
నవతెలంగాణ కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో వంటగదిని, మరుగుదొడ్లు, మూత్రశాలను, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. వంటగదిలో నిలువ ఉన్న కూరగాయలను, ఆహార ధాన్యాల నాణ్యతలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. తర్వాత సందర్శించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించడం ద్వారా పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.విద్యార్థు లకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే తక్షణమే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరిక్షలు చేయించాలని పాఠశాల ప్రత్యేక అధికారిని గంగా మణికి సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, తహసిల్దార్ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్, తదితరులు ఉన్నారు.