‘అగాధం అంచున ప్రపంచం’

'A world on the brink'– ప్రముఖ రాజకీయ శాస్త్రవేత
ప్రపంచం ఒక పెద్ద పరివర్తనకు లోనవుతున్నందున అగాధం అంచున ఉందని ప్రముఖ రష్యన్‌ రాజకీయ శాస్త్రవేత్త అలెగ్జాండర్‌ డైన్కిన్‌ హెచ్చరించాడు. 60 సంవత్సరాల క్రితం క్యూబా క్షిపణి సంక్షోభం సమయంలో ప్రపంచం చివరిసారిగా విపత్తుకు దగ్గరగా వచ్చిందని రష్యన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ ఎకానమీ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌గా ఉన్న డైన్‌కిన్‌ గురువారం మాస్కోలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో చెప్పాడు. 21వ శతాబ్దంలో యుద్ధం-శాంతి’ పేరుతో రాబోయే లియో టాల్‌స్టారు ఇంటర్నేషనల్‌ పీస్‌ ప్రైజ్‌ అవార్డు వేడుకకు సన్నాహాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. వందల సంవత్సరాలుగా ప్రపంచ క్రమం ఐరోపా చేత, ఇటీవల దాకా అమెరికా చేత నిర్దారించబడిందని డైన్కిన్‌ పేర్కొన్నాడు. అయితే, ఉక్రెయిన్‌లో సంఘర్షణ తరువాత, రష్యా, చైనా, భారతదేశం భాగస్వామ్యంతో ప్రత్యామ్నాయ అంతర్జాతీయ నిర్మాణం మొదటిసారిగా రూపుదిద్దుకుంటుందని, రాజకీయ తూర్పు రాజకీయ పశ్చిమకు సమాన భాగస్వామిగా ఉంటుందని ఆయన వాదించాడు. యూరోపియన్‌ యూనియన్‌, అమెరికావలె కాకుండా, చైనా, భారతదేశం ఉక్రెయిన్‌ వివాదంపై రష్యాను ఖండించడానికి నిరాకరించాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారం మాస్కోకు వెళ్లి 2022లో శత్రుత్వం చెలరేగిన తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశమయ్యాడు.
అమెరికా ప్రపంచంపై తన ప్రభావం కోల్పోవడంతోపాటు ఆ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్‌ జో బైడెెన్‌ వృద్ధాప్యంతో వచ్చిన మానసిక సమస్యల కారణంగా పశ్చిమ దేశాలు నిర్లక్ష్యంగా చర్యలు, నిర్ణయాలు తీసుకోవడానికి దారితీస్తుందని డైన్కిన్‌ హెచ్చరించాడు. బుధవారంనాడు బైడెన్‌ వాషింగ్టన్‌లో నాటో శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించి అమెరికా నేతత్వంలోని మిలిటరీ కూటమి ఎప్పటికంటే శక్తివంతమైనది అని, రష్యా, ఉక్రెయిన్‌ మధ్య వివాదంలో తీవ్రమైన సవాలును ఎదుర్కొంటున్నదని ప్రకటించాడు.