గాంధీభవన్‌లో ఆషాడం బోనాలు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్‌ బోనాల పండుగను నిర్వహించారు. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు సునీతారావు నేతృత్వంలో నిర్వహించిన ఆషాడం బోనాల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. గాంధీభవన్‌ నుంచి భూ లక్ష్మమ్మ గుడి వరకు పెద్ద ఎత్తున డప్పు, వాయిద్యాల మధ్య శివశత్తులతో వెళ్లి బోనాన్ని సమర్పించారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మెన్లు బండ్రు శోభారాణి, కల్వ సుజాత, అధికార ప్రతినిధులు భవానీ రెడ్డి, ఇందిరా, మహిళా కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కోఆర్డినేటర్‌ నీలం పద్మ, ఉపాధ్యక్షులు సదాలక్ష్మి, అధికార ప్రతినిధులు, ఆయా జిల్లాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.