నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 25న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యదర్శి నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒరిజినల్ ఫారం-1 ధ్రువపత్రంతోపాటు స్పోర్ట్స్‌కు సంబంధించి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని సూచించారు. ఈనెల 27న రిజర్వ్ డేగా ఉంటుందని తెలిపారు. ఈనెల 25న సంబంధించి ధ్రువపత్రాలను తెచ్చుకోని అభ్యర్థులు 27న రిజర్వ్‌డేలో తప్పనిసరిగా పెండింగ్‌లో ఉన్న ధ్రువపత్రాలను సమర్పించాలని కోరారు. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఉండబోదని స్పష్టం చేశారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ రాతపరీక్షలను హెచ్‌ఎండీఏ పరిధిలోనే నిర్వహిస్తున్నారు. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షను ఈనెల తొమ్మిదిన నిర్వహించింది. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 3.02 లక్షల మంది హాజరయ్యారు. వారిలో 31,382 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికయ్యారు.