సీఎం సూచన.. కలెక్టర్‌ ఆచరణ..!

సీఎం సూచన.. కలెక్టర్‌ ఆచరణ..!– గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బాధితుల్లో చిగురిస్తున్న ఆశలు
నవతెలంగాణ-జైపూర్‌
జాతీయ రహదారుల నిర్మాణాల్లో భూ సేకరణలో వేగం పెంచాలని, భూములు కోల్పోతున్న రైతులతో సంప్రదింపులు జరిపి వారికి న్యాయం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచనతో కలెక్టర్లు చర్యలు చేపట్టారు. దీంతో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బాధిత రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పరిహారం పెంచాలని ఇదివరకే పలుమార్లు జిల్లా కలెక్టర్‌ను కలిసిన బాధిత రైతులు తమ భూములకు మార్కెట్‌ రేట్‌తో పరిహారం చెల్లించాలని కోరారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందో ఆ మొత్తం రైతులకు దక్కెలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు మరుసటి రోజు మండల రైతులకు కలెక్టర్‌ కబురు పంపారు. కలెక్టర్‌ కార్యాలయంలో కలిసి రైతులతో మాట్లాడిన కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఎన్‌హెఏఐ అధికారులతో మాట్లాడి వారితో ముఖాముకి ఏర్పాటు చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు.
మార్కేట్‌ రేటు ఇవ్వాలని డిమాండ్‌
నాగాపూర్‌-విజయవాడ మధ్యన నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో జైపూర్‌ మండల పరిధిలో గల వివిధ గ్రామ శివారులకు సంబంధించిన 272 ఎకరాల 39 గుంటల భూమిని మండల రైతులు నష్టపోతున్నారు. సుమారుగా 650 మందికి చెందిన వ్యవసాయ భూములు రసూల్‌పల్లి నుండి గోపాల్‌పూర్‌ శివారు గోదావరి నది వరకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో నష్టపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పట్ల బాధితులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నష్టపోతున్న భూములు బహిరంగ మార్కెట్‌లో ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర పలుకుతోందని కలెక్టర్‌ను కలిసిన రైతులు వివరించారు. కాగా ప్రాంతాల వారిగా నష్టపరిహారం నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే బాధిత రైతులకు నోటీలు జారీ చేసింది. ఎకరాకు రూ.4 లక్షల 35 వేల నుండి రూ.12 లక్షల వరకు నిర్ణయించి నోటీసులు జారీ చేయడంతో రైతులు తమ భూములు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ రేట్‌ ప్రకారం పరిహారం చెల్లిస్తే తప్పా భూములను వదులుకోలేమని గత ఏడాదిగా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులను కలిసి వినతీ పత్రాలు అందజేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరతో పోల్చి చూస్తే బహిరంగ మార్కెట్‌ ధరలో ఎంత మాత్రం పొసగడం లేదంటున్న రైతులు నష్టపోతున్న భూములకు బదులుగా మరో చోట భూములు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నెల 19న ముఖాముఖి ఏర్పాటు చేసి వీలైనంత ఎక్కువగా పరిహరం చెల్లింపుకు కృషి చేస్తామని కలెక్టర్‌ దీపక్‌ కుమార్‌ హామీ ఇచ్చినట్లు బాధిత రైతులు తెలిపారు.
పదేపదే భూములు నష్టపోతున్న రైతులు
గతంలో సింగరేణిథర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌, ఇందారం ఓపన్‌కాస్ట్‌ గని ఏర్పాటుకు వేల ఎకరాలు నష్ట పోవల్సి వచ్చింది. ప్రస్తుతం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణంలో మరింత భూమి నష్టపోతుండగా వ్యవసాయ క్షేత్రంగా విలసిల్లిన మండలంలో వ్యవసాయ క్షేత్రాలు అభివృద్ధి మసకబారిపోతున్నాయని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరై భూములను నష్టపోవల్సి వచ్చినా పరిహారం చెల్లింపుల్లో అన్యాయం జరుగుతుందని, ఇక్కడ నష్టపోయిన భూమిని మరో చోట కొనుగోలు చేయాలనుకుంటే రెట్టింపు ధరలతో కొనుగోలు చేయాల్సివస్తోందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పరిస్థితులపై అద్యయనం చేసి న్యాయపరంగా పరిహారం చెల్లిస్తే మరో చోట భూములు కొనుగోలు చేసి వ్యవసాయాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం సహకరించాలని మండల పరిధి బాధిత రైతులు అభ్యర్థిస్తున్నారు.