తుంటరి కోతికి వచ్చిన తంట

The rush of the monkeyగోవిందపురం గ్రామంలో సాంబయ్య, నాగమ్మ అనే దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. వారికి ఇద్దరు పిల్లలు. అరవిందు తొమ్మిదో తరగతి. అరుణ ఏడో తరగతి. వారికి ఏడెకరాల పంట భూమి ఉంది. పాలిచ్చే రెండు ఆవులు, గేదెలు – వీటితో పాటు అరక దున్నే నాలుగు జతల ఎద్దులున్నాయి. వారిది డాబా ఇల్లు. ఇంటి ముందు ఆరు కొబ్బరి చెట్లు, వేప చెట్టు, జామ చెట్టు ఉన్నాయి. ఆ ఇంటికి ఉత్తరం వైపు పశువుల కొస్టం, దాని పక్కనే అవి తినేందుకు గడ్డివామి, దాని తరువాత పెంట దిబ్బ ఉన్నాయి. ఈశాన్యం మూలన మంచినీటి బావి, దానికి కాస్త పక్కన గోడ వెంట ఒక పెద్ద రోలు, పక్కనే చెక్కతో చేసిన కోళ్ళ గూడు, పాతిక కోళ్ళు ఉన్నాయి. అవి కొస్టం లోనూ, గడ్డి వామి దగ్గర పగలల్లా మేస్తూ, పోట్లాడుకుంటూ ఉండేవి. ఎప్పుడూ ఒకటో… రెండో కోడిపెట్టలు – కోళ్ళ గూటిలో ఉన్న వరిపొట్టు గంపల్లో గుడ్ల మీద కూర్చొని, పిల్లలు చేయడం కోసం పొదుగుతూ ఉండేది. కొస్టంలో లేగదూడ గుంజకు కట్టివేసి ఉండేది. సాయంత్రం తల్లి అడవినుంచి రాగానే, సాంబయ్య కొడుకు లేగదూడ మెడలోని పలుపుతాడు విప్పగానే, అది పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి దగ్గర పాలు తాగేది. కడుపునిండిన దూడ బజారులోకి ఒక్క దూకు దూకి గంతులు పెడుతుండేది. అప్పటికే బడినుంచి వచ్చిన అరుణ, అరవిందులు దాని వెంటపడి అందుకోవాలని పట్టుకొని ఇంట్లోకి లాక్కురావాలని తెగ ప్రయత్నం చేసేవారు. కానీ, వారికి అది ఒక పట్టాన దొరికేది కాదు. ఇద్దరికీ చిక్కకుండా ఊరంతా తిప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వీటితో పాటు ఒక ఎర్ర కుక్క టైసన్‌ కూడా ఉంది. అది ఎత్తుగా, బలంగా ఉండేది. దాన్ని పగలు జామచెట్టు కింద ఇనుప గొలుసుతో కట్టేసి ఉంచేవారు. రాత్రి పూట వదిలి పెట్టేవారు దొంగలు రాకుండా కాపలా కోసం. అది గేటు లోపల తిరుగుతూ, బజారులో మనిషి కనిపిస్తే పెద్దగా అరిచేది. దాని అరుపు భయం కలిగించేదిగా ఉండేది. అందుకే, రాత్రిపూట ఆ బజారులో నడవడానికే గ్రామస్తులు భయపడే వారు. కొత్తవారు దాని అరుపు విని, ఇంటి వైపు రాకుండా వేరే బజారు గుండా వెళ్ళేవారు. అది రాత్రంతా నిద్రపోకుండా ఇంటిని జాగ్రత్తగా కాపలా కాసేది.
సాంబయ్య, లేచింది మొదలు పశువుల పాలు పిండేవాడు, అరవిందు ఆ పాలను వాడుక పట్టిన గహస్థులకు ఇచ్చి వస్తుండేవాడు. వంటపని చేస్తున్న తల్లికి, అరుణ సహాయం చేసేది. పిల్లలు బడికి, వారి తల్లి దండ్రులు పొలానికి, పాలేరు పశువులను తోలుకొని బీటిలోకి వెళ్లిపోయేవారు. పిల్లలిద్దరూ ఉన్న ఊరిలోనే చదువుతుండడంతో, మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చే వారు. గేటు చప్పుడు కాగానే, అప్పటివరకూ నిద్రపోతున్న టైసన్‌ దిగ్గున లేచి, ప్రేమగా కుయి కుయి.. మని శబ్ధం చేసేది. పిల్లలు దాని ఆకలి గమనించి, ‘టైసన్‌ తిను’ అని కుక్కకు గిన్నెలో అన్నం పెట్టేవారు. పిల్లలిద్దరూ అన్నం తిని, తిరిగి బడికి వెళ్లిపోయేవారు. అన్నం తిన్న తరువాత కుక్క, జామ చెట్టు నీడలో హాయిగా నిద్ర పోయేది.
