నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్ విచారణ సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో నిందితునిగా ఉన్న ఏ. రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈ కేసు ట్రయల్స్‌ను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథ్‌తో కూడి ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. గతంలో రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్ అఫిడవిట్లను సోమవారం పరిశీలించిన ధర్మాసనం రిజాయిండర్ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు రెండు వారాల సమయం ఇచ్చింది. దీంతో కేసు విచారణను ధర్మాసనం రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసు ట్రయల్స్‌ని హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్, భూపాల్‌కు మార్చాలని పిటిషన్‌లో జగదీశ్‌రెడ్డి కోరారు.