ట్రంప్‌పై ఉక్రెయిన్‌, ఐరోపా సమాఖ్య భయం?

Fear of Ukraine and the European Union against Trump?‘నువ్వెలాంటి వాడివో తెలుసుకోవాలంటే నీ స్నేహితులను చూస్తే చాలు’ అన్న లోకోక్తి తెలిసిందే.నవంబరులో జరిగే ఎన్నికల్లో ఒకవేళ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఉక్రెయిన్‌ పట్ల డోనాల్డ్‌ ట్రంప్‌ వైఖరి ఎలా ఉంటుందో ఉపాధ్యక్ష పదవికి అతగాడు ఎంచుకున్న జెడి వాన్స్‌ను బట్టి చెప్పవచ్చన్న భయాలు ఇప్పుడు వెల్లడౌతున్నాయి.తనకు ఎక్కడ, ఏది లాభమో దానిమీదే అమెరికా పాలకవర్గం కేంద్రీకరిస్తుందన్నది జగమెరిగిన సత్యం. అనేక అంశాల్లో అది అనుకున్నదొకటి అయ్యిందొకటి. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంలో కూడా అదే కనిపిస్తున్నది. మూడో సంవత్సరంలో కొనసాగుతున్న రష్యా సైనిక చర్యను జెలెన్‌స్కీ దళాలు ప్రతిఘటించలేని స్థితిలో మరింతగా పుతిన్‌ సేనలు ముందుకు పోతున్నాయి. తామిచ్చిన ఆయుధాలు, డబ్బు బూడిదలో పోసిన పన్నీరు కావటం తప్ప ప్రయోజనం లేదని అమెరికా గుర్తించింది. అందుకే అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రతిపాదించిన 61బిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయాన్ని రిపబ్లికన్‌ పార్టీ అడ్డుకున్నది. ఓహియో సెనెటర్‌గా ఉన్న జెడి వాన్స్‌ దీనిలో ముఖ్యపాత్ర పోషించాడు.ఈ కారణంగానే ట్రంప్‌ గెలిస్తే ఉక్రెయిన్‌, ఐరోపా యూనియన్‌ను అమెరికా వదిలివేయనుందనే అభిప్రాయాలు వెల్లడౌతున్నాయి.తాను గెలిస్తే కేవలం 24 గంటల్లోనే, అదీ పదవీ బాధ్యతలు స్వీకరించకముందే పరిష్కరిస్తానని ట్రంప్‌ ప్రకటించాడు.దీని అర్ధం రష్యా షరతులతో వివాదాన్ని ముగించటమే అని పరిశీలకులు భాష్యం చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌్‌ను ఆక్రమించి రెండుదశాబ్దాల తరువాత వదిలించుకున్న ట్రంప్‌కు అది పెద్ద సమస్యకాదు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌-ఉక్రెయిన్‌ ఒకటి కాదు. ఉక్రెయిన్‌ మొత్తం ఐరోపాతో ముడిపడి ఉన్న సమస్య, అందువలన ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు.
రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ దాని మిత్రులూ, గెలిచిన ఫ్రాన్సు, బ్రిటన్‌ వాటితో చేతులు కలిపిన దేశాలూ కూడా ఐరోపాలో తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వాటిని ఆర్థికంగా తిరిగి నిల బెట్టాలి, సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాల నుంచి ముప్పు ఉందనే పేరుతో అమెరికా నాటో కూటమిని ముందుకు తెచ్చింది. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే తాము అమెరికా చేతికి చిక్కామని గ్రహించిన ఐరోపా దేశాలు తమ కాళ్ల మీద తాము నిలవటంతో పాటు అమెరికా పెత్తనాన్ని అడ్డుకొనేందుకు ఐరోపా సమాఖ్యను ముందుకు తెచ్చాయి. అమెరికాతో మిత్రబేధాలు ఉన్నప్పటికీ దానితో దగ్గరయ్యాయి. అయితే సోవియట్‌ను కూల్చివేసిన తరువాత రష్యాను ముప్పుగా చూపి అమెరికా పాతవిధానాన్నే ఐరోపా మీద రుద్దింది.గడిచిన మూడు దశాబ్దాల్లో చైనా రూపంలో వచ్చిన నూతన సవాలు ఐరోపాకూ ఎదురైంది. కనుక ఇష్టం ఉన్నా లేకున్నా పరస్పరం చిన్నపాటి వాణిజ్య పోరు సాగిస్తున్నా రష్యా, చైనాలకు వ్యతిరేకంగా అమెరికాతో అంటకాగక తప్పటం లేదు.ఈ బలహీనతను సొమ్ము చేసుకోవాలని అమెరికా చూస్తోంది. కొంతమేరకు ప్రస్తుతానికి సఫలీకృతమైంది.
అమెరికాలో ఉపాధ్యక్ష స్థానానికి ఎంచుకున్నవారు తరువాత అధ్యక్ష పదవి అభ్యర్ధులు కావటం ఆనవాయితీగా వస్తున్నది. అందువలన జెడి వాన్స్‌ అభిప్రాయాలను కొట్టిపారవేసేందుకు లేదు. ఈ కారణంగానే అధికారికంగా నిర్ణయమైన తరువాత గతంలో అతగాడేం చెప్పాడనేది ఇప్పుడు తవ్వితీస్తున్నారు.అమెరికా ప్రాధాన్యత తూర్పు ఆసియా అంటే చైనాపై కేంద్రీకరణ అని మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో చెప్పాడు. అమెరికా రక్షణ కవచం కారణంగా ఐరోపా స్వీయ రక్షణను విస్మరిస్తున్నదన్నాడు. ఒక దేశంగా ఉక్రెయిన్‌ ఏమైనా తాను పట్టించుకోను అన్నాడు. నాటో దేశాలు తమ సంక్షేమ చర్యల జాబితాలో ఉండకూడదని, ఐరోపా భద్రతకు తాము లక్షల కోట్ల డాలర్లను సబ్సిడీగా ఇస్తున్నామని చెప్పాడు.
ఇంతకు ముందు అధికారంలో ఉన్నపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇదే చెప్పాడు.నాటో దేశాలు తమ జిడిపిలో రెండుశాతం మొత్తాలను రక్షణ బడ్జెట్లకు ఖర్చు చేయాలని, తాము చేస్తున్నదానికి డబ్బు చెల్లించాలని అన్నాడు. తాజాగా తైవాన్‌ రక్షణకు గాను తమకు డబ్బు చెల్లించాల్సిందేనని, ఇప్పటివరకు తాము చేసిన దానికి ఎలాంటి ప్రతిఫలం రావటం లేదన్నాడు.తమకూ బీమా కంపెనీకీ తేడా లేదన్నాడు. అమెరికాతో రాసుకుపూసుకు తిరగాలని చూస్తున్న నరేంద్రమోడీతో సహా ప్రతిపాలకుడూ గ్రహించాల్సిన అంశమిది. అమెరికాతో వ్యవహారం ప్రతిదీ లాభనష్టాల డాలరు బేరం తప్ప స్నేహమూ, భాగస్వామ్యమూ వట్టిమాటే!