ఓనాడు ఆహారం కోసం బయలుదేరిన ఓ తుంటరి కోతి, సాంబయ్య ఇంటివైపు వచ్చింది. అది తీరికగా గోడ మీద కూర్చొని, చుట్టుపక్కల పరిశీలనగా చూసింది.. ‘ కొబ్బరి చెట్టుకు కాయలు ఉన్నాయి కానీ, అవి తాను తెంపలేదు. తెంపినా పగలకొట్టి తినడం చేతకాదు. జామచెట్టుకు కాయలు లేవు. ఏంచేయాలా’ అని ఆలోచిస్తూ కిందకు చూసింది.
దానికి చెట్టుకింద ఆదమరచి నిద్ర పోతున్న కుక్క కనిపించింది. దాన్ని చూడగానే కోతికి కోపం వచ్చింది. ‘ఈ గ్రామంలోని కోతులన్నిటికి పెద్దను. నేను వచ్చినా లెక్కచేయకుండా నిద్రపోతుందా? దీని పని పట్టాలి’ అనుకుంది. వెంటనే నిద్రపోతున్న కుక్కమీద, గభీమని దూకింది. మీద ఏదో బరువు పడ్డట్లవడంతో దిగ్గున లేచింది. ‘బవ్‌..’ మని అరిచింది. కోతి భయపడలేదు. దాని మెడకున్న గొలుసును చూసి, ఇది నన్ను ఏమీ చేయలేదు’ అనుకుంటూ పండ్లు వెళ్లబెట్టి వెక్కిరించింది కుక్కను. నా మీద దూకి, నిద్ర చెడగొడతావా? నీ సంగతి చెబుతా’ అనుకుంటూ గట్టిగా ‘భవ్‌… భవ్‌..’ మని అరిచి మీదకు దూకబోయింది. కానీ, మెడకు ఇనుప గొలుసు కట్టి ఉండడంతో, అది కోతిని అందుకోలేక పోయింది. కోతి ఆ గొలుసు విషయం కనిపెట్టి, దాన్ని అటూ.. ఇటూ.. గంతులు వేయిస్తూ, వేదించ సాగింది. కుక్క వెనక్కు మళ్లినప్పుడు, దాని తోకను పీకి రెచ్చకొట్టింది. కుక్క కోపంతో కరవాలని గింజుకుంటూ, బిగ్గరగా అరవ సాగింది. కోతి దానికి అందకుండా, వెక్కిరిస్తూ కుక్కను ముప్పుతిప్పలు పెట్ట సాగింది. ‘నా మెడలో గొలుసుంది కాబట్టి బతికి పోయావు. లేకుంటే నా తడాఖా నీకు చూపించే దాన్ని’ అని మొరగ సాగింది కుక్క. ఆ అరుపును లెక్కచేయకుండా, దగ్గరకు వచ్చి కవ్విస్తూ, చెట్టుమీదెక్కి వెక్కిరిస్తూ, దానికి అందనంత దగ్గరకు వచ్చి కూర్చొని కోతి చేస్టలు చేస్తూ సంతోష పడసాగింది. కుక్క కట్టివేసి ఉండడంతో, అరవడం తప్ప కోతిని ఏమీ చేయలేక పోయింది. అలా చాలాసేపు కుక్కను ఏడిపించిన కోతి, విజయం సాధించినట్లు గర్వంగా గోడెక్కి మరో ఇంటి వైపు వెళ్లిపోయింది. కుక్క ఆ విషయం మరిచి పోయి మళ్ళీ చెట్టుకింద నిద్రపో సాగింది.
మరుసటి రోజు ఆహారం కోసం అటు వైపు వచ్చిన కోతికి నిద్రపోతున్న టైసన్‌ ఎప్పటిలాగే కనిపించింది. మెల్లగా గోడ దిగి, దగ్గరకు వెళ్ళి కుక్క రెండు చెవులూ గట్టిగా పీకింది. భయంతో ఉలిక్కిపడి లేచిన కుక్కకు ఎదురుగా, కోతి వెక్కిరిస్తూ కనిపించింది. కుక్క కోపంతో గట్టిగా అరిచింది. గొలుసు తెంపుకొని, కరవాలని ప్రయత్నం చేసింది. కానీ కోతి అందలేదు. కుక్క తోక పీకి, వెనుక కాలు గుంజి, చెట్టు చుట్టూ తిప్పించి బాగా ఏడిపించింది. కుక్క అన్నం తినే గిన్నెను నెత్తిమీద బోర్లించుకొని, గంతులు పెట్టింది. అలా కుక్కను ఏడిపించిన కోతి, చాలా సేపటి తరువాత గర్వంగా అక్కడినుంచి వెళ్లింది. ‘రోజూ నన్ను ఎడిపిస్తావా? నాకూ ఒక రోజు వస్తుంది. అప్పుడు నీ పని చెబుతా’ అనుకుంది మనసులో కుక్క.
