ట్రంప్‌ గెలుపోటముల చుట్టూ అమెరికా రాజకీయం!

American politics around Trump's victory!అమెరికా అధ్యక్షుడు, రెండవసారి పోటీచేసేందుకు ప్రయత్నించిన డెమోక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ తాను పోటీ పరుగు నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం నాడు ప్రకటించటమే కాదు, అధ్యక్ష పదవి అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను బలపరుస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా చరిత్రలో అధికారంలో ఉండి పోటీ నుంచి తప్పుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కాడు. ముదిమితో మతి తప్పి మాట్లాడుతున్న 81ఏండ్ల బైడెన్‌ పోటీ నుంచి వైదొలగి వేరొకరికి అవకాశం ఇవ్వాలన్న ఒత్తిడి గత కొద్ది వారాలుగా వచ్చింది. అయినప్పటికీ పోటీలో ఉంటానని చెప్పిన పెద్దమనిషి ఆకస్మికంగా ప్రకటించటంతో డెమోక్రాట్లు కొత్త అభ్యర్థికోసం హడావుడి పడుతున్నారు. ఆగస్టు 19-22వ తేదీలలో పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఎన్నిక జరుగుతుంది. మరి కొంతమంది కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చినా బైడెన్‌ ప్రకటన తరువాత జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అనూహ్య పరిణామాలు జరిగే తప్ప డోనాల్డ్‌ ట్రంప్‌ను ఢకొీనబోయేది కమలాహారిస్‌ అని చెప్పవచ్చు. డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడి దిగజారినట్లు, హత్యాయత్నం జరిగిన తరువాత ట్రంప్‌ విజయావకాశాలు మరింత పెరిగినట్లు వార్తలు వచ్చిన పూర్వరంగం జోబైడెన్‌ నిర్ణయాన్ని వేగిరం కావించింది.
బైడెన్‌ నిర్ణయం అమెరికా లోపలా వెలుపలా, శత్రువులూ, మిత్రుల మధ్య చర్చనీయాంశమైంది. మిత్రదేశాల నేతలందరూ సానుకూలంగా మాట్లాడారు. ”ఇటీవలి సంవత్సరాలలో అమెరికాలో జరుగుతున్న పరిణామాలు మాకు ఒక అంశాన్ని నేర్పాయి, అదేమిటంటే దేని గురించి మేము ఆశ్చర్యపడాల్సిం దేమీ ఉండదు అని, ఈ అంశం అమెరికా ఓటర్లకు సంబంధిం చింది తప్ప మాది కాదు, భవిష్యత్‌లో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నదే మాకు చాలా ముఖ్యం, ఇప్పుడవి చరిత్రలో అత్యంత దిగజారిన స్థితిలో ఉన్నాయి” అని రష్యా ప్రతినిధి స్పందించారు. ఇది వారి అంతర్గత అంశమని చైనా పేర్కొన్నది.అయితే అక్కడి మీడియా, సామాజిక మాధ్యమంలో పెద్ద స్పందన వెలువడింది. నలభైకోట్ల మంది ఈ వార్తను చూసినట్లు లక్షలది మంది వ్యాఖ్యలు చేసినట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది. అధ్యక్ష పీఠంపై ఎవరు ఉన్నా అమెరికా పెద్దన్నకే అగ్రతాంబూలం అన్నట్లుగా వ్యవహరి స్తారన్నది తెలిసిందే. ఈ కారణంగానే ఎన్నికలు వారి అంతర్గత అంశమైనప్పటికీ అనేక దేశాల నేతలు స్పందించారు. అంతర్గతంగా కమలాహారిస్‌ గెలుస్తారా, ఆమె బలం, బలహీనతలు ఏమిటన్న చర్చ మొదలైంది. బైడెన్‌ ప్రకటన వెలువడగానే ఆమె స్పందించారు.” పార్టీని ఐక్యంగా ఉంచేందుకు చేయాల్సిందంతా చేస్తాను. డోనాల్డ్‌ ట్రంప్‌ను, ప్రమాదకరమైన అతగాడి ప్రాజెక్టు 2025 అజెండాను ఓడించేందుకు గాను దేశాన్ని ఐక్యం చేసేందుకు పూనుకుంటానని” పేర్కొన్నారు.
