– అనుకున్నట్లు పనులు పూర్తయితే ఆగస్టు 2వ వారంలో విద్యుదుత్పత్తి పున:ప్రారంభం
– గతేడాది మొదటి యూనిట్, ఇప్పుడు రెండో యూనిట్‌లో కొనసాగుతున్న ఓవర్‌హాలింగ్ పనులు
నవతెలంగాణ-జైపూర్
సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ 2వ యూనిట్ ఓవర్ హాలింగ్ పనుల పూర్తికి మరో నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. క్యాపిటల్ ఓవర్‌హాలింగ్ పనుల నిమిత్తం జూన్ 15న యూనిట్-2 ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశారు. మరో నెల రోజుల్లో మరమ్మత్తు పనులు పూర్తి చేసి ఆగస్టు 2వ వారంలో తిరిగి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలన్న లక్ష్యంతో పనులు పూర్తి చేస్తున్నారు. సాధారణంగా సంవత్సరానికి ఒకసారి పవర్ ప్లాంట్ల వార్షిక మరమ్మత్తు పనులు చేపట్టడం సర్వసాధారణం. కాగా క్యాపిటల్ ఓవరహాలింగ్ మరమ్మత్తు పనులు ప్రతి 5నుండి6 సంవత్సరాల మధ్య చేపట్టడం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 55వేల పని గంటల అనంతరం క్యాపిటల్ ఓవరహాలింగ్, మరమ్మత్తు పనులు చేపట్టాల్సి ఉంటుంది. 1200 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ నెలకొల్పిన జైపూర్ ఎస్టీపీపీ యూనిట్-1లో గత సంవత్సరం క్యాపిటల్ ఓవర్‌హాలింగ్ మర్మమత్తులు పూర్తి చేశారు. ఈ ఏడాది యూనిట్-2లో చేపట్టి క్యాపిటల్ ఓవర్‌హాలింగ్ మరమ్మత్తు పనులు పూర్తి చేసి వీలైనంత తొందరగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని యాజమాన్యం భావిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 600 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లలో ఒక్కొక్క యూనిట్ నుండి రోజు ఒకింటికి గరిష్ఠంగా లక్షా44 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. నూటికి నూరు శాతం ఉత్పత్తి సాధించకపోయినా కనిష్టంగా రోజు ఒకింటికి లక్షా25 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓవర్‌హాలింగ్ చేపట్టి ఇప్పటికి నెల రోజులు గడిచిపోతుండగా మరో నెల రోజులు పూర్తికానిదే ఓవర్‌హాలింగ్ పనులు పూర్తి కావని తెలుస్తోంది. ప్రతి పవర్ స్టేషన్‌లో వార్షిక, క్యాపిటల్ ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టడం సర్వసాధారణమే అయినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో సంస్థ ఆదాయానికి గండిపడుతోంది. ఈ క్రమంలో వారం రోజుల వ్యవధితో సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) సత్యనారాయణరావు, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) వెంకటేశ్వర్‌రెడ్డి ఎస్టీపీపీని సందర్శించారు. వీలైనంత తొందరగా ఓవర్‌హాలింగ్ పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కోరారు.
నిర్ధిష్ట కాలపరిమితితో మరమ్మత్తులు
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో నిర్ధిష్ట కాల పరిమితితో మరమ్మత్తు పనులు చేపట్టాల్సి ఉంటుంది. వార్షిక మరమ్మత్తులు సర్వసాధారణమైనా క్యాపిటల్ ఓవర్‌హాలింగ్ పనులు 5నుండి6 సంవత్సరాల వ్యవధి లేదా 55వేల పని గంటల అనంతరం పూర్తి స్థాయి మరమ్మత్తులు చేపట్టాలి. ప్రధానంగా బాయిలర్, వాటర్ ట్యూబ్స్, వాల్వులు, బాయిలర్ సేఫ్టీ వాల్వులు, పీడ్ వాటర్ వాల్వులు, ఇతర వాల్వులు లాపింగ్ చేయడం జరుగుతుంది. బాయిలర్ వాటర్, ట్యూబ్స్, హెడ్డర్స్, వాల్వులు, హైడ్రాలిక్ టెస్టింగ్ చేసి లీకేజీలు లేవన్నట్లు నిర్దారించుకోవాలి. బాయిలర్ వర్కింగ్ ప్రెసర్ కంటే ఎక్కువ ప్రెసర్‌లో హైడ్రాలిక్ టెస్ట్ చేయాలి. అవసరమైతే బాయిలర్ ఇన్స్‌పెక్టర్, ఇన్స్‌పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ సమక్షంలో చేయాల్సి వస్తుంది. అంతా ఓకే అనుకున్నప్పుడు మాత్రమే బాయిలర్‌ను వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. బాయిలర్ బంద్ ఉందనుకున్నప్పుడు లర్బైన్, జనరేటర్ కండెన్సర్, పీడ్ పంప్‌లను కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడి యూనిట్-2లో చేపట్టిన ఓవర్‌హాలింగ్ పనుల్లో భాగంగా సుమారుగా లక్షా40వేల ట్యూబ్‌ల తిక్‌నెస్ తనిఖీ చేసి మరమ్మత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సింగరేణి యాజమాన్యం విద్యుత్ ఉత్పత్తి నిర్వహణ బాధ్యతలు పవర్‌మేక్ ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. సింగరేణి యాజమాన్యం పర్యవేక్షణలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్న పవర్‌మేక్ కంపెనీ నిష్ణాతులైన ఇంజనీర్ల పర్యవేక్షలో ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది..