నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటింటా ఇన్నోవేషన్ గోడపత్రికను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం నూతన ఆవిష్కరణల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆవిష్కర్తలు ఆగస్టు 3లోగా నూతన ఆవిష్కరణలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సెల్ ఫోన్ నెంబర్ 9100678543 నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించాలని ఆయన కోరారు.ఆవిష్కర్త పేరు, వయస్సు, ఫోటో, వృత్తి, గ్రామము, మండలం, జిల్లా ,ఆవిష్కరణ పేరు, ఆవిష్కరణకు సంబంధించిన వివరణ 100 పదాలతో రాసి పంపించాలని,అలాగే ఆవిష్కరణ కు సంబంధించిన నాలుగు ఫోటోలను, రెండు నిమిషాల వీడియోను పైన పేర్కొన్న సెల్ ఫోన్ నెంబర్ కు స్కాన్ చేసి అప్లై చేయాలని ఆయన వెల్లడించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర ,అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిపిఓ మురళి, ఇంటింటా ఇన్నోవేషన్ నల్గొండ జిల్లా కో-ఆర్డినేటర్ మాలోతు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.