– అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి త్రివేణి
– సిర్పూర్ ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నా
నవతెలంగాణ-కాగజ్‌నగర్
గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదని, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు ప్రస్తావించాలని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి త్రివేణి కోరారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం ఎమ్మెల్యే ఇంటి ఎదుట అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయడం జరిగిందన్నారు. హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. లక్ష, టీచర్లకు రూ. రెండు లక్షలు, ఆసర పెన్షన్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. 65 సంవత్సరాలలోపు రిటైర్ అయిన అంగన్‌వాడీ టీచర్స్ హెల్పర్స్‌కు వీఆర్‌ఎస్ వర్తింపు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర రెండవ పీఆర్‌సీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన ఐదు శాతం ఐఆర్‌ను అంగన్‌వాడీ టీచర్స్ హెల్పర్‌్‌సకు వర్తింపుచేయాలన్నారు. మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ సెంట్రల్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ జీఓ ఇస్తామని, సమ్మె కాలపు వేతనాలు చెల్లిస్తామని, ప్రమాద బీమా రూ.రెండు లక్షలు చెల్లిస్తామని, ఆన్‌లైన్ ఒకే యాప్ ఉండే విధంగా చేస్తామని హామీలిచ్చారన్నారు. అవి అమలయ్యేలా చూడాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబీకుడు పాల్వాయి సుధాకర్ రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి, యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు అరుణ, మల్లేశ్వరి, వినోద, కృష్ణవేణి, కుమారి, రజిత, ఉమాదేవి, హేమవతి, రాజమణి, శ్రీలత, అర్చన, మంగళ, జయప్రద, నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు సెక్టార్ బాద్యులు ప్రాజెక్ట్ నాయకులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్ష తొమ్మిదవ రోజులో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి అంగన్‌వాడీలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే కోవలక్ష్మి ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేకు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యల పరిష్కరించాలని తొమ్మిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అంగన్‌వాడీలకు నష్టం కలిగించేల ఉన్న జీఓ నెంబర్ 10 రద్దు చేయాలన్నారు. పౌష్టికాహార లోప నివారణలో అంగన్‌వాడీల పాత్ర ఎంతో ఉందని ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం గ్రహించకపోవడం బాధాకరమన్నారు. అంగన్‌వాడీల ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ మొత్తాన్ని టీచర్లకు రూ.రెండు లక్షలు, హెల్పర్లకు రూ.లక్షలకు పెంచాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మడవి గంగామణి, సీఐటీయూ ఉపాధ్యక్షులు శ్రీకాంత్, నాయకులు వనిత, ఉమ, రాజేశ్వరి, జంగు, తార, హిరబాయి, సరోజ, లత పాల్గొన్నారు.