నవతెలంగాణ-జైపూర్
సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) పోరాటం చేస్తుందని జిల్లా కార్యదర్శి డుర్కె మోహన్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యా సంవత్సరం మొదలై రెండు నెలలు గడుస్తున్నా వసతిగృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్, కస్తూరిర్బాగాంధీ విద్యాలయాల్లో నెలకొన్న సమస్యలపై జూలై 20 నుండి జిల్లా కమిటి ఆధ్వర్యంలో అధ్యయన యాత్రలు ప్రారంభించనున్నట్లు తెలపారు. కప్పుకోవడానికి దుప్పట్లు, పెట్టెలు, ప్లేట్లు పంపిణీ చేయకపోవడంతో వసతిగృహాల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా మెస్ చార్జీలు పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఫలితంగా విద్యార్థులకు రుచికరమైన భోజనం సమకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మూడు వసతి గృహాలకు ఒక్కడే వార్డెన్ ఉండి పర్యవేక్షిస్తున్నందున విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారని, వసతిగృహానికి ఒక్కరు చొప్పున వార్డెన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న అధ్యయన యాత్రల ద్వారా సేకరించిన సమస్యలపై జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ మండల కన్వీనర్ జుమిడి కుమార్, నాయకులు కామెర మధుకర్ పాల్గొన్నారు.