అమెరికాలో తుపాకీ సంస్కృతి

Gun culture in Americaపెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్‌ నగర ప్రదర్శనలో 13 జులై 2024న పూర్వ అధ్యక్షుడు, ఈ ఏటి ఎన్నికల రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కాగల ట్రంప్‌ను 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ రైఫిల్‌తో కాల్చాడు. ప్రేక్షకుల్లో ఒకరు చనిపోయారు. ఇద్దరు తీవ్రంగా, పలువురు అల్పంగా గాయపడ్డారు. ట్రంప్‌ కుడిచెవికి గాయమైంది. రహస్య సేవా పోలీసు క్రూక్స్‌ను కాల్చిచంపాడు. వేదిక దగ్గరి క్రూక్స్‌ కారులో పేలుడు పదార్థాలు న్నాయి. క్రూక్స్‌ బెథెల్‌ పార్క్‌ గ్రామ ఉన్నత పాఠశాలలో 2022లో గణిత, విజ్ఞానశాస్త్రాల్లో పురస్కార విద్యార్థి. రిపబ్లికన్‌ ఓటర్‌. 17 ఏళ్ల వయసులో బైడెన్‌ ప్రమాణ స్వీకారం రోజు ప్రోగ్రెసివ్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీకి చందా ఇచ్చాడు. ఈ కమిటీ ప్రజల నుండి చందాలు వసూలు చేసి అభ్యర్థులకు, పార్టీ కమిటీలకు ఇస్తుంది.
1865లో అబ్రహాం లింకన్‌, 1881లో జేమ్స్‌ గార్ఫీల్డ్‌, 1901లో విలియం మెకిన్లి, 1963లో జాన్‌ ఎఫ్‌. కెనడి హత్యలకు గురైన అధ్యక్షులు. 1933లో ఫ్రాంక్లిన్‌ రూజ్వెల్ట్‌, 1975లో గెరాల్డ్‌ ఫోర్డ్‌, 1981లో రొనాల్డ్‌ రీగన్‌, 2011లో అరిజోనా డెమొక్రాట్‌ గాబ్రీల్‌ గిఫోర్డ్స్‌ చావు నుండి తప్పించుకున్నారు. అమెరికాలో తుపాకులు చాలాకాలం నుండి విపరీ తంగా ప్రజల దగ్గరఉన్నాయి. లింకన్‌, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌, గాయకుడు జాన్‌ లెనాన్‌ మొదలగువారు తీవ్ర వామపక్ష భావాల సమాజ సంస్కర్తలు.
అమెరికాలో పెరిగిన తుపాకి హింస ప్రజారోగ్య క్షీణతకు, ప్రజల బాధలకు, కష్టనష్టాలకు దారితీస్తుందని అమెరికా ప్రధాన శస్త్రవైద్యుడు డాక్టర్‌ వివేక్‌ హల్లెగెరె మూర్తి బాధపడ్డారు. అమెరికా ప్రభుత్వ 8 యూనిఫాం సేవల్లో ప్రజారోగ్యం ఒకటి. ఈ సేవాధికారిని అధ్యక్షుడు నియమిస్తారు. పార్లమెంటు ఎగువసభ (సెనేట్‌) ఈ నియామకాన్ని ధృవీకరిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపర్చే, ప్రమాదాలను తగ్గించే విజ్ఞానశాస్త్ర సమాచారాన్ని ఈ ప్రభుత్వ వైద్యుడు అమెరికన్లకు అందిస్తారు. ప్రజారోగ్య కార్యాచరణ ప్రధానాధికారిగా సమర్థు డైన డాక్టర్‌ వివేక్‌మూర్తి ఒబామా కాలం నుండి కొనసాగుతున్నారు.తుపాకి హింస రోజూ జరుగుతోంది. హత్యలు, గాయాలు పెరిగాయి. పిల్లలు, విద్యార్థులు, యువకులు, నల్లజాతీ యులు ఈ హింసల్లో తీవ్ర బాధితులు. అమెరికాలో ఏటా 50 వేల మంది తుపాకులకు బలవుతున్నారు. హత్యల ప్రత్యక్ష సాక్షులపై, కాల్పుల నుండి తప్పించుకున్నవారిపై, కాల్పుల్లో గాయపడినవారిపై, ఆత్మీయులను కోల్పోయిన వారిపై, తల్లిదండ్రులు చనిపోయిన అనాధలపై తీవ్ర మానసిక ప్రభావం ఉంటుంది.
2012లో కనెక్టికట్‌ రాష్ట్రం న్యూటౌన్‌ శాండిహుక్‌ ప్రాథమిక పాఠశాలలో ఒక తుపాకి దారుడు 20 మంది పిల్లలను, ఆరుగురి పెద్దలను చంపాడు. 24మే2022 న టెక్సాస్‌ రాష్ట్రం ఉవాల్డె నగరంలో రాబ్‌ ప్రాథమిక పాఠశాలలోకి తుపాకీతో ప్రవేశించిన వ్యక్తి 19 మంది విద్యార్థులను, ఇద్దరు ఉపాధ్యాయులను చంపాడు. ఈ కేసులో ఆయుధాల దలాలీలు హతుల కుటుంబాలకు ఒక్కొకరికి 20 లక్షల డాలర్లిచ్చి కేసు కొట్టేయించుకున్నారు. ఇంత కంటె ఘోరమైన ఘటనలు, పిల్లలు బళ్ళలో తోటి పిల్లలను కాల్చి చంపిన చర్యలెన్నో! చిన్న తగాదాలతో నల్లవారిని, భారతీయులతో సహా విదేశీయులను చంపిన శ్వేత జాతి అహంకారులు ఎందరో!
ఆయుధధారి ట్రంప్‌ను కాల్చేటంత దగ్గరగా ఎలా వచ్చాడు? మూల కారణాలను, తెరవెనుక వ్యక్తులను తెలుసుకునే అవకాశాలను, హంతకున్ని చంపి, పోలీసులు పోగొట్టారు. ఆయుధాలపై పరిమితుల విధింపును సంప్రదాయవాద రాజకీయులు వ్యతిరేకిస్తారు. ఈ నేపథ్యంలో సమాఖ్య ఆయుధ నియంత్రణ చట్టాలు పనిచేస్తాయా? అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఆయుధ వినియోగంపై పరిమితులు ఉన్నాయి. వీటిని తొలగించాలని రిపబ్లికన్ల పాలిత రాష్ట్రాలు తీర్మానించాయి. న్యూయార్క్‌ నగరం 6వ అవెన్యూ 42వ వీధి మూల ఒక ట్రాఫిక్‌ బోర్డు టైమ్స్‌ స్క్వేర్‌ తుపాకుల స్వేచ్ఛా ప్రాంతమని ప్రకటిస్తోంది.
అధ్యక్షుడు జోబైడెన్‌ ఆయుధ నియంత్రణకు సమాఖ్య చట్టం చేయలేదు. కాని తుపాకి దలాలి గుంపును నియంత్రించమని శాసన నిర్మాతలను కోరారు. ఈ గుంపుకు సాయపడే బలీయ రాజకీయ బృందం ‘నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌’ బైడెన్‌ను విమర్శించింది. ఆయుధ నియంత్రణలను మరింత సడలించాలని ఉద్యమించింది. చట్టబద్ద తుపాకి యజమానులపై బైడెన్‌ చేస్తున్న యుద్ధానికి డా. మూర్తి సలహాలు పొడిగింపని ఈ అసోసియేషన్‌ నిందించింది. అమెరికాలో అతిశక్తివంతమైన తుపాకీ దలాలీలు, కొన్ని రాజకీయ శక్తుల అండదండలతో, దశాబ్దాల తరబడి సమాఖ్య ఆయుధ నియంత్రణ సంస్కరణలను అడ్డుకుంటున్నాయని న్యాయవాదుల న్నారు.
