– ముఖాముఖిలో గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధిత రైతుల డిమాండ్
నవతెలంగాణ-జైపూర్
నాగాపూర్-విజయవాడ మధ్య నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంలో నష్టపోతున్న భూములకు ఎకరాకు రూ.50లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో భూనిర్వాసితులు స్థానిక స్థితిగతలు వెల్లడిస్తూ పరిహారం చెల్లింపులో మార్కెట్ రేట్ దృష్టిలో పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలోని రసూల్‌పల్లి నుండి మొదలు గోపాల్పూర్ మీదుగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించనుండగా భూములు సమకూర్చనున్న రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రసూల్‌పల్లి నుండి గోపాల్పూర్ వరకు గల భూములకు రూ.50 లక్షల నుండి రూ. కోటి ధర పలుకుతోందని వివరించారు. మార్కెట్ రేటు పక్కన పెట్టి ఎకరాకు రూ.8 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామనడం బాధాకరమన్నారు. గతంలో ఇందారం ఓపెన్‌కాస్ట్ గని విస్తరణలో భాగంగా సేకరించిన భూములక ఎకరాకు రూ.24లక్షల60వేల చొప్పున పరిహారం చెల్లించారని గుర్తు చేశారు. గోదావరి తీర గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన వెంచర్లలో గజం రూ.3 నుండి 5వేల చొప్పున అమ్ముడవుతున్న తీరును అధికారులు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రైతుల డిమాండ్ పట్ల స్పందించిన కలెక్టర్ కుమార్ దీపక్ బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇస్తూ నిర్వాసితుల నుండి దరఖాస్తులు తీసుకున్నారు. ముఖాముఖిలో వివిధ గ్రామాలకు చెందిన బాధిత రైతులు సుందిల్ల మల్లేష్, ఇప్పలపల్లి బాపు, జనార్ధన్‌రెడ్డి, రామారావు, సుందిళ్ల తిరుపతి, పంచిక శంకర్, బల్ల మొగిలి, కౌటం చంద్రయ్య ఉన్నారు.