అమ్మాయిలు అలవోకగా..

Girls are excited..– పాకిస్థాన్‌పై ఏకపక్ష విజయం
– మహిళల ఆసియా కప్‌ 2024
దంబుల్లా (శ్రీలంక): భారత మహిళల జట్టు మొదలెట్టింది. మహిళల ఆసియా కప్‌ను ఘనంగా ఆరంభించింది. ఆసియా కప్‌ గ్రూప్‌ దశలో పొరుగు దేశం పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీప్తి శర్మ (3/20) మాయజాలంతో పాకిస్థాన్‌ను పడగొట్టింది. భారత బౌలర్లు రేణుక సింగ్‌(2/14), పూజ వస్ట్రాకర్‌ (2/31), శ్రేయాంక పాటిల్‌ (2/14) సైతం బంతితో మెరవటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 19.2 ఓవర్లలో 108 పరుగులకు కుప్పకూలింది. పాకిస్థాన్‌ బ్యాటర్లలో సిద్ర ఆమిన్‌ (25), టుబా హసన్‌ (22), ఫాతిమా సనా (22 నాటౌట్‌)లు రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని టీమ్‌ ఇండియా అమ్మాయిలు అలవోకగా ఛేదించారు. షెఫాలీ వర్మ (40, 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), స్మృతీ మంధాన (45, 31 బంతుల్లో 9 ఫోర్లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. మరో 35 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్నర్‌ దీప్తి శర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచింది.