”అమెరికా మీద దాడి జరుగుతోంది, ముట్టడిలో ఉంది, ప్రజాస్వామ్యాన్ని హతమార్చేందుకు చూస్తున్నారు. చీకటి అధ్యాయానికి నాంది” మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హత్యాయత్నంపై వెలువడిన తక్షణ వ్యాఖ్యలివి.అతగాడు ప్రాణాపాయం నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు. శనివారం నాడు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్ అనే పట్టణంలో ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఒక దుండగుడు జరిపిన కాల్పులో ట్రంప్‌కు కుడి చెవి దగ్గర బుల్లెట్ గాయం తగిలింది. దుండగుడి కాల్పుల్లో సభికుల్లో ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హంతకుడిని వెంటనే భద్రతా దళాలు కాల్చి చంపాయి. సభ సమీపంలోని ఒక భవనంపై మాటువేసి కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. ఈ ఉదంతం తరువాత అమెరికా రాజకీయాలు, ఎన్నికల్లో ఏం జరగనుందనే చర్చ మొదలైంది.దీనికి ముందు డెమోక్రటిక్ అభ్యర్ధి జోబైడెన్ వృద్దాప్యం గురించి, పోటీ నుంచి తప్పుకొని ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ లేదా మరొకరికి అవకాశం ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. హత్యాయత్నంతో సానుభూతి తలెత్తి ట్రంప్ విజయావకాశాలు మెరుగుపడినట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో పార్టీల నేతలు, ఎన్నికల్లో అభ్యర్థులపై ౖ జరిగే దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఎన్నికల్లో ప్రత్యర్థి జో బైడెన్ వెంటనే ఖండించాడు. ట్రంప్‌పై దాడిని వివిధ దేశాల నేతలు ఖండించారు. దుండగుడు ఇరవై ఏండ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా నమోదై ఉన్నాడు. గతంలో డెమోక్రటిక్ పార్టీకి విరాళం ఇచ్చిన దాఖలా కూడా వెల్లడైంది. ఎందుకు కాల్పులు జరిపాడో వెంటనే తెలియలేదు. క్రూక్స్‌కు తొలిసారిగా ఓటు హక్కు వచ్చింది. తాను ట్రంప్‌ను, రిపబ్లికన్ పార్టీని కూడా వ్యతిరేకిస్తున్నట్లు అతడు చెప్పాడన్న వార్తలు కూడా వచ్చాయి. కేవలం ఈ మాత్రానికే దాడికి పాల్పడతాడా? దీని వెనుక డెమోక్రటిక్ పార్టీ,ట్రంప్ మరోసారి అధికారానికి రాకూడదని కోరుకుంటున్న ప్రభుత్వంలోని వారు, రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా దేశాల హస్తం ఉండవచ్చా అనే సందేహాలను కూడా కొందరు లేవనెత్తినట్లు చెబుతున్నారు. దుండగుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది.ఉగ్రవాదం నుంచి కూడా పెట్టుబడిదారులు ఎలా లాభాలు పొందుతారో ట్రంప్‌పై కాల్పుల ఉదంతం వెల్లడించింది. ఈ ఉదంతం తరువాత ట్రంప్ మీడియా మరియు టెక్నాలజీ గ్రూపు కంపెనీల వాటాల ధరలు సోమవారం నాడు 55శాతం పెరిగాయి, ఒక దశలో 71శాతాన్ని తాకాయి. ఈ కారణంగా ట్రంప్ సంపద విలువ ఒక్క రోజులోనే రెండు బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ కంపెనీ ట్రంప్ సామాజిక మాధ్యమ ప్రచారాన్ని నిర్వహించే ట్రూత్ సోషల్ వేదికను కూడా నిర్వహిస్తున్నది. అనేక కంపెనీల వాటాల ధరలు కూడా పెరిగాయి. దీని అర్దం ఏమిటి ? ట్రంప్ ఎన్నిక అవకాశాలు పెరిగినట్లు పెట్టుబడిదారులు భావించటమే దీనికి కారణం. ట్రూత్ సోషల్‌ను అనుసరించే వారు కూడా గణనీయంగా పెరగటంతో నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ రానున్న రోజుల్లో లాభాల బాట పట్టినట్లే. తుపాకులు, తూటాలు తయారు చేసే కంపెనీల వాటాల ధరలు కూడా పెరిగాయి.
