ఇవిఎంలపై సందేహాలు, ఇసి నిర్వాకాలు

ఇవిఎంలపై సందేహాలు, ఇసి నిర్వాకాలుఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటింగు, లెక్కింపులకు సంబంధించి సందేహాలు వున్న అభ్యర్థులకు ఇవిఎంలను పరీక్షించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఎన్నికల సంఘం(ఇసి) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత అభ్యర్థులు తాము కోరుకున్న ఏ పోలింగ్‌ కేంద్రంలోనైనా మాక్‌పోలింగ్‌,వివిపాట్‌ స్లిప్పుల లెక్కింపు కోరవచ్చునని ప్రకటన చేసింది. అయితే జూన్‌ నాలుగున ఫలితాలు వెలువడిన వారం రోజుల్లోగా అభ్యంతరాలు నమోదు చేసిన వారికి మాత్రమే ఆ అవకాశం వుంటుంది. దేశంలో ఎనిమిది మంది అభ్యర్థుల నుంచి అలాంటి అభ్యంతరాలు ఇసికి అందాయి. వాటిలో కాంగ్రెస్‌, బీజేడీ, వైసీపీ అభ్యర్థుతలతో పాటు బీజేపీవారు కూడా వుండటం విశేషం. విజయనగరంలోని బొబ్బిలి నుంచి వైసీపీ, ఛత్తీస్‌గఢ్‌లోని కాంకర్‌లో హర్యానాలోని కర్నాల్‌, ఫరీదాబాద్‌ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు ఈ దరఖాస్తులు చేశారు. ఆసక్తికరంగా మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలలో లోక్‌సభ స్థానాలపై బీజేపీ అభ్యర్థులు వెరిఫికేషన్‌ కోరారు. శాసనసభ పోలింగ్‌కు సంబంధించి ఏపీలో రెండు చోట్ల వైసీపీ,ఒరిస్సాలో ఒకచోట బీజేడీ పరిశీలన కోరాయి. ఓటింగుపై సందేహాలు, ఇవిఎంలలోని మైక్రోచిప్‌ల పరీక్షించు కోవడం చేయొచ్చు. ఒక్కో ఇవిఎంను పరీక్షించుకోవడానికి నలభైవేల రూపాయలు డిపాజిట్‌ కట్టవలసి వుంటుంది. ఈ ఎనిమిది మంది అభ్యర్థులు మొత్తం 43పోలింగ్‌ స్టేషన్‌లను ఎంపిక చేసుకున్నారు. ఇసి జూన్‌ 16వ తేదీన ఒక బహిరంగ ప్రకటన విడుదల చేస్తూ వారు ఎక్కడైనా, ఏ ఇవిఎంనైనా పరీక్షించు కోవడానికి అవకాశం కల్పించడానికి సిద్ధంగా వున్నట్టు వెల్లడించింది.
మారే వైఖరులు, మౌలిక సమస్య
ఇవిఎంలపై అభ్యంతరాలను, అనుమానాలను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ప్రధాన పోలింగ్‌కంటే ముందుగా ఏప్రిల్‌ 26న తీర్పునిచ్చింది. ఎలాంటి సందేహాలకు ఆధారం లేదని అభిప్రాయపడింది. అభ్యర్థులు కోరుకుంటే తమ స్థానాలలో పరీక్షకోసం ఇసికి దరఖాస్తు చేసుకోవడమే మార్గమని సుప్రీం పేర్కొంది.ఈ నిబంధనలు(స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రొసీజర్‌) ఇసినే తయారు చేసింది. ఆర్థికవ్యయంతో ముడిపడి వుంది గనక ఈ దరఖాస్తుదారులు ఎంతమంది ఎన్నిచోట్ల ముందుకు వస్తారో, ఏం తేడాలు వెల్లడవుతాయో లేదో చూడవలసివుంటుంది. అదెలావున్నా ఫలితాల తర్వాత కేంద్రంలోనూ, వివిధ రాష్ట్రాలలోనూ కూడా ఇవిఎంలపై ప్రశ్నలు అనేకం మిగిలేవున్నాయన్నది కాదనలేని వాస్తవం. కేవలం విజేతలు పరాజితులు లేదా టీడీపీ, వైసీపీ లేదా బీజేపీ, కాంగ్రెస్‌ వంటి పార్టీల వివాదంగా మాత్రమే ఇవిఎంల చర్చను చూడటం పొరబాటవుతుంది. ఇది మొత్తం మన ఎన్నికల వ్యవస్థకూ పారదర్శకతకూ సంబంధించిన విస్తృత సమస్య. కనుక ఈ విషయంలో ఎప్పుడు ఎవరూ ఏ వాదన చేశారనేది ఒకటైతే సమస్య తీవ్రత మాత్రం విస్మరించడానికి లేదు. ఉదాహరణకు బీజేపీ మాజీ ఎంపీ జీవిఎల్‌ నరసింహారావు 2010లో ఇవిఎంల విశ్వసనీయతపై ఒక పుస్తకమే రాశారు. దానికి అప్పటి ఆపార్టీ అగ్రనాయకుడు ఎల్‌కె అద్వానీ, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుమాటలు రాశారు. ఇవిఎంలు ప్రభుత్వ రంగసంస్థ ఇసిఐఎల్‌లో తయారవుతాయనే ఒకే కారణంతో పూర్తిగా విశ్వసించడం సరికాదని చంద్రబాబు అందులో రాశారు.జర్మనీ,జపాన్‌ వంటి అభివృద్ధి చెందిన అనేక దేశాలు ఈవీఎంలను పక్కన పెట్టడంపై జీవీఎల్‌ అందులో వివరమైన చర్చ చేశారు. పూర్తిస్థాయిలో వివిపాట్‌లను జతచేయడమే దీనికి పరిష్కారమని అందులో జీవీఎల్‌ వివరించారు.
