అక్టోబర్‌ నాటికి అడ ప్రాజెక్టుకు మరమ్మతులు

Navatelangana,Telangana,Telugu News, Telangana News,Adilabad– కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
రానున్న అక్టోబర్‌ నాటికి అడ కుమురం భీమ్‌ ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే తెలిపారు. నాలుగు రోజుల నుండి అధిక వర్షపాతం నమోదు అవుతున్న నేపథ్యంలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఇరిగేషన్‌ ఈఈ గుణవంతురావ్‌, డీఈ దామోదర్‌, డీఎల్పీఓ ఉమర్‌ హుస్సేన్‌తో కలిసి అడ ప్రాజెక్టు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అక్టోబర్‌ నాటికి అడ ప్రాజెక్టుకు మరమ్మతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కాలువలు పూర్తి అయిన వరకు నీళ్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితి సమీక్షించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజల సంరక్షణార్థం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల అధికారులను అన్ని రకాలుగా సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఐటీడీఏ పీఓ ఖుష్బుగుప్తాతో కలిసి జిల్లాలోని మిషన్‌ భగీరథ ఫిల్టర్‌ బెడ్‌, అర్బన్‌ పార్క్‌, అడ పీహెచ్‌సీ, ప్రాజెక్టు బోటింగ్‌ పాయింట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర తాగునీటి సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని మిషన్‌ భగీరథ ఫిల్టర్‌ బెడ్‌ ద్వారా రోజుకు 115 మిలియన్‌ లీటర్ల తాగునీరు సరఫరా చేసేందుకు అవకాశం ఉందని, వర్షాకాలం అయినందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా శుద్ధమైన తాగునీటిని సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 17 మండలాల్లోని 900 గ్రామాలకు ఈ ఫిల్టర్‌ బెడ్‌ ద్వారా తాగునీరు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. అర్బన్‌ పార్క్‌లో ఐటీడీఏ నిధులు వినియోగించుకొని పనులు త్వరితగతిన చేపట్టాలన్నారు. దానిని చిల్డ్రన్‌ పార్క్‌గా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. గర్భిణీలకు ఎప్పటికప్పుడు అవసరమైన పరీక్షలు చేయాలన్నారు. అడ ప్రాజెక్టులో బోటింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేయడానికి 100 రోజుల్లో అవసరమైన నివేదికలు తయారు చేయాలన్నారు. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసరావు దేశ్‌ పాండే, డీఈ ఇర్ఫాన్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.