ప్రపంచంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులను పరిష్కరించటంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యం చెందింది. జనం దగ్గర దారిలో పరిష్కారాల కోసం చూస్తున్నారు. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్థతప్ప ఇప్పటికి మరొకటి లేదు. అయితే సోవియట్‌ యూనియన్‌, ఇతర దేశాల్లో జరిగిన ప్రయోగాలు, వాటి గురించి సోషలిజం అనుకూల శక్తులలోనే తలెత్తిన విబేధాలు, వ్యతిరేకులు చేసిన ఎదురుదాడి నేపధ్యంలో జనం గందరగోళంలో ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించేందుకు, కాపాడేందుకు అవసరమైతే నిర్బంధకాండకు సైతం సిద్ధపడే పచ్చిమితవాద, ఫాసిస్టు శక్తులు రంగంలోకి వస్తున్నాయి.ఐరోపాలో ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రాజెక్టు 2025ను రూపొందించిన హెరిటేజ్‌ ఫౌండేషన్‌ మితవాద, నిరంకుశుల అజెండా. ట్రంప్‌ అధికారానికి వస్తే అమలు జరుపుతారనే ప్రచారం ఉంది. దీన్ని జనంలోకి తీసుకెళ్తే జో బైడెన్‌ మరోసారి ఎన్నికౌతారని డెమోక్రాట్లు భావించారు. ఇప్పుడు రంగం నుంచి తప్పుకున్నప్పటికీ ట్రంప్‌ను దెబ్బకొట్టగలిగే అస్త్రం ఇదే అని వారు ఇప్పటికీ భావిస్తున్నారు.కమలా హారిస్‌ మాటల భావమిదే. అసలేమిటిది?
పచ్చి మితవాద భావజాల సంస్థ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ 1973లో ఉనికిలోకి వచ్చింది. వందకు పైగా అలాంటి బృందాల సలహాలతో 922 పేజీల విశ్లేషణ, సిఫార్సులే ప్రాజెక్టు 2025. దీని వెనకాల ఉన్నది ఎవరో నాకు తెలియదు.వారితో నాకెలాంటి సంబంధమూ లేదు అని ఇటీవల ట్రంప్‌ చెప్పుకున్నాడు. ఎన్నికలు ముగిసేవరకు ట్రంప్‌ ఇదే నాటకాన్ని కొనసాగిస్తాడన్నది తెలిసిందే. అయితే బుకాయించినా గతంలో అతని దగ్గర పనిచేసిన వారూ, మద్దతుదారులందరూ దాని రూపకల్పనలో భాగస్వాములే కనుక, దాన్నే అమలు జరుపుతారని వేరే చెప్పనవసరం లేదు. మన దేశంలో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ చేసిన సిఫార్సులు, ఆదేశాలను అమలు జరుపుతున్న పార్టీలేవీ ఎక్కడా బహిరంగంగా వాటి గురించి చెప్పరు. అవన్నీ తమ విధానాలే అని జనాన్ని నమ్మించేందుకు చూస్తాయి.తమ ముద్రవేసుకుంటాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ, తెలుగుదేశం, బీఆర్‌ఎస్‌ ఇలా ఏ పార్టీని చూసినా అదే కనిపిస్తుంది. అందుకే ఈ పార్టీల మధ్య అధికారం కోసం కుమ్ములాటలుంటాయి తప్ప విధానపరంగా ఎలాంటి ఘర్షణ ఉండదు. ఫాసిస్టు శక్తులు అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు వాటిని వ్యతిరేకించే మితవాద, వామపక్ష శక్తులందరూ ఇటీవలి ఫ్రెంచి పార్లమెంటు ఎన్నికల్లో చేతులు కలిపి ప్రస్తుతానికి ఆ ముప్పును తప్పించిన సంగతి తెలిసిందే. అమెరికాలో కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా అదే జరగనుందా?
