నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలలో గత పది నుండి 12 సంవత్సరాల వరకు ఒకే చోట పనిచేస్తున్న వార్డెన్లను బదిలీ చేయాలని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు. వార్డెన్లు ఒకే చోట పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తును గాలికివదిలేశారని ఆరోపించారు. సోమవారం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డెన్లు ఒకే చోట అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆరోపించారు. బాధ్యతారహితంగా విధులను నిర్వర్తించడమే కాకుండా వివిధ సంఘాలలో ఉండి సంఘ పదవులు అనుభవిస్తూ సంఘాలు అడ్డుపెట్టుకొని, తప్పుడు అనారోగ్య సర్టిఫికెట్లు సృష్టించి, ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలోనే ఉండాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు అందవలసిన నాణ్యమైన భోజనం, వసతులు కల్పించకుండా అక్రమ పద్ధతిలో అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కావున ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం లాంగ్ స్టాండ్ అయిన ప్రతి ఒక్కరిని విధిగా బదిలీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, విద్యార్థి సంఘం ఓయూ రాష్ట్ర కార్యదర్శి బాకీ తరుణ్, సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, అలంపల్లి కొండన్న, రఘు, పాల్గొన్నారు.