గురువు లేని నరుడుండడు. గురువును గౌరవించని మనిషుండడు. గురువును నిర్లక్ష్యం చేస్తే మనిషి మానసిక ఎదుగుదల ఆగిపోక తప్పదు. మన తెలుగు సాంప్రదాయంలో గురువుకు విలక్షణ స్థానం ఇవ్వబడింది. గురువును నమ్మితే జ్ఞాన వికాసనం వడివడిగా జరుగుతుంది. అజ్ఞానమనే చీకటిని తరమడానికి జ్ఞానమనే దీపం వెలిగించే మహత్తరశక్తి గురువుకు మాత్రమే ఉంటుంది. లోకానికే జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు. గురుపరంపరను పూజించే సదాచారాన్ని పాటించే మన సంస్కృతిలో ఆషాఢ శుద్ద పౌర్ణమి రోజున గురు పౌర్ణమి పాటించడం అనాదిగా వస్తున్నది. వేదాలు, బ్రహ్మ సూత్రాలు, మహాభారతం, భగవద్గీత, పురాణాలను సమస్తం మానవాళికి అందించిన వేదవ్యాసుడి జన్మదినం రోజున గురువును పూజించుకునే ఆనవాయితీ గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమికి ఉన్నది.
గురువు అంటే జ్ఞానం. గురువు అంటే ధర్మం. గురువు లేని జన్మ వ్యర్థం. మట్టిని మాణిక్యంగా, మనిషిని మహామనిషిగా, వ్యక్తిలో వ్యక్తిత్వ వెలుగులు నింపుతూ, నిరక్షరాస్యుడిలో అక్షర విత్తులు నాటుతూ, రేపటి తరాన్ని నిర్మించే మహాయజ్ఞంలో ప్రధాన భూమికను నిర్వహించేది ఉపాధ్యాయుడు ఒక్కడే. భవిష్యత్ తరాల నిర్మాణంలో, దేశ సమగ్రాభివృద్ధిలో గురువు పాత్ర అమోఘం, అనిర్వచనీయం. భారతీయ సంస్కృతిలో గురువు మూల స్తంభంగా నిలబడి ఉన్నాడు. జగన్నాథుడు శ్రీ కృష్ణుడు, సకల గుణ సంపన్నుడు శ్రీ రాముడు కూడా గురువు చెక్కిన అపురూప భగవత్ రూపాలే. సన్మార్గాన్ని చూపే దీపస్తంభం, రాతిని నాతిగ మార్చగల నేర్పరి, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగల జ్ఞాని, విజ్ఞాన వితరణశీలి, జ్ఞాన బోధకుడు, వివేక జ్యోతి, నిస్వార్థ అక్షర కర్షకుడు, సమాజ క్షేత్రంలో విలువల విత్తులు నాటే అనంత విజ్ఞాన మేధోసంపన్నుడైన గురువు సమాజ నిర్మాతగా అద్వితీయ సేవలను అందిస్తూనే ఉన్నాడు, భవిష్యత్తులో అందిస్తాడు కూడా. గురువును గౌరవించని సమాజం నరక సమానం. గురు బోధనలు వినని తనువు వింత జంతువే. గురువును మనసారా నమ్మని శిష్యుడు వింతైన నిరక్షరాస్య జంతువు. గురువు రేపటి తరానికి బోధకుడు మాత్రమే కాదు సన్మార్గాల బాట చూపగల మార్గదర్శి.
