సాధారణ బదిలీల కౌన్సిలింగ్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలి

– తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్‌ అసోసియేషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సాధారణ బదిలీల కౌన్సిలింగ్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మరియమ్మ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. క్లియర్‌ వేకెన్సీని ప్రకటించి, ఏ క్యాటగిరీలో ఎవరెవరిని బదిలీ చేస్తున్నారనే విషయాన్ని జాబితాలో స్పష్టంగా పేర్కొనాలని కోరారు. సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారికి న్యాయం చేయాలనీ, జోన్ల వారీగా సీనియారిటీ ప్రకారం స్పష్టంగా లిస్ట్‌ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కౌన్సిలింగ్‌ తేదీలను కూడా స్పష్టంగా ప్రకటించాలని పేర్కొన్నారు. ఇప్పటికే మూడు సార్లు ప్రకటించిన లిస్టుల్లో తప్పులున్నాయనీ, డీహెచ్‌ కార్యాలయం నర్సింగ్‌ ఆఫీసర్ల లిస్టును సరిగ్గా ప్రకటించడం లేదని విమర్శించారు. శుక్రవారం ఆందోళనతో ఆగిపోయిన కౌన్సిలింగ్‌ను ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపైనా స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మే నెలలో జీవో నెంబర్‌ 80 విడుదలైన వెంటనే అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా స్టాండింగ్‌ లిస్ట్‌ను జోన్ల వారీగా చూపిస్తూ, ప్రతి జోన్‌ నుంచి 40 శాతం తప్పనిసరి బదిలీల వివరాలివ్వాలని కోరారు. 26 నుంచి 30 సంవత్సరాలుగా సేవలం దిస్తున్న 98, 95 అపాయింట్‌ మెంట్‌ బ్యాచ్‌కు పదోన్నతుల్లో ముందుగా ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.