అక్షరాస్యత ద్వారా ఆత్మవిశ్వాసంతో ముందడుగు

అక్షరాస్యత ద్వారా ఆత్మవిశ్వాసంతో ముందడుగు– మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌
నవతెలంగాణ-కాసిపేట
అక్షరాస్యత ద్వారా ఆత్మవిశ్వాసంతో ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించేందుకు ముందడుగు వేయవచ్చని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం జిల్లాలోని మండలం దేవాపూర్‌ గ్రామంలోని పంచాయతీ కమ్యూనిటీ హాల్లో జిల్లా వయోజన విద్యాశాఖ, పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ సంయుక్తగా 100 రోజులలో అక్షరాస్యులై కుట్టుశిక్షణ పూర్తి చేసుకున్న వారికి జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తంనాయక్‌, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ తిరుపతిలతో కలిసి ద్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అక్షరాస్యతతో నవసమాజ నిర్మాణం జరుగుతుందని, నాగరికత పెరుగుతుందని అన్నారు. కుట్టుశిక్షణ కేంద్రాలలో శిక్షణ పొందిన వారు శిక్షణను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. నేటి ఆధునిక విధానానికి అనుగుణంగా మెళకువలు నేర్చుకొని సమాజంలో ముందుకు సాగాలని, సంపూర్ణ అక్షరాస్యతకు సహకరిస్తున్న పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ అందించిన సహకారం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ రెడ్డిమల్ల ప్రకాష్‌, డీఆర్‌పీలు పోకల వెంకటేశ్వర్లు, బండ శాంకరి, సమన్వయకర్తలు సంధ్య, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. బుధవారం మండలంలోని తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, మండల ప్రత్యేక అధికారి గంగారాంలతో కలిసి ఆకస్మికంగా సందర్శించి రిజస్టర్లు, రికార్డులు పరిశీలించారు. ప్రజాపాలన కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిశీలనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన లబ్దిదారులకు అందేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి సత్యనారాయణ సింగ్‌, తహసీల్దార్‌ భోజన్న, మండల పంచాయతీ అధికారి సర్దర్‌ అలీ పాల్గొన్నారు.