నవతెలంగాణ – కమ్మర్ పల్లి
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి ముందు ఐసిడిఎస్ భీంగల్ ప్రాజెక్టు పరిధిలోని ఆయా గ్రామాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలు అమలయ్యేలా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కైరి దేవగంగు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడి టీచర్లకు వేతనాలు పెంచి, పదవి విరమణ ప్రయోజనాలు కల్పించాలన్నారు.అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: జిల్లా అధ్యక్షురాలు దేవగంగు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలకు చర్యలు చేపట్టాలనితెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కైరి దేవగంగు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల్పూర్ లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు పిల్లలు కిషోర్ బాలికల పోషకాహార లోపాన్ని తగ్గించడంలో, 0-6 సంవత్సరాల పిల్లల సమగ్ర అభివృద్ధి సాధించడంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారు అన్నారు. గత ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలో 24 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. అంగన్వాడీ టీచర్స్ ను మూడవ తరగతి, హెల్పర్స్ ను నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని, పెండింగ్ లో ఉన్న రెగ్యులరైజేషన్, 45వ ఐఎల్ సి సిఫార్సులను అమలు చేయాలన్నారు. కనీసం వేతనం నెలకు రూ.26 వేలు, పెన్షన్ నెలకు రూ. 10వేలు, పిఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, స్కీం వర్కర్లు అందరికీ వెంటనే పే కమిషన్ ఏర్పాటు చేయాలని, గ్రాట్యూటీ పై సుప్రీంకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలన్నారు. జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ భీమ్గల్ ప్రాజెక్టు పరిధిలోని మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.