కాంగ్రెస్‌వి గారడీ మాటలే తప్ప..

కాంగ్రెస్‌వి గారడీ మాటలే తప్ప..– గ్యారంటీల అమలు లేదు
– ఎన్నికల ముందు మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం
– 420 హామీలను అమలు చేయాలి
– చిలుక వాగు అభివద్ధికి నిధులు తెచ్చిన పనులు చేయించకపోవడం దారుణం
– 8 నెలలో తాండూరులో కాంగ్రెస్‌ చేసింది శూన్యం
– మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
తాండూరు నియోజకవర్గంలో 8 నెలల కాలంలో కాంగ్రెస్‌ పార్టీ చేసింది శూన్యమని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణ కేంద్రంలోని ఆయ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ వి గారడి మాటలు తప్ప గ్యారంటీల అమలు లేదన్నారు. తాండూర్‌ను ఇసుక, ఘనులు, సెటిల్మెంట్‌ మాఫియాగా మార్చారన్నారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సెటిల్మెంటులలో కుటుంబ సభ్యులను అదుపు చేయాలన్నారు. తాండూర్‌ అభివద్ధి కోసం నేను తీసుకొచ్చిన1682 కోట్ల రూపాయల పనులను చేయాలన్నారు. తాండూరులో చిలుక వాగు అభివద్ధి కోసం 16 కోట్ల రూపాయలను నిధులను గతంలోనే మంజూరు చేయడం జరిగిందన్నారు. తెచ్చిన నిధులతో పనులు చేసేందుకు సైతం చేతకావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌ రెడ్డి పాలనలో ప్రజలను గాలికి వదిలేశారన్నారు. ప్రజలకు మోసపూరిత హామీలను చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో వివిధ సభల్లో రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటలకే దిక్కు లేదన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లో తులం బంగారం కానుకగా ఇస్తామన్న సంగతి ఏమైంది ప్రశ్నించారు. అలాగే పింఛన్లు అందకపోవడంతో వద్ధులు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల వైపు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. గతంలో ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా బీఆర్‌ఎస్‌ పార్టీ పాలన కొనసాగించిన అంశాన్ని గుర్తు చేశారు. తాండూరులో కాంగ్రెస్‌ ప్రస్తుత ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి అనుచరులు కుటుంబ సభ్యులు తాండూరులో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఇది తగదని హెచ్చరించారు. గ్రామాల్లో కాంట్రాక్టర్లు అభివద్ధి పనులు చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదన్నారు. తాండూరు నియోజకవర్గంలో గనులు, ఇసుక సెటిల్మెంట్లు, గనులు ఇసుక మాఫియాగా మారుస్తున్నారని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. తాండూరులో రోడ్లు, మున్సిపాలిటీ వ్యవహారాలు అధ్వానంగా మారిందని, రానున్న రోజుల్లో తాండూరు ప్రజలు బుద్ధి చెప్పే కాలం దగ్గర్లోనే ఉందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు శ్రీశైల్‌ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మెన్‌ రాజు గౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు విజరు కుమార్‌, వెంకట్‌ రెడ్డి, నరేందర్‌ గౌడ్‌, నర్సిరెడ్డి, అప్పు నహీం, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.