అధైర్యపడొద్దు..అండగా ఉంటాం

అధైర్యపడొద్దు..అండగా ఉంటాం– వరద ప్రాంత అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి
– రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి
నవతెలంగాణ-బూర్గంపాడు/భద్రాచలం రూరల్‌
గోదావరి వరదల వల్ల ప్రజలు ఎవ్వరూ అధైర్య పడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని గోమ్మూరు గోదావరి రేవు ప్రాంతంలో గోదావరి వరద ఉధృతిని ఆయన పరిశీలించారు. గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో గోదావరి వరద సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ అప్రమంతంగా ఉండేందుకు అధికారులు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. మంత్రితో పాటు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఎస్పీ రోహిత్‌ రాజు, జిల్లా అధికారులు గోదావరి ఉధృతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ముజాహిద్‌, ఎంపీడీవో జమలారెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మెన్‌ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు భజన సతీష్‌, బర్ల నాగమణి, భజన ప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు దుర్గెంపూడి కృష్ణారెడ్డి, బూర్గంపాడు కాంగ్రెస్‌ పార్టీ టౌన్‌ అధ్యక్షులు మందా నాగరాజు, మోరంపల్లి బంజర ఉప సర్పంచ్‌ కైపు లక్ష్మీ నారాయణ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ముంపు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి పొంగులేటి
భద్రాచలం వద్ద గోదావరి 55 అడుగులకు వచ్చే అవకాశం ఉన్నందున ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం సబ్‌ కలెక్టర్‌ రేట్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గోదావరి వరదల సమయంలో తీసుకోవలసిన తగు జాగ్రత్తలపై భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఐటీడీఏ పీవో బి. రాహుల్‌, ఎస్పీ రోహిత్‌ రాజ్‌, ఏఎస్‌పీ అంకిత్‌ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం అనేది చెప్పి రాదని నిరంతరంగా వర్షాలు కురవడం వల్ల గోదావరికి పైన ఉన్నటువంటి నదుల నుంచి వరద ప్రభావం పెరిగిందని ప్రవాహానికి తగినట్లుగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సన్నద్ధతో ఉన్నట్లు ఆయన అన్నారు. అధికార యంత్రాంగం 24 గంటలు నిరంతర సేవలో నిమగమై ఉన్నట్లు ఆయన వివరించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడానికి మహిళా సమాఖ్య సభ్యుల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, అలాగే వరద ముంపునకు గురి అయ్యే గ్రామాలకు వైద్యం సౌకర్యం పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని అత్యవసర మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామని అన్ని గ్రామాలలో సురక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నామని విద్యుత్‌ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్నామని ఆయన అన్నారు. పునరావాస కేంద్రాలలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఏఎన్‌ఎం ఆశ వర్కర్లు తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలని గర్భిణీ స్త్రీలను దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. కూనవరం నుండి వచ్చే వాహనాలను ప్రజలను భద్రాచలం రాకుండా చూడాలని ఏఎస్పీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దామోదర్‌ రావు, ఇరిగేషన్‌ సిఇ వెంకటేశ్వర్లు, ఈఈ రాంప్రసాద్‌, సీడబ్ల్యూసి అధికారులు పాల్గొన్నారు.