మానవ సమాజోద్దరణ మహాయజ్ఞంలో ప్రథమ స్థానం గురువుదే. పేదరికం, అధిక జనాభా, అనారోగ్యాలు, ఆకలి చావులు, నిరుద్యోగం లాంటి సమస్యలకు సమాధానం విద్యాధిక సమాజ జ్ఞాన సంపన్న నిర్మాణమే. విద్య సమపార్జనలో ఉపాధ్యాయుడే కేంద్రబింధువు. లేత విద్యార్థి శారీరక, మానసిక ఎదుగుదల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలిగేది గురువు మాత్రమే. ఆధునిక సమాజంలో విలువలు, ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఉపాధ్యాయుల అంకితభావంలో కూడా మార్పు కనిపిస్తున్నది. ఉపాధ్యాయ వృతి వెలకట్టలేనిది, అత్యంత పవిత్రమైంది. నేటి ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం రేపటి సమాజ అశాంతికి కారణం అవుతుంది. బోధన వృత్తి కాదు, అదో పవిత్ర బాధ్యత అని గురువులు గుర్తెరుగాలి. చురుకైన, అత్యాధునిక, సృజనశీల, వినూత్న, మేధో వికసిత సమాజ నాయకులను తయారు చేయగలిగే సామర్థ్యం గురు దైవం సొంతం. అసంఘటిత మానవ వనరులను సంఘటిత, సదాలోచనల శాస్త్రసాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దగల నేర్పరి గురువు మాత్రమే. నేటి సమాజ గురువుల్లో కూడా వ్యాపార ధోరిణి కనబడుతోంది. పాఠశాలలో బెల్, బిల్ సంస్కృతి పెరుగుతోంది. చదువు సంస్కృతిని, సాంప్రదాయాలను, మానవీయ విలువలను పెంపొందించాలి. పుస్తకంలోని పాఠాల బోధనతో పాటు జీవన నైపుణ్యాలను, జీవించే కళను నేర్పించగలగాలి. పాఠ్యాంశాల్లో పట్టు, సుక్ష్మ గ్రహకశక్తి, అనువర్తిత పరిజ్ఞానం, సంక్షోభాలను అధిగమించగల నేర్పు లాంటి పలు అంశాలను అందించగలిగిన వారే అసలైన గురువులు అవుతారు. గురు శిష్య పరంపర ఆరోగ్యంగా, బలంగా కొనసాగితేనే సమాజోద్ధరణ సుసాధ్యం. నేటి ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థలు ఉపాద్యాయులను సాధారణ ఉద్యోగులుగానే చూస్తున్నారు. గురువుకు ఇవ్వాల్సిన కనీస గౌరవాలు పలుచబడుతున్నాయి. గురువును నిర్లక్ష్యం చేస్తే రేపటి తరం శిక్షను అనుభవిస్తుందని మరిచి పోతున్నాం.
‘గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర్ణ గురు సాక్ష్యాత్ పరబ్రహ్మ’ అనే నానుడి మన తెలుగు ప్రజల నరనరాల్లో జీర్ణించుకు పోయింది. గురువులో దైవాన్ని చూడగలిగే విద్యార్థులు రేపటి సమాజంలో పూజ్యనీయులు అవుతారు. పరీక్షలో ఉత్తీర్ణులు కావడానికే కాదు, పరిపూర్ణ వ్యక్తిగా ఎదగడానికి చదువులు ఉపకరించాలి. విలువలు బోధించని విద్య సుగంధం లేని ప్లాస్టిక్ మల్లెపువ్వు లాంటిది. ‘మొక్కయి వంగనిది మానై వంగునా’ అను నానుడిని నిరంతరం గుర్తుంచుకోవాలి. బాల్యం నుంచే చదువు, సంస్కారాలు నూరి పోయాలి. బాధ్యతగల రేపటి పౌరులను తయారు చేసే కేంద్రాలుగా విద్యాలయాలు పూజ్యనీయ క్షేత్రాలుగా నిలబడాలి, గురువులు ఆరాధ్య దైవాలుగా పూజించబడాలి.
గురువు కంటే అధికమైన తత్వం, తపస్సు, జ్ఞానం లేదని మనకు తెలుసు. జ్ఞాన భాండాగారం, ప్రేరణామూర్తి, ప్రేమ చెలిమె, స్నేహ హస్తం, సంస్కర్త, బోధకుడు, మెంటర్, గైడ్, వివేక సంపన్నుడు, విజ్ఞాన గని, శాంత సముద్రుడు, ఫెసిలిటేటర్, డిమానిస్ట్రేటర్, నైపుణ్య ఊట, నాయకత్వ బాట, తడబడినపుడు ఊత కర్ర, సదా స్మరణీయుడు, నిత్య విద్యార్థి, సద్గుణ దీప స్తంభం అయిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా గురువును మన మనోమందిరాల్లో స్థాపించుకొని సన్మార్గంలో నడుద్దాం, విజ్ఞాన సమాజానికి దిశ నిర్దేశనం చేద్దాం.
(21 జూలై ‘గురు పౌర్ణమి’)
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037