లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Khammam,Navatelangana,Telugu News,Telangana.– అత్యవసరం అయితే తప్పా బయటికి రావద్దు
– ఎస్పీ రోహిత్‌ రాజు
నవతెలంగాణ-అశ్వారావుపేట
జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి అనీ, వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్లపై ఉన్న గుంతలు నీటితో నిండి ఉండటం వలన రోడ్డు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని, కావునా అత్యవసరం ఆయితే తప్ప బయటకి రావద్దని ఎస్పీ రోహిత్‌ రాజు సూచించారు. వరద నీటితో ధ్వంసం అయిన అశ్వారావుపేట మండలంలోని గుమ్మడి వల్లి ప్రాజెక్ట్‌ను ఆయన శుక్రవారం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌, నీటిపారుదల శాఖ సీఈ ఏ.శ్రీనివాసరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఇతర శాఖలతో సమన్వయం పాటిస్తూ పోలీస్‌ యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులను పొంగి పొర్లుతున్న చెరువులను, వాగులను చూడటానికి బయటికి వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్నవారు డయల్‌ 100నకు ఫోన్‌ చేసి పోలీసు వారి సేవలను వినియోగించుకోవాలని తెలియజేసారు.
అశ్వారావుపేట మండలం నారాయణపురం వద్ద పెద్దవాగు ప్రాజెక్ట్‌నకు భారీగా వరద నీరు చేరి ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో అక్కడ వ్యవసాయ పనుల కోసం వెళ్లిన 40 మంది కూలీలు వరద నీటిలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.హెలికాప్టర్‌ ద్వారా 26 మందిని, జిల్లా పోలీస్‌ శాఖ తరఫున ఏర్పాటు చేసిన డీడీఆర్‌ఎఫ్‌ బృందం చేత 14 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. పెద్దవాగు ప్రాజెక్టు వరద ఉధృతి కారణంగా ముంపుకు గురైన గుమ్మడి వల్లి, కొత్తూరు గ్రామాలను సందర్శించి అక్కడి పరిస్థితిని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, పీఓ రాహూల్‌, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇతర అధికారులతో కలిసి పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడిన డీడీఆర్‌ఎఫ్‌ బృందాన్ని ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్‌ రాజు ప్రత్యేకంగా అభినందించారు.