ట్రంప్‌పై దాడి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిలో కొందరు మూడు సంవత్సరాల క్రితం 2021జనవరి ఆరవ తేదీన అమెరికా అధికార కేంద్రంపై దాడికి తన మద్దతుదార్లను పంపిన డోనాల్డ్ ట్రంప్ నిర్వాకాన్ని విస్మరించారు. ట్రంప్‌పై దాడి వ్యక్తిగతం, కానీ అతగాడి మద్దతుదార్ల చర్య మొత్తం అమెరికా అధికార, ప్రజాస్వామిక వ్యవస్థనే అపహాస్యం పాలు చేసిందనే అంశాన్ని మరిచిపోరాదు. అమెరికా, దాని ప్రజాస్వామ్యం మీద అసలైన దాడి అది.అమెరికాలో నలుగురు అధ్యక్షులను తుపాకి తూటాలు బలితీసుకున్నాయి. కొంతమంది అధ్యక్షులు తృటిలో తప్పించుకున్నారు, ఇటీవలి కాలంలో రాజకీయపరమైన దాడులు మరింతగా పెరుగుతున్నాయి. కానీ దేశ అధికార కేంద్రంపై ట్రంప్ నాయకత్వంలో జరిగిన దాడి చరిత్రలో అదే మొదటిది. తాను ఓడిపోతే ఫలితాలను అంగీకరించేది లేదని ముందుగానే అపర ప్రజాస్వామికవాది ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓడిపోయిన తరువాత విజేతను అధికారికంగా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని జరగకుండా చూసేందుకు, జో బైడెన్ గద్దెనెక్కకుండా చేసేందుకు ట్రంప్ చేసిన కుట్రలో భాగమది. అంతే కాదు దేశీయ ఉగ్రవాదం అనే కోణంలో ఎఫ్‌బిఐ, ఇతర చట్టాన్ని అమలు జరిపే సంస్థలు చూశాయి. దాడికి ముందు అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు కొద్ది దూరంలో తన మద్దతుదారులతో సమావేశం జరిపిన ట్రంప్ కాపిటోల్‌ను ఆక్రమించాలని, ఎన్నిక నిర్దారించే పత్రాన్ని ఇవ్వకుండా అడ్డుకోవాలని రెచ్చగొట్టి పంపించాడు. ఈ కేసులో కొంత మందికి శిక్షలు పడినప్పటికీ డోనాల్డ్ ట్రంప్‌పై విచారణ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలలోపు పూర్తయ్యే అవకాశం లేదు, ఒకవేళ ట్రంపు గెలిస్తే అసలు విచారణే ఉండకపోవచ్చు, ఓడితే వచ్చే ఏడాది జరగవచ్చు.
ట్రంప్‌పై దాడి ప్రపంచానికి చూపుతున్నదేమిటి ? అమెరికాలో రాజకీయ విభజన కారణంగా రాజకీయ హింస కూడా పెరుగుతున్నది. దాడి వెనుక మూడు కారణాలున్నట్లు ఒక అభిప్రాయం. ఒకటి, ట్రంప్ గెలవకూడదని కోరుకుంటున్న ప్రభుత్వం లోని వారి హస్తం, ట్రంప్ వంటి పచ్చిమితవాది అధికారానికి రాకూడదని కోరుకుంటున్న వామపక్ష తీవ్రవాద శక్తులు, ఎవరితో ప్రమేయం లేకుండా ట్రంప్ మీద తలెత్తిన వ్యక్తిగత ఆగ్రహం కారణంగా కాల్పులు జరిపి వుండవచ్చని చెబుతున్నారు. ఈ కారణాలతో రానున్న రోజుల్లో మరిన్ని ప్రయత్నాలు జరగవచ్చన్న హెచ్చరికలు వెలువడ్డాయి. అమెరికా చరిత్రలో రాజకీయ హింసాకాండ నేతలపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. అమెరికా తొలి అధ్యక్షుడు అబ్రహం లింకన్. 1865 ఏప్రిల్ 14న జాన్ విల్కెస్ బూత్ కాల్చి చంపాడు. నల్ల జాతీయుల హక్కులకు మద్దతు ఇవ్వడమే లింకన్ హత్యకు కారణం. బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలకే అమెరికా 20వ అధ్యక్షుడైన అమెస్ గార్‌ఫీల్డ్‌ను హత్య చేశారు. 1881 జూలై 2న వాషింగ్టన్ రైల్వే స్టేషన్‌లో నడుస్తుండగా ఛార్లెస్ గిటౌ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రజలతో కరచాలనం చేస్తుండగా అమెరికా 25వ అధ్యక్షుడైన విలియం మెకిన్లే 1901 సెప్టెంబర్ 1న న్యూయార్క్‌లోని బఫెలోలో హత్యకు గురయ్యారు. 28 సంవత్సరాల నిరుద్యోగ వైద్యుడు కాల్పులు జరిపాడు. 1965 నవంబర్‌లో 35వ అధ్యక్షుడైన జాన్ ఎఫ్ కెన్నడీ తన సతీమణి జాక్వెలిన్‌తో కలిసి డల్లాస్‌లో పర్యటిస్తుండగా హంతకుడు లీ ఆర్వీ ఆస్వాయిడ్ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ హత్య గురించి తలెత్తిన అనుమానాలు ఇంతవరకు తీరలేదు, అదొక రహస్యంగా ఉండిపోయింది.
