సీసీ రోడ్డును గ్రావెల్ రోడ్డులా మార్చారు.. 

CC road has been converted to gravel road.

– అవగాహన లోపంతో ప్రజలను మరింత ఇబ్బందుల్లో పడేసిన అధికారుల వైనం
– సీసీ రోడ్డు సమస్య పరిష్కరించాలని కాలనీ వాసుల వేడుకోలు 
– సమస్యను పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు
– పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న, బెదిరింపులకు పాల్పడుతున్న ప్రజా ప్రతినిధిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ నుండి ఆంధ్ర బ్యాంకు వరకు ప్రధాన అంతర్గత సీసీ రోడ్డు గుంతల మయంగా మారిందని గత కొన్ని సంవత్సరాలుగా స్థానికులు మొర పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల రవాణా సౌకర్యం దృష్ట్యా సంబంధిత అధికారులు తాత్కాలిక చర్యలు చేపడుతున్నారే తప్పా దీర్ఘకాలిక చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఘాటుగా ఆరోపిస్తున్నారు. ఇదే సమస్య పరిష్కారానికి ఇటీవలికాలంలో నవతెలంగాణ కథనంతో పాటు పలు దినపత్రికల్లో వివిధ శీర్షికలతో కథనాలు వెలువడిన విషయం విదితమే. స్పందించిన స్థానిక సంబంధిత అధికారి మూడు రోజుల క్రితం ఉడతాభక్తిగా సీసీ రోడ్డుపై నాణ్యత లేని గ్రావెల్ పోయడం జరిగింది. దాంతో ఆ సీసీ రోడ్డు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఆ వైనం చూసిన మండల కేంద్రంలోని పలువురు పెదవి విరిచారు. మరికొందరైతే ఏకంగా అధికారి చేసిన పనిని తప్పుబడుతున్నారు. ఆ సీసీ రోడ్డుపై గుంతలు ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా గానీ.. సంబంధిత పీఆర్, ఎంపీడీవో శాఖలలో నిధులు ఉన్న సమయంలో ఆ వీధిలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు చేపట్టలేదని స్థానికులు వాపోతున్నారు. నిధులు ఉన్న సమయంలో రోడ్డు కోసం నిధులు మంజూరు చేస్తే ఈ తిప్పలు ఉండేవి కావని స్థానికులు అక్కసు వెళ్లగక్కారు. అలా చేయకుండా పాత సీసీ రోడ్డుపై గుంతలు ఉన్న చోట నాణ్యత లేని గ్రావెల్ పోయడంతో పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నాణ్యత లేని గ్రావెల్ పోసిన ప్రదేశాన్ని జనాలు చూసి సీసీ రోడ్డును కాస్తా బురద రోడ్డులా అధికారి మార్చారని, దీనికంటే పాత సీసీ రోడ్డే నయమని, ఇప్పుడా రోడ్డు మరింత అధ్వానంగా మారిందని, అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం దాపురించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆ వీధిలో నివసించే ప్రజలు బురద వల్ల దుర్వాసన వస్తుందని, దాంతో ఈగలు, దోమల బెడద పెరిగి రోగాలు ఈ వర్షాకాలం సీజన్ లో రోగాలు రెట్టింపుగా ముసురుకుంటాయని భయాందోళనలకు గురవుతున్నారు. మూలుగుతున్న నక్కపై తాటి పండు పడ్డ చందంగా.. ఆ కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం గమనార్హం. సుమారు 25 ఏండ్ల క్రితం పోసిన పాత సీసీ రోడ్డును తీసి, నూతన సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేయడం లేదని! దాంతో.. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతామని మండల వాసులు కలత చెందుతున్నారు. ఆ వీధి పట్ల అధికారులు చేస్తున్న కంటితుడుపు చర్యలపై గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని నూతన సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని, అప్పటి వరకు సీసీ రోడ్డుకు తగిన మరమ్మత్తులు చేయించాలని, సరైన డ్రైనేజీ వ్యవస్థ కల్పించాలని ఆ కాలనీ వాసులు, ప్రయాణికులు వేడుకుంటున్నారు.
ఇదిలా ఉంటే మండల కేంద్రంలోని ఆ వీధిలో సీసీ రోడ్డు సమస్య పరిష్కారం చూపాల్సిన సంబంధిత ప్రజా ప్రతినిధి పరిష్కారం చూపడం మాని, ప్రజల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న ఓ స్థానిక పాత్రికేయుడిని చరవాణిలో.. “పదే పదే కథనం రాయడం ఎందుకు? వేరొక విలేకరి నీకు చెప్తే నువ్వు రాయడం అవసరమా? ఆయన మాట నువ్వు వినడం ఏంటి? మీ గ్రామంలో సమస్యలు లేవా? ఈజీఎస్ పనులపై కథనాలు రాస్తే.. ఏం జరిగిందో తెలియదా?” అంటూ బెదిరింపులకు పాల్పడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. సంబంధిత అధికారులతో ఆ వీధిలో సీసీ రోడ్డు పనులు చేపట్టడం వదిలేసి, పనిచేయాల్సిన సంబంధిత అధికారులను ప్రతిసారీ వెనకేసుకు రావడం వెనుక మతలబు ఏమిటని పలువురు నాయకులు, స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. పాత సీసీ రోడ్డు విషయం వెలుగులోకి రావడంతో తన పాలన విధానంపై స్థానిక ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతాయనే భయంతో ప్రస్తుత కాలంలో పలువురు స్థానిక పాత్రికేయులతో పరుష పదజాలంతో మాట్లాడుతూ.. పత్రికల యాజమాన్యాలను కించ పరిచే విధంగా వ్యవహరిస్తున్న, గతంలోనూ పలు మార్లు తన హోదాను మరిచి ప్రవర్తించిన ఆ స్థానిక ప్రజా ప్రతినిధిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇటువంటి బెదిరింపులకు వెరవబోమని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. ఇకనైనా సంబంధిత ప్రజా ప్రతినిధి పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించడం, అవమానించడం మాని ఆళ్ళపల్లి మండల అభివృద్ధికి, ప్రజా శ్రేయస్సుకు దోహదపడాలని  ప్రెస్ క్లబ్ గా వారు పిలుపునిచ్చారు.