వ్యవసాయ రంగంలో సంస్కరణలు తప్పనిసరి

CEA Anantha Nageswaran
New Delhi: Chief Economic Advisor V. Anantha Nageswaran addresses a press conference after tabling of the Economic Survey 2023-24 in Parliament by Union Finance Minister Nirmala Sitharaman, in New Delhi, Monday, July 22, 2024. (PTI Photo/Shahbaz Khan)(PTI07_22_2024_000195B)

– దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి వుంది : సీఈఏ అనంత నాగేశ్వరన్‌
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగం దూసుకువెళుతోందని అయితే కొన్ని ఒడిదుడుకులను అధిగమించాల్సిన అవసరం వుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. సోమవారం ఆమె పార్లమెంట్‌ ఉభయ సభల్లో 2023-24 సంవత్సరానికి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. దీనితో పాటు గణాంకాలతో కూడిన అనుబంధాన్ని కూడా అందచేశారు. రుణాలు అందించడంలో బ్యాంకింగ్‌ రంగ ఆధిపత్యం తగ్గుతోందని, పెట్టుబడుల మార్కెట్ల పాత్ర పెరుగుతోందని సర్వే పేర్కొంది. మంగళవారం 2024-25 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టనున్నారు. వరుసగా మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్‌ ఇదే. ప్రభుత్వ ఆర్థిక పనితీరుపై అధికారిక నివేదిక వంటిది ఈ ఆర్థిక సర్వే. పార్లమెంట్‌లో సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం ముఖ్య ఆర్ధిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి 6.5 నుండి 7శాతం మధ్య వృద్ధి చెందే అవకాశం వుందని సర్వే చెబుతోందన్నారు.
వ్యవసాయ రంగంలో అత్యవసరంగా సంస్కరణలు తేవాలి
దేశ వ్యవసాయ రంగంలో అత్యవసరంగా సంస్కరణలు తీసుకురావాలని ఆర్థిక సర్వే పిలుపిచ్చింది. ఈ రంగంలోని వ్యవస్థాగత అంశాలు దేశ సర్వతోముఖ ఆర్థికాభివృద్ధి పంథాను దెబ్బతీసే అవకాశం వుందని హెచ్చరించింది. వ్యవసాయ రంగంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం వుందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) వి.అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. భారతదేశ వ్యవసాయ రంగం సంక్షోభంలో లేదని, కానీ వ్యవస్థాగతంగా తీవ్రమైన పరివర్తన జరగాల్సిన అవసరం వుందని అన్నారు. రాబోయే కాలంలో వాతావరణ మార్పులు, నీటి సంక్షోభమనేది చాలా కీలక పాత్ర పోషించనున్నాయని అందువల్ల ఈ రంగంపై సవివరణమైన చర్చలు అవసరమని అన్నారు.
రైతులకు ప్రస్తుత ప్రభుత్వ సబ్సిడీలు, మద్దతు చర్యలు కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతమున్న విధానాలను పున:మదింపు చేయాలని కోరారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, పంటల నష్టం కారణంగా గత రెండేళ్ళుగా ఆహార ధరలు పెరిగాయని ఆర్థిక సర్వే పేర్కొంది.
మరింత మెరుగవాలి
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి స్వల్పంగా తగ్గిందని సిఇఎ చెప్పారు. రుతుపవనాల రాక ఆలస్యమవడం ఇందుకు కారణంగా వుందన్నారు. మన ఎంఎస్‌పి విధానాలతో వైవిధ్యభరితమైన పంటలను ప్రోత్సాహించాల్సిన అవసరం వుందన్నారు. ఆర్ధికవ్యవస్థ ముందంజలో వుందని సిఇఎ అన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఒక త్రైమాసికం గడిచిపోయిందని, ఈ మార్చి చివరి నాటికి వృద్ధిరేటు 8.4శాతంగా వుందని చెప్పారు. గత మూడేళ్ళలో సగటు వృద్ధి రేటు కూడా దాదాపు 8శాతంగానే వుందన్నారు.