రెండుసార్లు దేశాధ్యక్షుడిగా పనిచేసి, మూడోసారి పోటీకి దిగిన థియొడోర్ రూజ్‌వెల్ట్‌పై ప్రచార సందర్భంగా 1912లో మిల్వాకీలో కాల్పులు జరిగాయి. అయితే ఆయనకు తీవ్రమైన గాయాలేవీ కాలేదు. అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ 1933 ఫిబ్రవరిలో మియామీలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ ఘటన నుండి రూజ్‌వెల్ట్ తప్పించుకున్నప్పటికీ చికాగో మేయర్ ఆంటన్ సెర్మాక్ చనిపోయాడు. 1950లో 33వ అధ్యక్షుడు హారీ ఎస్. ట్రూమన్ నివసిస్తున్న బ్లార్ హౌస్‌లోకి ఇద్దరు సాయుధులు ప్రవేశించి కాల్పులు జరిపారు. ట్రూమన్ తప్పించుకున్న ప్పటికీ ఎదురు కాల్పుల్లో అధ్యక్ష భవనం పోలీసు, ఒక దుండగుడు చనిపోయాడు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాబర్ట్ కెన్నడీని లాస్ ఏంజెల్స్ హోటల్‌లో హత్య చేశారు. 1972లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన జార్జ్ వాలస్‌పై కాల్పులు జరిగాయి. 1975లో 38వ అధ్యక్షుడైన ఫోర్డ్ కొన్ని వారాల వ్యవధిలోనే రెండు హత్యాయత్నాల నుండి తప్పించుకున్నారు. 40వ అధ్యక్షుడైన రోనాల్డ్ రీగన్ 1981 మార్చిలో వాషింగ్టన్ డీసీలో జనంలో ఉన్న జాన్ హింక్లీ జూనియర్ కాల్పులు జరిపాడు. ఆయన కోలుకున్నప్పటికీ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్ బుష్ 2005లో జార్జియా అధ్యక్షుడు మిఖాయిల్ సాకష్వీతో కలిసి ఓ ర్యాలీకి హాజరు కాగా ఆయనపై చేతి గ్రెనేడ్ విసిరారు. అయితే అది పేలకపోవడంతో ఎవరూ గాయపడలేదు. అమెరికా రాజకీయ ముఖచిత్రాన్ని చూసినట్లయితే కొన్ని అంశాలలో తేడాలున్నప్పటికీ డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు రెండూ అక్కడి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పాటుపడేవే. ఇటీవలి కాలంలో రెండు పార్టీల వైఫల్యాలు గతం కంటే ఎక్కువగా జనం నోళ్లలో నానుతున్నాయి. ప్రపంచంలో అమెరికా పెత్తనాన్ని సాగించేందుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, పరువు పోతున్నది. ఎన్నికల సమయంలో వ్యక్తిగత బలహీనతలు, అవినీతి అక్రమాలను బయటపెట్టుకోవటం ఇటీవలి కాలంలో పెరుగుతున్నది. విధానపరమైన వైఫల్యాలు రెండు పార్టీల్లో ఉండటమే దీనికి కారణం. ఈ పూర్వరంగంలోనే మూడవ అభ్యర్థికి మద్దతు ఇవ్వటం గురించి అమెరికా సమాజంలో చర్చ ప్రారంభమైంది. కాల్పులు జరిగిన వెంటనే రక్తం కారుతున్న ట్రంప్‌ను భద్రతా సిబ్బంది తీసుకువెళుతుండగా ట్రంప్ చేయెత్తి తనకేమీ కాలేదన్న సంకేతం ఇచ్చిన ఫొటోను చూపి కొందరు ట్రంప్ అభిమానులు తమనేత దేశం కోసం ఒక హీరో మాదిరి నిలబడిన తీరును చూపుతున్నదని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగనున్నందున ప్రచారం మరింత తీవ్రం కానుంది. గురువారం నాడు జరిగే ఒక సమావేశంలో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని లాంఛనంగా పార్టీ ప్రకటించనుంది. ప్రతిదాన్నీ సొమ్ము చేసుకొనేందుకు ఎదురు చూసే కొందరు గాయపడిన ట్రంప్ బొమ్మను ముద్రించిన టీ షర్టులను అందుబాటులోకి తెచ్చారు.
