ప్రజాస్వామ్యంలో ఆందోళనలు, పోరాటాలు సర్వసాధారణం. ప్రజలు తమ హక్కుల కోసం గొంతెత్తటం, పాలకులను నిలేయటం దాని ప్రత్యేకత. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదే రకమైన ఒరవడి కొనసాగటమే భారతదేశ విశిష్టత. ఇందులో కీలకపాత్ర పోషించేవి ప్రజా సంఘాలు. వివిధ సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను అవి ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ జనాన్ని జాగృతం చేస్తుంటాయి. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకూ అలాంటి ప్రజా సంఘాలుంటాయి. అయితే ఇటీవల ఒక గమ్మత్తయిన పరిస్థితి దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో కొనసాగుతోంది. తాము అనుబంధంగా ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనాలు సచ్చినా, వారిని చావగొట్టినా ‘రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన’ మాదిరిగా గమ్మున ఉన్న కొన్ని సంఘాలు ఇప్పుడు అమాంతంగా నిద్రలేచాయి. గత పదేండ్లలో ‘గులాబీ పూల’ మత్తులో ఉన్న ఆ పింకీ యూనియన్లు అకస్మాత్తుగా నిద్రపోతున్న సింహాలు లేచినట్టు లేచి తెగ గాండ్రిస్తున్నాయి. రైతుల ఆత్మహత్యలు, ఇంటర్ విద్యార్థుల చావులు, నేరెళ్ల ఘటనలు, పేపర్ లీకేజీలు, నేతన్నల ఆకలి చావులు, కనీస వేతనాల్లేక కార్మికుల అరిగోసలేవీ… ఈ దశాబ్ద కాలంలో ఆ సంఘాలకు పట్టలేదు. ఇప్పుడు సచివాలయ ముట్టడులు, కమిషనరేట్ల ముందు ధర్నాలు, డైరెక్టర్ ఆఫీసుల గేట్లు ఎక్కడాలు చేస్తూ… తామే ‘దేశోద్ధారకులం…’ అని ఆయా సంఘాల నేతలు ఫోజులు కొడుతుంటే, ‘మీ ఓవరాక్షన్ ఆపండ్రా బాబూ…’ అంటున్నారు మేధావులు. ఏ సంఘమైనా ప్రజల కోసం ఆందోళనలు, పోరాటాలు చేయాల్సిందే. కానీ ఒకప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరిస్తే, ఆయా సంఘాలకే కాదు, వాటి నాయకులకు కూడా విశ్వసనీయత ఉండదు మరి…
-బి.వి.యన్.పద్మరాజు