కేసులు, తీర్పులు
ఇటీవల ప్యోర్టరికో ఎన్నికల్లో అవకతవకలపై తీవ్ర ఆరోపణలను ఉదహరిస్తూ అమెరికా సెనేటర్‌ రాబర్ట్‌ ఎఫ్‌.కెనడీ ఇవిఎంలలో ఓటు సరిగా పడిందో లేదో చూసుకోవడానికి తప్పక అవకాశం వుండాలన్నారు. ప్రపంచ సాంకేతిక దిగ్గజం టెస్లా చైర్మన్‌ ఎలన్‌మస్క్‌ ఆయన మాటలు పొందుపరుస్తూ ఏ ఎలక్ట్రానిక్‌ పరికరాన్నయినా హ్యాకింగ్‌ చేయొ చ్చని స్పష్టం చేశారు. ఆ విధంగా ఇవిఎంల కన్నా పేపర్‌ బ్యాలెట్‌లే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. మన దేశంలో అంతకుముందే వున్న చర్చకు ఇది ఆజ్యం పోసింది. మస్క్‌ వ్యాఖ్యలు వచ్చీ రాకముందే కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత రాజీవ్‌ చంద్రశేఖర్‌ దానిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. లోపరహితమైన ఇవిఎంల తయారీలో కావాలంటే మస్క్‌కు సహకారం అందిస్తామని గొప్పలు పోయారు. నైరుతి ముంబాయిలోని ఒక పోలింగ్‌ స్టేషన్‌లో అధికారి ఫోన్‌ ఆ విజేత బావమరిది అక్రమంగా వినియోగం పౖౖె కేసు వార్త జతచేస్తూ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇవిఎంల హ్యాకింగ్‌పై వ్యాఖ్య చేశారు. (ఈ స్థానంలో శివసేన(షిండే) వర్గం అభ్యర్థి అయిదు ఓట్ల ఆధిక్యతతో గెలిచారు) పలు పార్టీలు ఎప్పటిక ప్పుడు ఎన్నికల సంఘానికి ఇంకా అనేక ఫిర్యాదులు చేస్తూనే వున్నా సరైన స్పందన కొరవడింది. చెప్పాలంటే సుప్రీంకోర్టులోనే వరుసగా ఇలాంటి కేసులు నడుస్తూనే వచ్చాయి. వివిపాట్‌లను జతచేయాలనే ఆదేశం కూడా 2013లో సుబ్రహ్మణ్యస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిందే. న్యాయంగా స్వేచ్చగా ఎన్నికల ప్రక్రియ జరగాలంటే పేపర్‌ వినియోగంతో పోల్చిచూడటం(పేపర్‌ ట్రయల్‌)తప్పనిసరి అని అభిప్రాయపడింది.సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల వివిపాట్‌ వెరిఫికేషన్‌ ఏర్పాట్లు జరగాలని 2019లో తీర్పు చెప్పింది. తాను నిర్ణయించిన అయిదు శాతం పోలింగ్‌ కేంద్రాల్లో మాత్రమే వివిపాట్‌లను వినియోగించాలన్నది ఎన్నికల సంఘం నిర్ణయం. రాజ్యాంగపరంగా ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగివుంటుంది గనక ఒక మేరకు మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించడం సాధ్యమవుతుంది. గతంలో ఇచ్చిన వివిధ తీర్పులు విచారణల ఆధారంగా ఇవిఎంలపై తాజా పిటిషన్లను కొట్టి వేస్తున్నట్టు మొన్నటి తీర్పులో చెప్పింది. అంతటితో ఆగక ఇవిఎంలపైనా, ఇసిపైనా పూర్తి నమ్మకం వెలిబుచ్చడంతో మొత్తం వ్యవస్థ లోపరహితమని కితాబునిచ్చిందని కొందరు భావించారు. నిజానికి ఇవిఎంలను గురించి ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ అందుకో అవకాశమైంది తప్ప రాజకీ యంగా రాజ్యాంగపరంగా ఆ సమస్య అలాగే వుంది.
