నవతెలంగాణ – శాయంపేట
పత్తి పంట పొలాల్లో అధిక విష ప్రభావం కలిగిన రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని మండల వ్యవసాయ అధికారి గంగాజమున రైతులకు సూచించారు. శాయంపేట రైతు వేదిక ఆవరణలో బిసిఐ రైతులకు గురువారం పురుగుమందుల వాడకంపై ప్రజ్వల్ కంపెనీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని మాట్లాడారు. పంట పొలాల్లో పురుగు మందులు పిచికారి చేసే సమయంలో శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలని సూచించారు. పురుగుమందు డబ్బాలపై ఎర్ర రంగు గుర్తులు కలిగినవి అత్యంత ప్రమాదకరమైనవని, వాటిని వినియోగించవద్దని సూచించారు. పర్యావరణానికి, మానవులకు, పక్షులకు, జంతువులకు హాని జరుగుతుందన్నారు. పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు చనిపోతాయని, భూమిలో సేంద్రీయ కర్బనం తగ్గి భూములలో సారం తగ్గిపోయి చౌడు నెలలుగా తయారవుతాయని అన్నారు. రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచుకొని వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు అహమ్మద్ రజా, అర్చన, ప్రజ్వల్ ప్రతినిధి కుక్కల కల్పన, పి యు గుడిమల్ల మానస, మేనేజర్ క్షేత్ర ప్రతినిధులు రాంబాబు, గౌస్, భానుమతి, బిసిఐ రైతులు పాల్గొన్నారు.