– ముంచుకొస్తున్న ముంపు
– భద్రాచలం పట్టణంలో పునరావాస కేంద్రాలు సిద్ధం
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
రామయ్య ఇలాకలో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తూ 50 అడుగులకు చేరుకొని లోతట్టు ప్రాంత ప్రజలను వనికిస్తుంది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న లక్షల క్యూసెక్కుల నీలకు తోడు ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఇటు తాలిపేరు, అటు కిన్నెరసాన్ని ప్రాజెక్టుల నుండి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి గంట గంటకు పెరుగుతూ ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తుంది. 50 అడుగులకు చేరుకొని ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి నేపథ్యంలో పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ, కొత్త కాలనీ, చప్టదిగువ అయ్యప్ప కాలనీ, ఏంసీ కాలనీ తదితర లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావస కేంద్రాలను రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. పట్టణంలోని నన్నపనేని మోహన హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు బాలికల ఆశ్రమ పాఠశాల, బాలుల ఆశ్రమ పాఠశాలలను పురావస కేంద్రాలుగా మార్చి పంచాయతీ, రెవెన్యూ సమన్వయంతో ముప్పు ప్రాంత ప్రజలను తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. గోదారి పరివాహక ప్రాంత అధికారులు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ చర్యలలో పాల్గొనాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మరో మూడు అడుగుల వరకు గోదారి పెరిగితే మూడవ ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేసేందుకు జన వనరుల శాఖ అధికారులు సిద్ధంగా ఉండగా పట్టణంలోని స్లూఈజుల వద్ద కట్టుదిట్టమైన ప్రతిష్ట భద్రత ఏర్పాట్లను చేశారు.
ముంపు మండలాలకు ముంచుకొస్తున్న వరద ముంపు
పోలవరం ముంపు పేరుతో ఆంధ్ర ప్రదేశ్‌లో విలీనం చేసిన ఎట్టపాక, వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాలకు వరద ముంపు ముంచుకొస్తుంది. ఇప్పటికే కూనవరం, వీఆర్ పురం మండలాలలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు ఎట్టపాక మండలంలోని ముంపుకు గురైన గ్రామాలను సైతం ఖాళీ చేపిస్తున్నారు. సోమవారం ఉదయం నుండే భద్రాచలం నుండి కూనవరం విఆర్ పురం చింతూరుకు వెళ్లే జాతీయ రహదారిలో అనేక చోట్ల గోదారి నీరు వచ్చి చేరడంతో రాకపోకలను నిలిపివేశారు. ఇటు భద్రాచలం నుండి వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రయివేటు వాహనాలను కూడా పట్టణంలోని శివారు ప్రాంతమైన సరస్వతి శిశు మందిరం వద్ద నిలిపివేస్తున్నారు. మరోపక్క చింతూరు నుండి చత్తీస్గడ్, ఒడిస్సా రాష్ట్రాలకు వెళ్లే జాతీయ రహదారులు సైతం జలదిబ్బంధంలోకి వెళ్లగా అటువైపు కూడా రాకపోకలు నిలిపివేశారు.
మరోపక్క కూనవరం, వీఆర్ పురం మండలాలలో అర్ధరాత్రి అకస్మాత్తుగా వరద పెరుగుతున్న నేపథ్యంలో రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీష హుటాహుటిన ముంపు మండలాల పర్యటించి లోతట్టు ప్రాంత ప్రజలను తన సొంత వాహనాలలో పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒకవైపు శబరిపోటు మరోవైపు పోలవరం బ్యాక్ వాటర్‌తో గోదావరి ఉగ్రరూపాన్ని దాల్చిన నేపథ్యంలో ఏజెన్సీలో అనేక గిరిజ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినాయి. ముంపు మండల ప్రజలు క్షణక్షణం ఒక యుగం లాగా గడుపుతున్నారు.