– దేశానికి మరిన్ని అవసరం లేదు : ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబయి: కార్పొరేట్లు, వ్యాపారస్తులను బ్యాంకింగ్ రంగంలోకి అనుమతించే యోచన లేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. శుక్రవారం ముంబయిలో ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఓ సమావేశంలో శక్తికాంత మాట్లాడుతూ.. ప్రస్తుతం బ్యాంకులను ప్రోత్సహించేందుకు వ్యాపార సంస్థలను అనుమతించే ప్రణాళిక రిజర్వ్ బ్యాంక్ వద్ద లేదన్నారు. ఈ రంగంలోకి కార్పొరేట్ సంస్థలను అనుమతించడం వల్ల వడ్డీ రిస్క్‌లు, సంబంధిత పార్టీ లావాదేవీల్లో లోపాలు నెలకొనే అవకాశం ఉందన్నారు. పదేండ్ల క్రితం పలు సంస్థలు బ్యాంకింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు చేసుకోగా.. ఆర్‌బీఐ అనుమతులను నిరాకరించింది. ప్రస్తుత సమయంలో కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్‌లు ఇచ్చే ఆలోచన లేదని ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ”బ్యాంకులు ఇతర వ్యాపారాల కంటే భిన్నమైనవి. ఇప్పటివరకు ఉన్న ప్రపంచ అనుభవాల ప్రకారం.. వ్యాపార సంస్థలను అనుమతించినట్లయితే వాటి ఆసక్తులు, లావాదేవీలకు సంబంధించిన సమస్యల సంభావ్య వైరుధ్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.” అని దాస్ అన్నారు. భారత్‌లో బ్యాంక్‌ల జాతీయీకరణకు ముందు.. 1960 చివరి దశకంలో బ్యాంకింగ్ రంగంలోని వ్యాపార సంస్థలకు అనేక అనుభవాలు ఉన్నాయన్నారు. సంబంధిత సంస్థ లావాదేవీలను పర్యవేక్షించడం లేదా నియంత్రించడం, నిరోధించడం చాలా కష్టమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనుభవం కూడా ఇదేనన్నారు. ఇందులో ఎక్కువగా నష్టాలు ఉంటాయన్నారు. ఆర్థిక వ్యవస్థ వద్ధి చెందడానికి వనరులు అవసరం.. అయితే ఆ ఆకాంక్షలను సాధించడానికి మరిన్ని బ్యాంకులు అవసరం లేదన్నారు. భారత్‌కు కావలసింది బ్యాంకుల సంఖ్యలో విస్తరణ కాదన్నారు. దేశానికి మంచి బ్యాంకులు, ఆరోగ్యకరమైన బ్యాంకులు, సుపరిపాలన ఉన్న బ్యాంకులు అవసరమన్నారు. విత్త సంస్థలు ప్రస్తుత సాంకేతికత ద్వారా దేశ వ్యాప్తంగా పొదుపులను సమీకరించగలవని, రుణాల అవసరాలను తీర్చగలవని భావిస్తున్నామన్నారు.