కోట్ల ఓట్ల తేడా ఎందుకు?
స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించ డంలో ఎన్నికల సంఘం రాజ్యాంగ విహిత బాధ్యతలను నెరవేర్చివుంటే ఫలితాలు బీజేపీ, ఎన్డీయేలకు మరింత ప్రతికూలంగా వుండేవని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ తన ఎన్నికల సమీక్షలో వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం చాలావరకూ ఎన్డీయే భాగస్వామి పాత్ర పోషించిందని ఆపార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. బీజేపీ ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి తోడ్పడటమే లక్ష్యంగా ఇసి వ్యవహరిం చింది. మోడీతో సహా బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టు ఆధారాలతో సహా కనిపిస్తున్నా చర్యలు తీసుకోవ డానికి వెనుకాడింది. మోడీకి ఇవ్వాల్సిన తాఖీదును బీజేపీ అధ్యక్షుడిగా నడ్డాకు పంపి సరిపెట్టడమే గాక దాన్ని అన్నిపార్టీలకూ పంపి తన దోషాన్ని పంచే ప్రయత్నం చేసింది. అంతకంటే దారుణం పోలైన ఓట్ల సంఖ్యా వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తూ ఇసి ఎన్నికల వ్యవస్థలో మోసాలు జరిగివుంటాయనే సందేహాలు పెరగడానికి కారణమైంది. దాని రాజ్యాంగ ప్రతిష్టనూ దెబ్బతీసింది. ఎన్నికలు ముగిసిన తర్వాతనైనా ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఇసి చర్యలు తీసుకోలేదు. ఇవిఎంలలో నమోదైన ఓట్లకూ లెక్కింపు జరిగిన ఓట్ల సంఖ్యకూ భారీ తేడా ఎందుకు వచ్చిందనేది తేల్చనేలేదు.దేశ వ్యాపితంగా చూస్తే మొత్తం 5.14 కోట్ల ఓట్ల తేడా కనిపిస్తున్నది. ఓట్ల సంఖ్యలు దఫదఫాలుగా, రకరకాలుగా ఆలస్యంగా చెప్పడం అనూహ్యమైన పరిణామం. అసలు 2019 ఎన్నికల ఓట్ల వివరాలే రెండేళ్ల తర్వాత సవరించడమంటే ఇక వ్యవస్థ విలువేమయ్యేట్టు? అంటే ఇక్కడ రాజ్యాంగ పరంగానూ, రాజకీయ కోణంలోనూ వ్యక్తిగతంగా ఆయా అధికారులు అంటే కమిషనర్ల పరంగానూ కూడా సవాళ్లు కాదన లేనివి. స్వయంగా తాను సూచించిన కొన్ని తరుణోపాయాలపైన కూడా ఇసి పట్టుపట్టకపోవడం మరీ విచిత్రం.పైగా పరిష్కారాలు, చర్యలు సూచించిన కమిషనర్లను పంపించేయడం, ఉదాహరణకు ఏ పోలింగ్‌ స్టేషన్లో ఓట్లు వాటికవిగా విడివిడిగా లెక్కపెట్టడం గాక అన్నిటినీ కలిపి(మిక్సింగ్‌) లెక్కపెడితే మంచిదని ఇసినే ఒకప్పుడు సూచన చేసింది.ఇందుకు టోటలైజర్‌ అనే సాధనం వాడవలసి వుంటుంది. ఇసిఐఎల్‌ అందులో ఏర్పాటు చేసింది కూడా. మన ఇవిఎంలలో ఆ విధంగా 14 క్లస్టర్ల ఓట్లు కలిపి చూసే అవకాశం వుంటుంది. సంబంధిత అభ్యర్థికి మొత్తం ఓట్లు ఎన్ని వచ్చాయో తెలుసుకోవడానికి ఒక బటన్‌ నొక్కితే సరిపోతుంది.లా కమిషన్‌ కూడా ఈ సూచనకు మద్దతునిచ్చింది.
