చెంచు జాతి అంతరించిపోతోంది. ఆ జాతికి ఆదరణ కరువైంది. ఐదవ షెడ్యూల్ ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టే నాధుడే లేడు. ఇటీవల కొల్హాపూర్ మండలం, మొలచింతపల్లి గ్రామంలో ఈశ్వరమ్మపై జరిగిన పాశవిక లైంగిక దాడే దీనికి తాజా ఉదాహరణ. తీగలాగితే డొంకంతా కదిలినట్టు చెంచుల అత్యంత దయనీయమైన జీవితాలు వెలుగులోకి వచ్చాయి. ఇది కేవలం ఓ మహిళపై జరిగిన హింస మాత్రమే కాదని, ఆ జాతుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, పెత్తం దార్ల దాష్టికానికి నిదర్శనమని తేలింది. ఏండ్ల నుండి ఆ జాతులెదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు ప్రధాన ఎజెండాగా మారాయి.
కొల్లాపూర్ చుట్టూ ఉన్న నల్లమల అడవిలో 16 చెంచు పెంటల(గూడాలు)ను 90వ దశకంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సాయంతో బలవంతంగా ఖాళీ చేయించింది. నక్సలైట్లకు అన్నం పెడుతున్నారనే కారణాన్ని దీనికి వాడుకుంది. మొలచింతలపల్లి గ్రామంలో భ్రమరాంబిక కాలనీ ఏర్పాటు చేసి అక్కడ వీరిని వదిలిపెట్టారు. కానీ అక్కడ వీరి ఆశ్రయం భ్రమలాగే మిగిలింది. అప్పటి వరకు పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటూ, ఆహారాన్ని సేకరించు కుంటూ జీవనం గడిపే వీరు మైదానం ప్రాంతంలో బతుకు పోరాటం మొదలుపెట్టారు.
అడవి నుంచి గ్రామానికి తరలించడంతో జీవన విధానంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులను తట్టుకోలేకపోయారు. ఒడ్డున పడ్డచేపల్లా విలవిల్లాడి పోయారు. ఆనాటి నుండి భూమి లేక, ఆహారాన్ని సేకరించుకునే దారిలేక అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఉండటానికి ఇల్లు, బతకడానికి ఉపాధి, పిల్లలు చదువుకోడానికి పాఠశాలలు, చివరకు సరైన వైద్య సదుపాయాలు కూడా లేవు. అంతెందుకు వీరెవరికీ ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు సైతం లేవు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకారం వీరంతా కనీసం తమ పౌరసత్వాన్ని కూడా నిరూపించుకోలేని దుస్థితిలో బతుకుతున్నారన్నమాట!
రాష్ట్రంలో అంతరించి పోతున్న జాతుల్లో చెంచులతో పాటు కొలామ్స్, తోటి, ఆమ్ద్, కొండరెడ్డి వంటి జాతులు కూడా ఉన్నాయి. ఆదివాసీల హక్కులు, వాటి అమలులో ప్రభుత్వ చూపుతున్న నిర్లక్ష్యమే దీనికి కారణం. రక్షించాల్సిన వారే భక్షిస్తుంటే ఆ జాతులు అంతం కాక అభివృద్ధి ఎలా చెందుతాయి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం గిరిజనులను కొల్లగొట్టే విధానాలనే అనుసరిస్తున్నా యి. అడవి భూములను కార్పొరేట్లకు కట్టబెడుతూ జల్, జంగిల్, జమీన్‌కు అడవి బిడ్డలను దూరం చేస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి బడ్జెట్‌లో అంతరించిపోతున్న జాతులకు ఇండ్లు నిర్మిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నది. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. దీనికి నల్లమల చెంచులే ఉదాహరణ. అలాగే 2006లో ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇవ్వాలని చట్టం వచ్చింది. దీన్ని ఎక్కడా అమలు చేయడం లేదు.
ఇక రాష్ట్రంలో భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు, మన్ననూర్ కేంద్రాలుగా నాలుగు ఐటీడీఏలున్నాయి. వీటిలో దేనికీ ప్రాజెక్ట్ ఆఫీసర్లు లేరు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్‌లోని మన్ననూర్ ఐటీడీఏకి సైతం ప్రాజెక్ట్ ఆఫీసర్ లేరు. ముఖ్యమంత్రి సొంత జిల్లా పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగిలిన జిల్లాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన పనిలేదు. ఈశ్వరమ్మ ఘటన జరిగింది కూడా ఈ ఐటీడీఏ పరిధిలోనే. అలాగే రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఆదివాసీ ఎమ్మెల్యేలతో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. ఆదివాసీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఇంతకు మించి మరో ఉదాహరణ అవసరం లేదనుకుంటా!
ఐదో షెడ్యూల్ ప్రాంతంలో జీవించే వారి సమస్యలు పరిష్కరించే హక్కు రాజ్యాంగం గవర్నర్‌కు ఇచ్చింది. చివరకు గవర్నర్లు సైతం వారి బాధ్యత మర్చిపోతున్నారు. అందుకే టీఏజీఎస్ ప్రతినిధి బృందం ఇటీవల గవర్నర్‌ను కలిసి సమస్య విన్నవించి, బాధ్యత గుర్తు చేసింది. ఐదో షెడ్యూల్ ప్రాంతంలోని గ్రామాన్ని ఖాళీ చేయిస్తే తిరిగి వారికి ఐద షెడ్యూల్ ప్రాంతంలోనే పునరావాసం కల్పించాలి. లేదంటే వారికి పునరావాసం కల్పించిన ప్రాంతాన్నయినా ఐదో షెడ్యూల్లో చేర్చాలనే నిబంధన ఉంది. కానీ ప్రభుత్వాలు ఇవేవీ పట్టించుకోవడం లేదు. దాంతో ఆ జాతులు ఉపాధి కోసం వెళ్లి పెత్తందార్ల దాష్టికాలకు బలైపోతున్నాయి. అలా బలైపోయిందే ఈశ్వరమ్మ కుటుంబం.
ఎన్నికలప్పుడు ఆదివాసీలను తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్న ప్రభుత్వాలు వీరి సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ జాతులు పూర్తిగా అంతరించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి. ఆదివాసీల జీవితాల పట్ల అవగాహన ఉన్న మాజీ ఐఏఎస్ అధికారులను ఐటీడీఏలకు ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా నియమించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే పథకాల్లో ఈ జాతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అన్నింటికంటే ముఖ్యంగా వీరి రక్షణ విషయంలో ప్రభుత్వాలు పూర్తి బాధ్యత తీసుకుంటేనే చెంచు జాతి మిగులుతుంది, బతుకుతుంది.