అధ్యక్ష స్థానానికి ఎన్నికయ్యేవారు, నియమిత అధికార యంత్రాంగానికి ఇప్పుడున్న వాటి కంటే అధికారాలను మరింతగా కట్టబెట్టటం, మరింత కేంద్రీకరించటం ప్రాజెక్టు 2025లక్ష్యాలలో ఒకటి.అధికార దుర్వినియోగానికి ఇది బాటవేస్తుందని భావిస్తున్నారు. సంక్షేమ పధకాలకు కోతపెట్టాలని, నియంత్రణలను నామమాత్రం చేయాలని కార్పొరేట్‌, మితవాద శక్తులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి, అందువలన వీటి సాధన రెండవది.సామాజిక, మతపరమైన అంశాలలో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య వ్యత్యాసం ఉంది.అబార్షన్లను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారాలను వినియోగించాలని, గర్భనిరోధ పద్ధతులను పరిమితం చేయాలని, బూతుపై నిషేధం, ఆ ఇతివృత్తంతో తీసే సినిమాలు, సీరియళ్లు, ఇతర ఉత్పత్తులను సృష్టించేవారు, వాటిని పంపిణీ చేసే వారి మీద నిషేధం పెట్టాలని, శిక్షించాలన్న అజెండా కూడా దీనిలో ఉంది. ఇవన్నీ నిరంకుశ, తిరోగామి ప్రతిపాదనలని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఇవి కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలూ కావు.వీటిని అమలు జరిపేందుకు తగిన వాడు ట్రంప్‌ అని భావించటమే తాజాదనం. తన ఓటమిని అంగీకరించకుండా, జోబైడెన్‌ ఎన్నికను అధికారికంగా ప్రకటించకుండా అడ్డుకొనేందుకు అమెరికా అధికార కేంద్రం మీద దాడి చేయించిన ట్రంప్‌కే ఈ అజెండాను అమలు చేసే దమ్ము ఉంటుదని అనేక మంది గట్టిగా భావిస్తున్నారు. ఇదే మితవాదులను వ్యతిరేకించేవారిలో ఇటీవల ఆందోళనను పెంచుతోంది. లక్షలాది మంది పౌర ఉద్యోగులను తొలగించి తన మద్దతుదార్లను నియమించేందుకు 2020లో ట్రంప్‌ నిర్ణయించాడు. అయితే అమలు జరిపే సమయానికి ఎన్నికల్లో ఓడి పదవి నుంచి దిగిపోయాడు. ఆ నిర్ణయాన్ని బైడెన్‌ రద్దు చేశాడు. ఇప్పుడు ట్రంప్‌ గెలిస్తే తన అజెండాను అమలు జరపవచ్చని భావిస్తున్నారు. విద్యా శాఖను రద్దు చేసి అమ్మఒడి-తల్లికి వందనం పేరుతో అమ్మలకు ఇస్తున్న నగదు మాదిరే ప్రయివేటు స్కూళ్లకు పంపే తలిదండ్రులకు నగదు ఇవ్వాలని మితవాదులు కోరుతున్నారు. తక్కువ రాబడి వచ్చే స్కూళ్లకు నిధుల నిలిపివేత, మధ్యాహ్న భోజన పధకాల రద్దు, విద్యారుణాలను విధిగా వసూలు చేయాలనే చర్యలు చేపట్టవచ్చు. పర్యావరణ హాని నివారణ చర్యలను నిలిపివేయాలని, హరిత ఇంథన సబ్సిడీలను ఎత్తివేయాలని, చమురు, గ్యాస్‌ వెలికితీతపై పర్యావరణ ఆంక్షలను రద్దు చేయాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమంగా వచ్చిన వారికి విద్యా రుణాలు ఇవ్వకూడదని, ప్రభుత్వ సహాయం పొందే గృహాల్లో వారికి అవకాశం కల్పించరాదని, అక్రమ ప్రవేశాల నిరోధానికి సరిహద్దుల్లో అశ్వికదళాలను తిరిగి నియమించటమే గాక విస్తరించాలని కోరుతున్నారు. ఇలాంటి ప్రతిపాదనలతో ఉన్నదే ప్రాజెక్టు 2025. దీని రూపకల్పనలో భాగస్వాములు, వాటితో ఏకీభవించేవారిని యంత్రాంగంలో నియమించి వారి పేరుతో అమలు జరిపించేందుకు ట్రంప్‌ చూస్తున్నారని పురోగామివాదులు అనేక మంది హెచ్చరిస్తున్నారు.
