– ప్రభుత్వానికి ఎంఎస్టీఎఫ్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలను ఆదుకోవాలని మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎంఎస్టీఎఫ్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి కొండయ్య శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మోడల్ స్కూళ్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. 11 ఏండ్లుగా బదిలీల్లేక ఉపాధ్యాయులు నానా ఇబ్బందులు అనుభవిస్తున్నారని తెలిపారు. వేతనాలు సకాలంలో అందక సతమతమవుతున్నామని పేర్కొన్నారు. వెయ్యి మంది ఉపాధ్యాయులకు గతనెల వేతనాలు అందలేదని వివరించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకూ (కోర్టుకు వెళ్లిన వారిని మినహాయించి) బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.