భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పెద్దవాగు ఘటన పట్ల స్పందించిన రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఆయన హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలకు స్వయంగా ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పెద్దవాగు సంఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే ఆ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కు దగ్గరలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో మంత్రి స్వయంగా మాట్లాడారు. మంత్రిగారి విజ్ఞప్తి మేరకు, ఆ వాగులో చిక్కుకున్న 30 మంది కూలీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేసి వారిని రక్షించింది. సహాయక చర్యలలో పాల్గొని ప్రజల ప్రాణాలను కాపాడి నందుకు గాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన మరో ఐదుగురిని బయటికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు సమన్వయంతో పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ను ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం,ఆస్తినష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మొత్తం పరిస్థితిని మంత్రి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు గేట్లు ఎత్తడం తో దిగువ భాగం, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరిందని, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టామని మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నీటిపారుదల శాఖ, ఇతర అధికారులు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నారాయణపురం, ప్రమాదం తలెత్తే లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు.