రైతు రుణమాఫీలో నష్టపోయేదెవరు?

Who will lose in farmer loan waiver?తెలంగాణలో రైతు రుణమాఫీ మార్గదర్శకాలను జూలై 15వ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది. పంట రుణమాఫీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల రుణాలున్న బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయనుంది. ఆరోహణ క్రమంలో చిన్న విలువ నుంచి పెద్ద విలువ రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తామని ప్రకటించింది.రీషెడ్యూల్‌ చేసిన రుణాలకు 2లక్షల రూపాయల రుణమాఫీ వర్తించదని వెల్లడించింది. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పిఎసిఎస్‌ నుంచి తీసుకున్న రుణాలే మాఫీ అవుతాయి. యస్‌ఎచ్‌ జి,జెఎల్‌ జి,ఆర్‌ఎంజి,ఎల్‌ఈసిఎస్‌ రుణాలకు వర్తించదని తెలిపింది.ఒక రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం నేరుగా మాఫీ చేస్తుంది.ఏ కుటుంబానికైతే 2 లక్షల రూపాయలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులు రూ.2లక్షలకు పైబడి ఉన్న మొత్తాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి.ఆ తర్వాత అర్హత గల రూ.2లక్షలను రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఇదీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి సర్కార్‌ పెట్టిన షరతు. పునర్వ్య వస్థీకరించబడిన లేదా రీషెడ్యూల్‌ చేసిన రుణాలకు రుణమాఫీ వర్తించదని, బ్యాంకులు వారు పొందిన రుణాలపై తిరిగి చర్చలు జరుపుతున్నందున ఇది పెద్ద సంఖ్యలో రైతులపై ప్రభావం చూపుతుంది.
మార్గదర్శక సూత్రాల్లో లోపాలు
రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు తీవ్ర లోపభూయి ష్టంగా ఉన్నాయి.వాటి ప్రకారం కౌలు దార్లకు రుణమాఫీ వర్తించదు, పోడు వ్యవసాయం చేసే వారికి, రైతుమిత్ర గ్రూపులకు రుణ మాఫీ ఉండదు. కాంగ్రెస్‌ పార్టీ అందరికీ రుణ మాఫీని వర్తింపజేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించి ఇప్పుడు వారిని విస్మరి స్తున్నది. చిన్న,సన్న కారు రైతులందరూ ఈ పథకంలో లబ్దిపొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.జాయింట్‌ లియబిలిటీ గ్రూపులుగా కౌలుదార్లను రూపొందించి ఈ పథకాన్ని వారికి వర్తింపజేయాలి. ప్రకతి వైపరీత్యాలతో తీవ్ర నష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వం రుణాలను రీషెడ్యూల్‌ చేస్తుంది. అలాంటిది మరి ఈ రీషెడ్యూల్‌కు రుణమాఫీ వర్తింపజేయకపోవడం ఏమిటనేది అంతుచిక్కని ప్రశ్న. రైతుమిత్ర గ్రూపుల్లో చిన్న,సన్నకారు రైతులు, కౌలు రైతులు ఉన్నారన్నారు.రైతుమిత్ర గ్రూపులు రుణాలు తీసుకోవడానికి అర్హులవుతారు కానీ, రుణమాఫీకి అనర్హులవుతున్నారు. తొలుత రేషన్‌కార్డు ప్రామాణికమని ప్రకటించి, విమర్శలు రాగానే పట్టాదారు పాసుపుస్తకమని చెబుతున్నారు. రేషన్‌కార్డులో ఉన్న వారందరినీ ఒకే కుటుంబంగా పరిగణించి, కుటుంబంలో ఒక వ్యక్తికే రుణమాఫీ వర్తింపజేయడం వలన కుటుంబం నుంచి వేరు పడిన వారికి రుణమాఫీ వర్తించదు. ఆధార్‌కార్డు, పాస్‌బుక్‌, రేషన్‌కార్డు లేని కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. పాసుపుస్తకాల కోసం ధరణిలో 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రేషన్‌ కార్డులకు కూడా లక్షల్లో దరఖాస్తు చేసుకున్నారు. వ్యవసాయ రుణం తీసుకున్న స్వయం సహాయక బృందాలు,జాయింట్‌ లయబిలిటీ గ్రూపులు, రైతుమిత్ర గ్రూపులు, కౌలుదారులకు ఇచ్చిన లోన్‌ ఎలిజిబిలిటీ కార్డు ఉన్నవారికి రుణమాఫీ వర్తించకపోవడంతో ఈ నాలుగు గ్రూపుల్లోని దళిత, గిరిజన,వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుపేదలు నష్టపోతున్నారు. గత పదేండ్లుగా బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం వల్ల రైతులకు వడ్డీలు పెరిగాయి. అలాంటి రైతుల రుణం రెండు లక్షలకు పైగా ఉన్నది. పీఎం కిసాన్‌ డేటాకు రుణమాఫీని జోడించడం వల్ల చాలామంది రైతులు రుణ మాఫీ అర్హత కోల్పోతారు. రాష్ట్రంలో 72లక్షల మంది రైతులు ఉన్నప్పటికీ బ్యాంకులు 43 లక్షల మంది రైతులకు మాత్రమే అప్పులిచ్చాయి. పీఎం కిసాన్‌ పథకం కింద 31 లక్షల మందికే వర్తింపజేశారు. అందువల్ల పీఎం కిసాన్‌ డేటాను వర్తింప జేయడం వల్ల అర్హత కలిగినవారు రుణమాఫీ పొందలేకపోతారు. 2018 డిసెంబర్‌12 నుంచి 2023 సెప్టెంబర్‌ 12 మధ్య తీసుకున్న లోన్లను కొన్ని బ్యాంకులు జనవరి 2024 నుంచి రీ షెడ్యూల్‌ చేశాయి. బ్యాంకులు బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ ద్వారా రైతులకు రుణాలు పెంచుకుంటూ వస్తున్నా యి. ఈ నేపథ్యంలో 2023 డిసెంబర్‌ 9 తర్వాత రీ షెడ్యూల్‌ చేసిన రుణాలకు లేదా బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసిన రుణాలకు రుణమాఫీని వర్తింపజేయాలి. వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులు రుణాలు చెల్లించకపోవచ్చు.ఆ సందర్భంలో రుణమాఫీ తప్పనిసరి. ఇప్పటికే దాదాపు 13లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్‌లకు రాయితీలు కల్పించిన ఎన్డీయే సర్కార్‌ రైతుల విషయంలో ఉదాసీనంగా ఉండటం దారుణం.
శాశ్వత పరిష్కారాలు అవసరం
రుణమాఫీ అనేది పరిమిత వర్గాల రైతులకు స్వల్పకాలిక ఉపశమనాన్ని అందించగలదు. అది రైతులను అప్పుల విష వలయం నుండి బయటకు తీసుకురావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. 2008లో అఖిల భారత వ్యవసాయ రుణమాఫీ మొదటి తర్వాత వ్యవసాయ కష్టాలు తగ్గుముఖం పట్టడంపై కచ్చితమైన ఆధారాలు లేవు. దీర్ఘకాలంలో రైతుల ఆదాయాన్ని మెరుగు పరచడం, స్థిరీకరించడం ద్వారా తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బలోపేతం చేయడం మాత్రమే వారిని దూరంగా ఉంచడానికి ఏకైక మార్గం. నీటిపారుదల సామర్థ్యాలు, కోల్డ్‌ స్టోరేజీ చైన్‌లను నిర్మించడం, పంటల బీమా కవరేజీని పెంచడం, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిర్మాణం, సాంకేతికతతో కూడిన ఉత్పాదకత మెరుగుదల రైతులకు మంచి ఎంపికగా సహాయపడతాయి. రాష్ట్రాలు వ్యవసాయ రంగంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సంస్కరణలను అత్యవసరంగా చేపట్టి, చిత్తశుద్ధితో అమలు చేస్తే వ్యవసాయ కష్టాలు, రైతుల ఆదాయాలు మరింత మెరుగ్గా పరిష్కరించబడతాయి.ప్రత్యామ్నాయంగా రుణమాఫీ పరిమాణంపై పరిమితికి బదులుగా రుణంలో కొంత భాగాన్ని మాత్రమే మాఫీ చేయడం నైతిక ప్రమాదాలను నివారించడంలో మెరుగుదల అవుతుంది. వ్యవసాయ రంగంలో మిగులు కార్మికులను మరింత ఉత్పాదక రంగాలకు తీసుకెళ్లి ప్రజలందరికీ వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా, నిలకడగా మార్చగలిగే సజనాత్మక నిమగత కూడా అవసరం.

– నాదెండ్ల శ్రీనివాస్‌, 9676407140