హెరిటేజ్‌ ఫౌండేషన్‌కు నిధుల కొరత లేదు. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక కావాలనేదానికంటే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే రీతిలో తన మనుషులను యంత్రాంగంలోకి పంపేందుకే ఇది ప్రాధాన్యత ఇస్తుంది. ఇరవైవేల మంది సుశిక్షుతులైన కార్యకర్తలు, ఇరవైలక్షల మంది స్వచ్చంద కార్యకర్తలు దీనికి ఉన్నట్లు అంచనా. దాని అజెండాను అమలు జరిపేందుకు, ప్రజాప్రతినిధులను ప్రభావితం చేసేందుకు, సామాజిక మాధ్యమంలో జనాన్ని సమీకరించేందుకు వారంతా రంగంలోకి దిగుతారు. అనేక మందిని పార్లమెంటరీ కార్యాలయాల్లోకి ఇప్పటికే చొప్పించింది.ట్రంప్‌ యంత్రాంగంలో 2017నాటికి 70 మంది ఈ సంస్థతో సంబంధం ఉన్నవారున్నారు.వారిలో నలుగురు మంత్రులు. ఈ సంస్థ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి రిపబ్లికన్లు మరింత మితవాదం వైపు మొగ్గేందుకు చేయాల్సిందంతా చేస్తోంది.1981లో రోనాల్డ్‌ రీగన్‌ అధికారంలోకి వచ్చినపుడు దీని అజెండాలో 60శాతం అమలు జరిపాడు. ట్రంప్‌ తొలిసారి అధికారంలో ఉన్నపుడు దీని సిఫార్సుల్లో 64శాతం అమలు చేశాడంటే దీని సత్తా ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. రిచర్డ్‌ నిక్సన్‌ హయాంలో 1973లో ఉనికిలోకి వచ్చిన ఈ సంస్థ నిర్వాహకులు తాము కమ్యూనిజానికి వ్యతిరేకమని, కార్పొరేట్లకు అనుకూలమని, క్రైస్తవ మత భావజాలానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పుకున్నారు. తాజా విషయానికి వస్తే ట్రంపిజాన్ని వ్యవస్థీకృతం కావించేందుకు తాము పనిచేస్తామని ఫౌండేషన్‌ అధ్యక్షుడు కెవిన్‌ డి రాబర్ట్స్‌ న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికతో చెప్పాడు. అమెరికా ఇప్పుడు రెండవ విప్లవక్రమంలో ఉందని, అది రక్తపాత రహితంగా ఉంటుందని కూడా ఒక టీవీ చర్చలో చెప్పాడు. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఈ అంశాలను జనంలోకి తీసుకువెళ్లగలిగితే నల్లేరు మీద బండిలా సాగుతుందనుకుంటున్న ట్రంప్‌ ఎన్నిక తిరగబడినా ఆశ్చర్యం లేదు.
అయితే అది అంత తేలిక కాదు. ఇప్పటికే జోబైడెన్‌ ప్రతిష్ట దిగజారింది. దాని ప్రభావం కమలాహారిస్‌ మీద కూడ పడుతుంది.వ్యక్తిగా బైడెన్‌ కంటే అతగాడి విధానాల ఫలితంగానే పలుకుబడి తగ్గటమే దీనికి కారణం. రెండవది ఊపు మీద ఉన్న ట్రంప్‌ మద్దతుదార్లు ఆమె మీద పెద్ద ఎత్తున ప్రచారదాడికి దిగే అవకాశం ఉంది. గార్డియన్‌ పత్రిక పేర్కొన్న సమాచారం ప్రకారం పోటాపోటీగా ఉన్న పెన్సిల్వేనియా, జార్జియా, అరిజోనా వంటి రాష్ట్రాలలో టీవీ ప్రకటనల కోసం 50లక్షల డాలర్లను కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా అబార్షన్ల వంటి అంశాలపై ఆమె అభిప్రాయాల మీద రెచ్చగొట్టే అవకాశం ఉంది.కమలా హారిస్‌ తల్లి భారతీయ మూలాలున్న మహిళ, తండ్రి ఆఫ్రికన్‌. అందువలన మనదేశంలోని వారు మనమ్మాయి అన్నట్లుగా ప్రచారం చేసుకున్నా అమెరికాలో ఆమెను ఒక ఆఫ్రికన్‌గానే చూస్తారు. శ్వేతజాతి అహంకారం ఉన్న అమెరికాలో దాన్ని కూడా ముందుకు తీసుకురావచ్చు.ఆమె అభ్యర్థిత్వం ఖరారైన తరువాత తలెత్తే పరిణామాల గురించి మరోసారి చూద్దాం!

– ఎం కోటేశ్వరరావు, 8331013288.