ఆ రోజు, మేళ్లచెర్వులో జరిగే శివరాత్రి తిరుణాలకు వెళ్లాలని సాంబయ్య కుటుంబమంతా నిర్ణయించుకుంది. రాత్రి పూట జాగారం చేయడం, ఒక్కపొద్దు ఉండటం ఆ దంపతులకు చాలా కాలంగా అలవాటు. రాత్రికి తాము ఎలాగూ, ఇంట్లో ఉండటం లేదు కాబట్టి – కుక్క గిన్నెలో రెండు పూటలకు సరిపడా అన్నం పెట్టారు. కుక్క మెడలో గొలుసు విడిచేసి, గేటుకు తాళం పెట్టి, ‘ భద్రంగా కాపలా కాయి’ అని చెప్పి, పొద్దున్నే బస్సెక్కి వెళ్ళిపోయారు.
కుక్కకు చాలా సంతోషమయింది. ‘ఇవ్వాళ్ళ కోతి రానీ.. దాని పని చెబుతా’ అనుకుంది మనసులో. గొలుసుమీద పడుకొని నిద్ర నటిస్తూ, కోతి కోసం ఎదురు చూడ సాగింది. ‘నాకు ఎదురులేదు. ఇవ్వాళ్ళ కూడా ఈ కుక్కను ఏడిపిస్తా’ అనుకుంటూ రౌడీలా రొమ్ము విరుచుకుంటూ ఎప్పటిలాగే వచ్చింది కోతి. నిద్ర పోతున్న కుక్క చెవిలో కట్టె పుల్ల గుచ్చి ఏడిపిద్దామనుకుంది. పొరక పుల్లతో దగ్గరకు వచ్చి, చెవిలో పుల్ల గుచ్చబోయింది. గమనిస్తున్న కుక్క గభాల్న కోతి కాలు అందుకుంది నోటితో. హట్టాత్‌ పరిణామాన్ని ఊహించని కోతి, పరుగందుకోబోయింది. కానీ, కుక్కనోటిలో కాలు చిక్కడంతో కోతి ఎటూ పోలేక ‘కీ …కీ..’ మని మొత్తుకుంటూ అటూఇటూ గంతులు పెట్టింది. గింజుకుంది. కానీ, కుక్క దాని కాలుని వదిలి పెట్టకుండా, గట్టిగా అలాగే పట్టుకుంది. ”నీకు దండం పెడతా కుక్క అన్నయ్యా.. నా కాలును వదులు. నీ పండ్లు కుచ్చుకొని, రక్తం వస్తోంది” అని వేడుకుంది.
”నన్ను సుఖంగా నిద్ర పోనీకుండా, ఎంత ఏడిపించావు. నిన్ను వదలను. నీ కాలును నమిలేస్తా” అన్నట్లు కోతి వైపు గుడ్లు ఉరిమి చూసింది కోపంగా.
”నన్ను క్షమించు. నువ్వు ఏమీ చేయలేవనే పొగరుతో బాధ పెట్టాను. ఇప్పుడు నా పొగరు పూర్తిగా అణిగి పోయింది. కాలు వదిలి పెట్టకుంటే, నేను శాశ్వతంగా కుంటి దాన్నయి పోతాను. అప్పుడు నన్ను అందరూ కుంటి కోతని వెక్కిరిస్తారు. కుంటి కాలుతో, ఆహారం సంపాదించుకోవడం కూడా చాలా కష్టమైపోద్ది. దయచేసి నన్ను వదిలి పెట్టు. నీకు దండం పెడతాను. ఇంక ఎప్పుడూ, ఎవరినీ బాధ పెట్టను” అని రెండు చేతులు జోడించి వేడుకుంది. బలబలా కన్నీరు కార్చింది. కుక్కకు పాపం జాలనిపించింది. కాలు వదిలేసి, ‘మరెప్పుడూ నా జోలికి రాకు. వచ్చావో కాలు నమిలేస్తా. నీ గొంతు కొరికేస్తా. జాగ్రత” అని హెచ్చరించింది.
”నిన్నే కాదు. ఇంకెవరినీ బాధ పెట్టను. నన్ను చంపకుండా వదిలి పెట్టినందుకు కతజ్ఞతలు” అని కుంటుకుంటూ, పశ్చాత్తాపంతో అక్కడినుంచి వెళ్లిపోయింది పొగరు అణిగిన కోతి.

– పుప్పాల కృష్ణమూర్తి, 99123 59345