యూనిట్ల వరస మార్పు
టోటలైజర్‌పై ఇసి 2016లో రాజకీయ పార్టీలతో చర్చలు జరిపితే కాంగ్రెస్‌తో సహా మూడు పార్టీలు ఒప్పుకున్నాయి సీపీఐ(ఎం) దశలవారీగా ప్రవేశపెట్టాలని చెప్పగా సీపీఐ అభిప్రాయం చెప్పలేదు, బీజేపీి వ్యతిరేకిం చింది. 2017లో మరోసారి ఇసి కేంద్రం అభిప్రాయం అడిగితే మంత్రుల బృందం అధ్యయనానికి అప్పగిస్తే ఏ బూత్‌లో ఎలా ఓటు చేశారో చేయలేదో తెలిస్తే ప్రభుత్వాలకు తీసుకోవలసిన పాలనా చర్యలు ఏమిటో తెలుస్తుందనే వింతవాదన తీసుకొచ్చింది. ఓటింగు తీరు సమాచారం బెదిరింపులకూ దాడులకూ వాడుకుంటారనే వాస్తవ సమస్యను పక్కదోవ పట్టించింది. ఎన్నికల పారదర్శకత కోసం గట్టిగా మాట్లాడి, అర్ధంతరంగా పదవీ విరమణ చేసిన మాజీ కమిషనర్‌ అశోక్‌లావాసా దీనిపై ఇటీవలే వ్యాసం కూడా రాశారు. టోటలైజర్‌ వినియోగించే సమయం ఇంకా రాలేదని మొన్నటి ఎన్నికల తర్వాత కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఒక రీమోట్‌ సాయంతో పనిచేస్తుంది గనక దాన్ని రాజకీయ పార్టీలు నమ్మకపోవచ్చని వాదించారు. ఇవిఎంలపై సందేహాలున్నా పట్టించుకోని ఇసి లేని రాని పద్ధతిపై నమ్మకం వుండకపోవడం గురించి మాట్లాడుతున్నారు.
పారదర్శకత కోసం,ఇవిఎంలో ఓటింగు యూనిట్‌ల సీక్వెన్స్‌ మార్చాలని సీపీఐ(ఎం) మరో పద్ధతి సూచించింది. ప్రస్తుతం బ్యాలట్‌ యూనిట్‌ ముందు, తర్వాత వివిపాట్‌ ఆ తర్వాత కంట్రోల్‌ యూనిట్‌ వుంటున్నాయి. అంటే వివిపాట్‌ నిర్ధారించిన ఓటు, మొత్తం నమోదయ్యే కంట్రోల్‌ యూనిట్‌కు వెళ్లే ఓటు ఒకటే అవునో కాదో అర్థం కాదు, ‘బండి ముందు గుర్రం వెనక’ చందంగా నడుస్తుంది. కనక ముందు బ్యాలట్‌ తర్వాత కంట్రోల్‌ ఆ పైన చివరగా వివిప్యాట్‌ వుంటే మెరుగని రాసింది. ఇందులో ఎలాంటి సాంకేతిక సమస్యలు కూడా లేవు. అయినా ఎన్నికల సంఘం నిరాకరించింది. కనీసం ఇదే పద్ధతిలో వంద శాతం వివిపాట్‌లను తీసుకోవాలనే కనీస సూచనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించడం దురదృష్టకరం. నా దేశంలో ప్రతి ఓటరూ తన ఓటు సద్వినియోగమైందని నిర్ధారించుకునే వీలుండా లన్నదే రాబర్ట్‌ కెనడీ ట్వీట్‌ సారాంశం. ఎలాన్‌ మస్క్‌ చెప్పింది కూడా అదే. కనీసం పోలింగ్‌ కేంద్రాల సీసీటీవీలో నమోదైన ఓటర్ల సంఖ్యనూ నమోదైన ఓట్లనైనా పోల్చి చూడాలని కూడా మస్క్‌ కొత్తగా సూచించారు. ఏది ఏమైనా భారతీయ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం, అవకతవకలను చక్కదిద్దడం కోసం పోరాటం కొనసాగ వలసిందే. ఎవరు గెలిచారు ఓడారనే దానితో నిమిత్తం లేని రాజ్యాంగ బద్దమైన అవశ్యకత అది. ఎందుకంటే న్యాయమైన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి, ప్రజల తీర్పు సార్థకతకూ ప్రాణం.
తెలకపల్లి రవి