– జిల్లాలోనే తిష్టవేసిన అధికారులు, ఉద్యోగులు
– ఏండ్లు గడుస్తున్నా ఇక్కడే కొనసాగుతున్న వైనం
– తప్పనిసరి బదిలీ నిబంధనలు పట్టించుకోని వైనం
– ప్రభుత్వ స్థాయిలో పైరవీలతో ఉన్న చోటే ఉద్యోగం
– విమర్శలకు తావిస్తున్న కొందరు అధికారుల తీరు
ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజం. కానీ వీరికి మాత్రం అలాంటిదేమీ ఉండటం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా..పాలకులు మారుతున్నా వీరు మాత్రం మారడం లేదు. ఏండ్లుగా ఒకే చోట తిష్టవేస్తూ ఉద్యోగం చేస్తున్నారు. వీరు ఆదిలాబాద్ జిల్లాను వీడకపోవడం మూలంగా.. ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు ఎవరూ రావడం లేదు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగుల బదిలీలు జరుగుతుండగా.. ఇంకా అనేక శాఖలకు చెందిన వారిని మాత్రం విస్మరించినట్లు తెలుస్తోంది. ఒకే చోట నాలుగేండ్లు పనిచేసిన వారికి తప్పనిసరి బదిలీ చేయాలనే నిబంధనలు ఉన్నా..వారికి ఇవి ఏ మాత్రం పట్టడం లేదు. వివిధ శాఖలకు చెందిన కొందరు ఉన్నతాధికారులైతే ఏండ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఒకే చోట కొనసాగేలా ప్రభుత్వ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారనే విమర్శలున్నాయి. మల్టీజోన్ పోస్టులు కావడంతో ప్రభుత్వమే దీనిపై దృష్టిసారించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల విధి నిర్వహణలో బదిలీ అనేది సహజమైన ప్రక్రియ. ఆయా శాఖలకు చెందిన వారికి విధిగా బదిలీలు జరుగుతున్నాయి. ఇక్కడి జిల్లా నుంచి ఇతర జిల్లాకు వెళ్లడం..అక్కడ్నుంచి కొత్త అధికారులు ఇక్కడకు రావడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. కొన్నిశాఖలకు మాత్రం ఇది రెగ్యూలర్గా జరుగుతోంది. కానీ మరికొన్ని శాఖలకు మాత్రం బదిలీ అనేది ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ఏదేని ఒక ప్రాంతంలో నాలుగేండ్ల పాటు విధులు నిర్వహిస్తే అలాంటివారిని అందరినీ తప్పనిసరిగా బదిలీ చేయాలనే నిబంధన ఉంది. కానీ ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వాలు సైతం వీటిపై దృష్టిసారించకపోవడం మూలంగా కొందరు అధికారులకు అనుకూలంగా మారింది. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రభుత్వశాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఏండ్లుగా ఇక్కడే కొనసాగుతున్నారు. కిందిస్థాయి నుంచి పదోన్నతులు పొందుతూ ఆ శాఖల కార్యాలయాన్ని వీడటం లేదు. ప్రభుత్వస్థాయిలో పలుకుబడి కలిగిన వ్యక్తులను మచ్చిక చేసుకోవడం.. ఇక్కడ జిల్లా స్థాయిలోనూ ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పాటుచేసుకుంటూ స్థానికంగానే కొనసాగుతున్నట్లు విమర్శలున్నాయి. జిల్లా స్థాయి అధికారుల పోస్టులు మల్టీ జోనల్ స్థాయిలోకి రావడంతో ప్రభుత్వమే వీటిని పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వాలు దృష్టిసారించకపోవడం మూలంగా వీరు జిల్లా నుంచి ఎటూ కదలడం లేదనే ఆరోపణలున్నాయి.
అనేక ఏండ్ల నుంచి ఇక్కడే..!
జిల్లాలో ఇప్పటికే రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యాశాఖ, జిల్లా పంచాయతీ వంటి కొన్నిశాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తయింది. మరికొన్నింటివి కొనసాగుతున్నాయి. కానీ ఇంకా అనేక శాఖలకు చెందిన వారికి మాత్రం బదిలీలు జరగడం లేదు. వైద్యఆరోగ్యం, వ్యవసాయం, సాంఘీక సంక్షేమం, యువజన, క్రీడల అభివృద్ధి, సర్వేల్యాండ్ రికార్డ్స్, ఖజానశాఖ, డిగ్రీ అధ్యాపకులు, రవాణశాఖ, ఐటీడీఏ, రిమ్స్, పశుసంవర్ధకం, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ తదితరశాఖల్లో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు బదిలీలు జరగడం లేదనే ఆరోపణలున్నాయి. ఆయా శాఖల పరిధిలో అనేక మంది అధికారులు, ఉద్యోగులు ఏండ్లుగా ఒకే చోట కొనసాగుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు మారుతున్నా..వారి కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు మాత్రం ఎటూ కదలడం లేదు. కొన్నిశాఖలకు చెందిన కిందిస్థాయి అధికారులు ఏండ్లుగా ఒకే చోట తిష్టవేసి శాఖల మీద పట్టుసాధించడంతో వారు ఏం చెప్పిందే వేదం అన్నట్లుగా మారింది.
ఆయా శాఖలకు కొత్తగా వచ్చిన ఉన్నతాధికారులు సైతం వీరు చెప్పిందే వినాల్సిన పరిస్థితి నెలకొందనే ఆరోపణలున్నాయి. శాఖలకు సంబంధించి ప్రగతి కనిపించకపోయినా ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి ఉందనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టిసారించి నిబంధనల ప్రకారం అందరికీ బదిలీల ప్రక్రియ చేపట్టాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక్కడి వారు ఇతర ప్రాంతాలకు వెళితేనే.. ఆయా ప్రాంతాల నుంచి కొత్తగా అధికారులు, ఉద్యోగులు జిల్లాకు వచ్చేందుకు మార్గం సుగుమం అవుతుందనే వాదన వినిపిస్తోంది.