలో అందరం కృషి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్చువల్ రియాల్టీ ల్యాబ్ బోధన పిల్లలకు సరికొత్త అనుభవం అని, సైన్సులోని వివిధ రకాల కాన్సెప్ట్స్ అర్థమవుతాయని, ఉపాధ్యాయులందరూ ఇలాంటి ఇన్నోవేటివ్ ల్యాబ్ ద్వారా విద్యార్థులలో సైన్స్ విజ్ఞానాన్ని సులువుగా అందించడానికి కృషి చేయాలని తెలిపారు. జి సి ఎన్ ఆర్  ఫౌండేషన్ చైర్మన్ గూడూరు మహేంద్ర మాట్లాడుతూ వర్చువల్ రియాలిటీ  ల్యాబ్ త్వరలో మొబైల్ వ్యానుల ద్వారా మండలానికి ఒకటి త్వరలో ప్రారంభిస్తామని, తద్వారా అన్ని పాఠశాలలో విద్యార్థులకు ఈ సౌకర్యం అందుతుందని,  ఐదు సంవత్సరాలలో రాష్ట్ర మొత్తం ఏర్పాటు చేయడమే మా లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి క్విజ్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.