స్వీయరక్షణకు, పర నియంత్రణకు ఆయుధాలు ధరించే స్థితికి అమెరికా సమాజం దిగజారింది. పాలకులు లాబీయిస్టులకు బందీలు. చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోని రాజకీయులు ఆయుధ సంస్థల కొమ్ముకాస్తూనే ఉన్నారు. ఆయుధ అమ్మకాలకు, కొనుగోళ్లకు అనుమతులిస్తున్నారు. ”విచ్చలవిడిగా దొరుకుతున్న తుపాకులతో ప్రజలు ఎక్కువగా మరణిస్తున్నారు. వీటి నియంత్రణకు కఠిన చట్టాల అవసరముంది.” అని జూన్‌ 25న డా. మూర్తి వ్యాఖ్యానించారు.ప్రాణభయం లేకుండా పిల్లలు బడులకు, ప్రజలు ఉద్యోగాలకు, సంతలకు, ప్రార్థనా స్థలాలకు పోవడానికి అనుకూలంగా అమెరికా మారాలి. ఆయుధ నియంత్రణకు నిఘా, ఆయుధాల నిరాకరణలను అమలు చేయాలి. హత్యలపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
ట్రంప్‌పై కాల్పు ఆయన రిపబ్లికన్‌ అభ్యర్థిత్వ రద్దుకు ఉద్దేశించింది. కాని ట్రంప్‌కు సానుభూతి ఓట్లను పెంచవచ్చు. ఆరోగ్యం బాగులేని బైడెన్‌పై అధ్యక్ష అభ్యర్థి పోటీ నుండి తప్పుకొమ్మని ఒత్తిడి పెరగవచ్చు. అధ్యక్షుడు బైడెన్‌, పూర్వ అధ్యక్షుడు ఒబామా అమెరికాలో హింసకు తావు లేదనడం ఆనవాయితి స్పందన. అమెరికాలో 2008 నుండి జాత్యహంకారంతో సమీకరణ జరిగింది. 2016 నుండి ట్రంపీయంతో పెరిగింది.
రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టింది. ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. భారతదేశంలో పదేండ్ల నుండి ఈ రాజకీయ విచిత్రం జరుగుతోంది. నేటి రాజకీయులు గెలుపే పరమావధిగా పనిచేస్తున్నారు. ఈ ధోరణి మార కుంటే ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకో గలరు. అరాచకం, హింస పెరగగలవు. చరిత్రలో ఉద్యమ కారులను, సమాజ నిర్మాతలను, ప్రజా పాలకులను సమానత్వం, న్యాయం నచ్చని ఉన్మాదులు చంపారు. జనసామాన్య విరోధులను, దోపిడీదారులను, ప్రభు భక్తులను, నియంతలను ప్రజలు ఏకమై హత్యచేశారు. ప్రజా సమస్యలపై నిరసనోద్యమాల్లో ప్రత్యామ్నాయ, ప్రతిపక్షాలు కలవకపోతే ప్రజాస్వామ్యం పతనమౌతుంది. చర్చ లు, సంప్రదింపులు, సహకార సమన్వయాలతో ఏకా భిప్రాయానికి రావాలి. మతోన్మాదాన్ని అడ్డుకోవాలి.
అమెరికాతో సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఆలోచించవలసిన సమయమిది. చంపవలసిన, చావవలసిన అవసరాలే లేవని హత్యకు గురైన అమెరికన్‌ గాయకుడు లెనాన్‌ అన్నారు. సత్యం, అహింసల ఆచరణ ఆరాధకుడు గాంధీ హంతకుల అనుచరులు అబద్దాలు, హింసపై ఆలోచించు కోవాలి.

– సంగిరెడ్డి హనుమంతరెడ్డి, 9490204545