మున్సిపాలిటీలలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలి

–  పారిశుధ్యం పై  దృష్టి కేంద్రీకరించాలి
– తాగు నీటి పైప్ లైన్ లీకేజీలు వెంటనే అరికట్టాలి 
–  షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రాణహాని జరకుండా చర్యలు చేపట్టాలి
– విధులకు సక్రమంగా హాజరు కావాలి
– త్వరలో మున్సిపాలిటీల ఆకస్మిక తనిఖీ
– జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఈనెల 26 నుండి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇంటింటి జ్వర సర్వే లో భాగంగా తక్షణమే మెప్మా సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేయాలని, ఈ బృందాలకు గురువారం శిక్షణ ఇవ్వాలని, శుక్రవారం నుండి సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. బృందాలు ఇంటింటికి తిరగాలని, పూర్తి వివరాలు సేకరించాలని, ఎవరికైనా జ్వరం ఉన్నట్టు గుర్తించినట్లయితే చికిత్స తో పాటు, ప్రతిరోజు  వారి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవాలని,  ప్రజలు జ్వరం వచ్చినప్పటికి నిర్లక్ష్యంగా ఉండకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు వాడే విధంగా  అవగాహన కల్పించాలని ఇంటింటి జ్వర సర్వేలో అన్ని వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని అన్నారు. ఇంటింటి జ్వర సర్వేతో పాటు, దోమల  వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, గడ్డి కోత యంత్రాలను విరివిగా  వినియోగించాలని,నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని,  శానిటేషన్ విషయంలో ఎట్టి పరిస్థితులలో రాజీ పడవద్దని, వచ్చేవారం నుండి తాను మున్సిపాలిటీలలో తనిఖీలు నిర్వహిస్తానని హెచ్చరించారు. మున్సిపాలిటీ లలో  తాగు నీరు కలుషితం కాకుండా లీకేజీలను గుర్తించి వెంటనే అరికట్టాలని, తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని, ఎక్కడైనా మరమ్మతులు వచ్చినట్లయితే వెంటనే చేయించాలని అన్నారు. కంచలేని ట్రాన్స్ఫార్మర్లకు తక్షణమే కంచెలు ఏర్పాటు చేయాలని, బహిరంగ ప్రదేశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రాణ హాని జరగరాదని, వీధిలైట్లకి ఇన్సులేషన్ ఫెయిల్ కాకుండా చూసుకోవాలని, తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలు గుర్తించి  ప్రమాదం జరగకుండా తొలగించాలని ఆదేశించారు.
మహిళా శక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి…
మహిళా శక్తికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, యూనిట్లు విజయవంతంగా  నడిచే విధంగా చర్యలు చేపట్టాలని, ముందుగా  యూనిట్ల ఏర్పాటుపై విశ్లేషణ చేయాలని, వాణిజ్య ప్రదేశాలలో మహిళ శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని, అన్ని మున్సిపాలిటీలలో కనీసం ఒక్క క్యాంటీన్ అయిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు.వనమహోత్సవం ఉద్దేశ్యం నెరవేరేలా మొక్కలు నాటాలని, వాటి సంరక్షణపై దృష్టి సారించాలన్నారు. మున్సిపాలిటీలు  శుభ్రంగా ఉండేలా చూడాలని, సిబ్బంది సమయ  పాలన పాటించాలని,  పని నిమిత్తం మున్సిపల్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సరైన విధంగా సమాధానం ఇవ్వాలని, సమస్య పరిష్కారం కాకపోతే స్పష్టంగా తెలియజేయాలని, పరిష్కారం అయ్యేవి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర,డి ఎం హెచ్ ఓ డాక్టర్ కల్యాణ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్లు, డిపిఎం మేనేజర్లు తదితరులు హాజరయ్యారు.