ట్రంప్ ప్రాజెక్టు 2015పేరుతో ముందుకు తెస్తున్న అజెండా కార్మికవర్గం మీద దాడికి ఉద్దేశించిందని పురోగామి రాజకీయ బృందం హెచ్చరించింది. పౌరహక్కులకు ముప్పు ఏర్పడిందని ఆఫ్రో-అమెరికన్ల కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ట్రంప్ కోరిక మేరకు మితవాద హెరిటేజ్ ఫౌండేషన్ దీన్ని రూపొందించింది. దీన్ని అమలు జరిపేందుకు ట్రంప్ నియంతగా మారే అవకాశం ఉందని కూడా పేర్కొన్నది. తాను తిరిగి అధికారానికి వస్తే రాజ్యాంగంలోని కొన్నిసెక్షన్లను తొలగిస్తానని ఏడాది క్రితమే ట్రంప్ చెప్పిన అంశాన్ని గుర్తు చేసింది. తొమ్మిది దశాబ్దాల క్రితం చేసిన జాతీయ కార్మిక సంబంధాల చట్టాన్ని వెనక్కు తీసుకుంటామని ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్నపుడు నియమించిన బోర్టులో అత్యధికులు కార్మిక వ్యతిరేకులు ఉన్నారు. సోషలిజం విఫలమైందని గతంలో అమెరికా చెప్పింది. కానీ అదే అమెరికాలో ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే భావం విస్తరిస్తోంది.
చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాలతో పోల్చి వేస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు. అక్కడ ధనిక-పేద వ్యత్యాసం పెరిగిపోతోంది. మధ్యతరగతి వర్గం కనుమరుగు అవుతోంది. ఆర్థిక, వలసకార్మికులను అనుమతించే విధానాలపై అసంతృప్తి పెరుగుతున్నది. ఈ పూర్వరంగంలోనే సామాజిక వైరుధ్యాలు పెరుగుతున్నాయి. ఎవరు ఎవరిని ఎప్పుడు ఎందుకు కాల్చిచంపుతారో తెలియదు. తుపాకి లేకుండా జనాలు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. తుపాకి సంస్కృతిని పెంపొందించటం, వాటిని తయారు చేసే కార్పొరేట్లకు లాభాలు సమకూర్చటంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరూ తక్కువ తినలేదు. పామును పాలుపోసి పెంచిన చేతినే అది కాటువేస్తుంది. అందువలన ఆ తుపాకులకు ఎప్పుడు ఎవరు బలౌతారో చెప్పలేని అయోమయ స్థితి నేడు అమెరికాలో ఉంది. ఒక దుండగుడు కాదు, అలాంటి వారిని తయారు చేసిన వ్యవస్థ, దాన్ని కాపాడుతున్నవారే ప్రజాస్వామ్యానికి అసలైన ముప్పు. 2021 జనవరి ఆరున తన గుంపును అమెరికా అధికార కేంద్రం మీద దాడికి ఉసిగొల్పిన ట్రంప్ నుంచే అసలైన ముప్పుకు నాంది. ఇలాంటి ట్రంపు, అతగాడి ఇతర వెర్రి వేషాలను కూడా అక్కడి మీడియా జనానికి చెప్పటం లేదు. ఇది కూడా అమెరికాకు ముప్పు తెచ్చేదే !
– ఎం కోటేశ్వరరావు, 8331013288