నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైల్‌లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సోమవారం మాజీ మంత్రి కేటీఆర్ ములాఖత్ అయ్యారు. దాదాపు 15 నిమిషాలు ఆమెతో ముచ్చటించారు. ఈ సందర్బంగా కవిత అరోగ్య విషయాలను అడిగి తెలుసు కున్నారు. అలాగే న్యాయపరంగా అందించాల్సిన సహాయంపై చర్చించారు. అయితే కేటీఆర్ కవితను తీహార్ జైల్‌లో కలవడం ఇది రెండోసారి. ఆయనతో పాటు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ నేతలు కలిసి కవితకు ధైర్యం చెప్పారు.
కవితపై దాఖలైన అడిషన్ చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి కవితపై సీబీఐ దాఖలు చేసిన అడిషనల్ చార్జిషీట్‌ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితతోపాటు మరో నలుగురి ప్రమేయం ఉందని సీబీఐ అడిషనల్ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అడిషనల్ చార్జిషీట్ సరిగాలేదని ఆరోపిస్తూ బెయిల్ ఇవ్వాలని కవిత మరోసారి ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా ఆగస్టు 5న తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన అడిషనల్ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా వెల్లడించారు. ఈ నెల 26న చార్జిషీట్‌పై తదుపరి విచారణ చేపడతామని తెలిపారు.