తగ్గని వర్షం…పత్తికి పొంచి ఉన్న ప్రమాదం

Khammam,Navatelangana,Telugu News,Telangana.నవతెలంగాణ – బోనకల్‌
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులకు కురుస్తున్న అకాల వర్షాల వల్ల పత్తి పంటకు ప్రమాదం పొంచి ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం పంటగా సుమారు 17వేల ఎకరాలలో అన్నదాతలు పత్తి పంటను సాగు చేయవచ్చునని మండల వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాలలో పత్తి పంటను సాగు చేశారు. ఒక్కో ఎకరానికి సుమారు రూ. 20 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి ఉన్నారు. మండల వ్యాప్తంగా పత్తి పంట ఎంతో బ్రహ్మాండంగా ఉందని అన్నదాతలు ఆనందంలో మునిగి తలుతున్నారు. ఈ క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలలో ఆందోళన వ్యక్తం అవుతుంది. పత్తిలో ఇప్పటికే వర్షపు నీరు చేరి నిల్వ ఉంది. నీరు నిల్వ ఉండటం వల్ల పత్తి మొక్కలు దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండటం వలన వేర్లు సచ్చుబడి కుళ్ళిపోయే ప్రమాదం ఉందని, ఫలితంగా పత్తి పంట దెబ్బతింటుందని అన్నదాతలు అంటున్నారు. ఇదే పరిస్థితి రెండు మూడు రోజులు కొనసాగితే ఈ ఏడాది కూడా పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని అన్నదాతలు అంటున్నారు. గత వారం రోజుల క్రితం వరకు ఒక్క రోజైనా వర్షం వస్తే బాగు పత్తి పంటకు సాగునీటి కొరత తీరుతుందని అన్నదాతలు భావించారు. కానీ నాలుగు రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వర్షాల వలన ఒకవైపు రైతులలో ఆనందం మరొకవైపు ఆందోళన నెలకొని ఉంది.