స్కూలుకి వెళ్లే పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య నిత్యం తలెత్తే సమస్య ఇదే! లంచ్ బాక్స్ గురించి దాదాపు అన్ని ఇళ్లల్లోనూ కనపడుతుంది, వినపడుతుంది. దాన్ని గురించి చర్చోపచర్చలు, వాగ్వివాదాలూ జరుగుతూ వుంటాయి. చిన్నదానికి ఎందుకంత హైరానా పడుతుంటారని అనకండి. అదో పెద్ద సమస్య! కొందరు పప్పు, పెరుగు పెడతారు, మరికొందరు కేవలం పెరుగన్నం, ఇంకొందరు ఉదయాన్నే టిఫిన్ తినిపించి బాక్స్ లోకి మాత్రం బ్రెడ్ జామ్ ముక్కలు పెడతారు. ఇవే పదార్థాలను పిల్లలు రోజూ ఇష్టపడకపోవచ్చు. కనీసం రెండు రోజులకు ఒకసారైనా మెన్యూ మార్చాల్సి వస్తుంది. పిల్లలకు ఆర్డర్ వేయడమే తెలుసు. తల్లులే ప్రేమతో కూడిన ఇబ్బంది పడుతుంటారు. కోపగించుకుంటారు, నవ్వుకుంటారు. అంతా లంచ్ బాక్స్ మహిమ!
స్కూలు వయసు పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన పోషకాహారాలు అందించాలని డాక్టర్లు చెబుతుంటారు. దాన్నే తూ.చా తప్పక పాటించాలని తల్లులు కంకణం కట్టుకుంటారు. కానీ అవేవీ నిత్యం సాగనీయరు పిల్లలు. కారణం వారు తమ తోటి పిల్లల బాక్స్‌లతో పోల్చుకోవడం. ఇది ప్రతీరోజూ ఉండేదే. కొందరికి పెరుగన్నం అలవాటు ఉండదు, కొందరు పప్పు తినరు. వాళ్లు వెన్న రాసిన బ్రెడ్‌ముక్కలు, జ్యూస్ తెచ్చుకుంటారు. అది వారి భోజన వ్యవహారాల్లో భాగం. మనవాడికి అదే కావాల్సి వస్తుంది. మారాం చేస్తాడు. తల్లి చివరికి ఓ మెట్టు దిగుతుంది.
స్కూలు లంచ్ బెల్ కొట్టగానే బిలబిలమంటూ పిల్లలంతా స్కూలు ఆవరణ లోని చెట్ల నీడల్లోకి పరిగెడతారు, లేదా స్కూలు యాజమాన్యం ఏర్పాటు చేసిన లంచ్ రూమ్‌కి వెళతారు. కాస్తంత పెద్ద క్లాసు పిల్లలయితే తల్లిదండ్రులు లంచ్ బాక్స్ తెచ్చి తినిపించడాన్ని ఇష్టపడరు. విసుక్కుంటారు. అందరి ముందు సిగ్గుపడతారు. తేవద్దని అంటారు. కానీ బాక్స్ ఇస్తే సగం వదిలేస్తారు. వారికి అందరి ముందు తినడం సిగ్గు. ఇష్టం వుండదు. కేవలం బిస్కెట్లు, బ్రెడ్ ముక్కలు తినడానికే ఇష్టపడతారు. ఇంట్లో చేసినట్లు భోజనం చేయడానికి ఇష్టపడరు. ఇతరులు నవ్వుతారనో, గేలిచేస్తారనో భయం. అలా ఆకలితో ఉండేవారూ ఉంటారు. బాక్స్ బ్యాగ్‌లో పట్టడంలేదనే వంకపెట్టి కొందరు తీసికెళ్లరు. మరికొందరు పెద్ద క్లాసులోకి వెళ్లగానే లంచ్ బాక్స్ వద్దని ముందునుంచే దూరం చేస్తారు.
స్కూల్లో చదువు, ఆటపాటలతో గడిపే పిల్లలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్న నియమం తల్లిదండ్రులు పట్టుబట్టి అనుసరిస్తారు. ఈ విషయంలో కోపతాపాలు వ్యక్తమవుతుంటాయి. చిరాకులూ ఉంటాయి. కానీ చివరగా పిల్లలు ఆరోగ్యంతో, ఆనందంతో చదువుపట్ల శ్రద్ధవహించడం జరుగుతుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల లంచ్ బాక్స్ విషయంలో ఎంతో ఓర్పు వహించాలి.
– లంచ్ బాక్స్ ఎంపిక పిల్లల ఇష్టానికి వదిలేయండి.
– వీలైతే రోజూ కొత్త పదార్థాలు పెట్టండి.
– అపుడపుడు స్కూలు క్యాంటీన్లో తిననీయండి.
– పదార్ధాలు పూర్తిగా తినేలా ఉత్సాహపరచండి.
– పోలిక కంటే ఆరోగ్యం, పౌష్టిక ప్రమాణాలు పాటించండి.
– లంచ్ బాక్స్ సమస్య కారాదు, ఇష్టం ఉండాలి.
తల్లితండ్రులు పక్కన లేకపోయినా లంచ్ బాక్స్ ఒక్కరే కూర్చుని లేదా స్నేహితులతో కూర్చుని ఎంతో ఆసక్తితో తినేలా ఉండాలి. అపుడే ఆనందం, ఆరోగ్యం. ఈ చిన్ని సూత్రాన్ని పాటించగల్గితే చాలు!
– డా|| హిప్నో పద్మా కమలాకర్, 9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్